Share News

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం.. బిల్‌ గేట్స్ లైంగిక వ్యాధి బారినపడ్డారంటూ ఆరోపణలు

ABN , Publish Date - Jan 31 , 2026 | 10:57 AM

రష్యా యువతులతో సన్నిహితంగా మెలిగిన బిల్ గేట్స్ లైంగిక వ్యాధి బారిన పడ్డారంటూ ఎప్‌స్టీన్ ఆరోపించిన ఈమెయిల్స్‌ తాజాగా కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ప్రతినిధి తోసిపుచ్చారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం.. బిల్‌ గేట్స్ లైంగిక వ్యాధి బారినపడ్డారంటూ ఆరోపణలు
Epstein Files- Bill Gates

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాను కుదిపేస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు లైంగిక నేరాలకు పాల్పడి చివరకు జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించి అమెరికా ప్రభుత్వం తాజాగా మరిన్ని డాక్యుమెంట్స్‌ను విడుదల చేసింది. ఈ దస్త్రాల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌‌పై సంచలన ఆరోపణలు వెలుగుచూడటంతో ప్రస్తుతం కలకలం రేగుతోంది.

రష్యా యువతులతో సన్నిహితమైన బిల్ గేట్స్ చివరకు లైంగిక వ్యాధి బారినపడ్డట్టు తాజా ఫైల్స్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఎప్‌స్టీన్ తన ఈమెయిల్స్‌లో పేర్కొన్నాడు. వాటిని న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. వ్యాధి బారిన పడ్డాక బిల్‌ గేట్స్ తన భార్య మెలిండాకు సీక్రెట్‌గా ఇచ్చేందుకు యాంటీబయాటిక్స్‌ కావాలని ఎప్‌స్టీన్‌ను కోరారట. 2013లో ఎప్‌స్టీన్ రాసుకున్న కొన్ని డ్రాఫ్ట్ మెయిల్స్‌లో ఈ విషయాలను అతడు పేర్కొన్నాడు. రష్యా యువతుల వల్ల గేట్స్‌కు వ్యాధి సంక్రమించిందని ఎప్‌‌స్టీన్ ఆరోపించాడు. ఆ మెయిల్స్‌ను డిలీట్ చేయమని కూడా గేట్స్ తనను కోరినట్టు ఆరోపించాడు. గేట్స్‌ తనతో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టినందుకు కూడా ఆగ్రహం కలిగిందని ఎప్‌స్టీన్ రాసుకొచ్చాడు. ఆరేళ్లుగా ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను ఎలా తెంచుకుంటాడని ఎప్‌స్టీన్ తన ఈమెయిల్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఈ ఉదంతంపై బిల్ గేట్స్ ప్రతినిధి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమని, అవాస్తవాలని మండిపడ్డారు. గేట్స్‌తో స్నేహం చెడినందుకు ఎప్‌స్టీన్ నిరాశ చెంది ఇలా అవాకులు చవాకులకు దిగారని ఆరోపించారు. అవతలివారిని ఉచ్చులోకి దింపేందుకు ఎప్‌స్టీన్ ఏం చేసేందుకైనా వెనకాడడన్న విషయం ఆ ఈమెయిల్స్‌తో స్పష్టంగా రుజువైనట్టు వ్యాఖ్యానించారు.

అమెరికా న్యాయశాఖ తాజాగా ఈ కేసుకు సంబంధించి 3 మిలియన్ పేజీలకు పైగా డాక్యుమెంట్స్‌ను విడుదల చేసింది. అయితే, ఈ డాక్యుమెంట్స్‌లో పేరున్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదని స్పష్టం చేసింది. ఈ డాక్యుమెంట్స్‌లో ప్రస్తావించిన వారికి ఎప్‌స్టీన్ నేరాలు తెలిసుండొచ్చన్న భావన తప్పని కూడా పేర్కొంది.


ఇవీ చదవండి:

ఇజ్రాయెల్‌కు 6.67 బిలియన్ డాలర్ల ఆయుధాలు.. అమెరికా నిర్ణయం

భారత్‌కు వెనెజువెలా ముడి చమురు.. అమెరికా ఆఫర్

Updated Date - Jan 31 , 2026 | 12:45 PM