Share News

మండుతున్న యూరప్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 07:14 AM

కరుగుతున్న రోడ్లు.. వేడికి వంగిపోతున్న ట్రాఫిక్‌ లైట్లు.. రోడ్లకు అతుక్కుపోతున్న వాహనాల టైర్లు.. వేగం తగ్గిపోయిన రైళ్లు.. రోడ్ల వెంట ప్రజలపై ఫైరింజన్లతో నీళ్లు.. వీధుల్లో ఎక్కడిక్కడ నీటి జల్లుల (మిస్ట్‌) షవర్లు..

మండుతున్న యూరప్‌

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. కరుగుతున్న రోడ్లు, వాహనాల టైర్లు, వేడికి వంగిపోతున్న ట్రాఫిక్‌ లైట్లు

మండే ఎండలతో అల్లాడుతున్న జనం

ఏసీలు, కూలింగ్‌ వ్యవస్థల కోసం క్యూలు

బీచ్‌లు, సరస్సులకు ఎగబడుతున్న వైనం

రోడ్లు, వీధుల్లో నీటిని చిమ్ముతున్న ప్రభుత్వాలు

ఫుట్‌పాత్‌లపై నీటి తుంపరలు, మిస్ట్‌ ఫ్యాన్లు

కార్ల బానెట్లపై ఆమ్లెట్లు వేస్తూ వీడియోలు

వృద్ధులు ఎక్కువగా ఉండడంతోనూ సమస్య

అధిక ఉష్ణోగ్రతలతో వందల మంది మృతి

‘వేడి’ దెబ్బ తెలియక యూరప్‌ అతలాకుతలం

కరుగుతున్న రోడ్లు.. వేడికి వంగిపోతున్న ట్రాఫిక్‌ లైట్లు.. రోడ్లకు అతుక్కుపోతున్న వాహనాల టైర్లు.. వేగం తగ్గిపోయిన రైళ్లు.. రోడ్ల వెంట ప్రజలపై ఫైరింజన్లతో నీళ్లు.. వీధుల్లో ఎక్కడిక్కడ నీటి జల్లుల (మిస్ట్‌) షవర్లు.. ఇన్నాళ్లూ చల్లదనానికి చిరునామాగా నిలిచిన యూర్‌పలో ప్రస్తుత పరిస్థితి. ఎన్నడూ లేనట్టుగా తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో యూరప్‌ దేశాలు తల్లడిల్లుతున్నాయి. చల్లదనం కోసం జనం అల్లాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులను తట్టుకోలేక రోజూ వందలాది ప్రాణాలు ఎండలో కలిసిపోతున్నాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ, పోర్చుగల్‌, గ్రీస్‌ తదితర దేశాలు కుతకుతలాడుతున్నాయి. డెన్మార్క్‌, బ్రిటన్‌, హంగరీ, రొమేనియా, పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌ తదితర దేశాలూ సాధారణానికి మించిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడుతున్నాయి. వాహనాల బానెట్లపై ఆమ్లెట్లు వేస్తూ ఎండ వేడి తీవ్రతను చూపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలతో..

ఏటా మే మధ్య నుంచి ఆగస్టు వరకు యూరప్‌ దేశాల్లో వేసవికాలం ఉంటుంది. అందులోనూ ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఫ్రాన్స్‌, జర్మనీలలో వేసవి సహా ఎన్నడూ 36 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలు ఇప్పుడు 44 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. స్పెయిన్‌, పోర్చుగల్‌లలోని కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు చేరాయి. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల స్థాయిలోనే ఉంటున్నాయి. దీనితో వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఎండదెబ్బతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. మరోవైపు వేడిని తట్టుకునేందుకు ఏసీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. విద్యుత్‌కు తీవ్ర డిమాండ్‌ ఏర్పడి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు వడదెబ్బలతో రోజూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యూరప్‌ జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. అలాంటి వారు వేడిని తట్టుకోలేకపోతున్నారు.


వీధుల్లో స్ర్పింక్లర్లతో నీటిని చల్లుతూ..

