Share News

ఇజ్రాయెల్‌కు 6.67 బిలియన్ డాలర్ల ఆయుధాలు.. అమెరికా నిర్ణయం

ABN , Publish Date - Jan 31 , 2026 | 08:57 AM

ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో ఆయుధాల సరఫరాకు అమెరికా సిద్ధమైంది. 6.67 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, ఇతర మిలిటరీ వాహనాలు, ఆయుద్ధ సంపత్తిని విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది.

ఇజ్రాయెల్‌కు 6.67 బిలియన్ డాలర్ల ఆయుధాలు.. అమెరికా నిర్ణయం
US Israel weapons deal

ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించింది. మొత్తం 6.67 బిలియన్ డాలర్ల ఆయుధాల సరఫరాకు సంబంధించిన డీల్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం అమెరికా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.

ఏమిటీ డీల్..

ఈ డీల్‌లో భాగంగా అమెరికా ఇజ్రాయెల్‌కు 30 అపాచీ అటాక్ హెలికాప్టర్‌లు, రాకెట్ లాంచర్లు, టార్గెటింగ్ వ్యవస్థలు, ఇతర అత్యాధునిక ఆయుధాలను అందించనుంది. అపాచీ హెలికాప్టర్‌లతో ఇజ్రాయెల్ వైమానిక దళం మరింత శక్తిమంతం అవుతుందని అమెరికా అధికారులు తెలిపారు. వీటి విలువే 3.8 బిలియన్ డాలర్లకు మించి ఉంటుందని అన్నారు. వీటితో పాటు 1.98 బిలియన్ డాలర్ల విలువ చేసే 3,250 తేలికపాటి టాక్టికల్ వాహనాలను కూడా అమెరికా అందించనుంది. సుదీర్ఘ సైనిక చర్యల్లో దళాల తరలింపునకు ఈ వాహనాలు కీలకమని అమెరికా చెప్పింది.


ఇజ్రాయెల్ స్వీయ రక్షణకు, ఆ ప్రాంతంలో శాంతిస్థాపనకు అత్యాధునిక ఆయుధాలను అందించాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరాన్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న తరుణంలోనే ఇజ్రాయెల్‌కు ఈ స్థాయిలో ఆయుధాల సరఫరాకు అమెరికా సిద్ధం కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌కు పలు హెచ్చరికలు చేశారు.

ఇక యుద్ధ భయాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ కూడా చర్చలకు సిద్ధమేనని చెబుతోంది. అమెరికాతో చర్చలకు తాము రెడీగానే ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. అయితే, న్యాయం, సమానత్వం ప్రాతిపదికగా జరిగే చర్చలకు మాత్రమే తాము అంగీకరిస్తామని కూడా తేల్చి చెప్పారు.


ఇవీ చదవండి:

భారత్‌కు వెనెజువెలా ముడి చమురు.. అమెరికా ఆఫర్

కాంగోలో కుప్పకూలిన గని.. 200 మంది దుర్మరణం..

Updated Date - Jan 31 , 2026 | 11:45 AM