ఫ్రాన్స్‌, జర్మనీ సహా యూరప్‌ దేశాల్లోని చాలా పట్టణాల్లో పోలీసులు వాటర్‌ క్యానన్ల ద్వారా రోడ్లపై, వీధుల్లో, ప్రజలపై నీళ్లు వెదజల్లుతున్నారు. ప్రజలు సేదదీరేలా కీలక ప్రాంతాల్లో కూలింగ్‌ జోన్లు, తాత్కాలికంగా నీడనిచ్చే షెడ్లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై, వీధుల్లో నీటి స్ర్పింక్లర్లు, మిస్ట్‌ ఫ్యాన్లు అమర్చారు. వివిధ పనుల కోసం బయటికి వెళ్తున్న ప్రజలు వాటి వద్ద కాసేపు నిలబడి చల్లదనం పొందుతున్నారు. పెంపుడు జంతువుల కోసం కూడా కూలర్లు, ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు చల్లదనం కోసం జనం బీచ్‌లు, సరస్సులు, హిల్‌స్టేషన్లకు క్యూ కడుతున్నారు. దీనితో ఆయా ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని బీచ్‌లలో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకుండా పోతోంది.

అట్లాంటిక్‌ వేడెక్కడం వల్లే..

వాతావరణ మార్పులతో పెరుగుతున్న భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌)తోపాటు అట్లాంటిక్‌ సముద్ర జలాలు సాధారణానికి మించి వేడెక్కడమే యూర్‌పలో ప్రస్తుత పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు పసిఫిక్‌ మహా సముద్రంలో లానినాతో ఆసియా, ఆఫ్రికా తూర్పుతీరం, ఆస్ట్రేలియా దేశాలు అల్లాడుతున్నట్టుగానే.. అట్లాంటిక్‌ ప్రభావంతో యూరప్‌ ఇబ్బందిపడుతోందని వివరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో జర్మనీ, గ్రీస్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీలలో కార్చిచ్చులు చెలరేగాయి. నదులు, జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. దీనితో నీటి సరఫరా తగ్గించి, వినియోగంపై ఆంక్షలు విధించారు. అధిక వేడితో రైలు పట్టాలు సాగి వంగుతుండటంతో ప్రమాదాలు జరగకుండా రైళ్ల వేగాన్ని తగ్గించేశారు.

(సెంట్రల్‌ డెస్క్‌)


‘వేడి’ దెబ్బ తెలియక!

మన దగ్గర సాధారణంగానే 35-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు, వేసవిలో 40 డిగ్రీలకుపైన ఉండటంతో.. ఆ వేడిని తట్టుకునేలా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాం. అయితే భూమి ఉత్తరార్ధగోళంలో ఎగువన ఉన్న యూరప్‌ దేశాలు ఏడాది పొడవునా చల్లగా ఉంటాయి. 15 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. చలికాలంలో అయితే 2, 3నెలలు మంచు కురుస్తుంది. దీనితో ఆ దేశాలన్నీ కూడా చల్లదనాన్ని ఎదుర్కొనేలా సిద్ధమయ్యాయే తప్ప.. ‘వేడి’ని తట్టుకోగలిగే ఏర్పాట్లేమీ చేసుకోలేదు. అధిక ఉష్ణోగ్రతలతో రోడ్లు కరిగిపోతున్నాయి. వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయి. అక్కడ ఇళ్లు, ఆస్పత్రులు, స్కూళ్లు, ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలన్నీ కూడా బయటి నుంచి చల్లటి గాలి రాకుండా నిర్మిస్తూ ఉంటారు. సరైన వెంటిలేషన్‌ ఉండదు. పైగా ఎండ వేడిని గ్రహించి వెచ్చగా ఉంచేలా ఏర్పాట్లు ఉంటాయి. ఏసీల వినియోగం కూడా తక్కువ. సుమారు 20శాతం ఇళ్లలోనే ఏసీలు ఉంటాయని అంచనా.

ఇవి కూడా చదవండి

అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం

ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు

Updated Date - Jul 01 , 2026 | 07:14 AM