భారత్ నుంచి పాక్‌కు పాకిన 'కాక్రోచ్ పార్టీ' వైరల్ రాజకీయం!
ABN , Publish Date - May 22 , 2026 | 09:36 PM
భారత సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రంగా మొదలై, సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఉద్యమం ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు కూడా పాకింది. భారతీయ డిజిటల్ ట్రెండ్‌ను స్ఫూర్తిగా తీసుకుని పాకిస్తాన్ నెటిజన్లు కూడా అక్కడ సరికొత్త వ్యంగ్య రాజకీయ ఖాతాలను తెరుస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, మే 22: భారత సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రంగా (Satire) మొదలై, సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఉద్యమం ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు కూడా పాకింది. భారతీయ డిజిటల్ ట్రెండ్‌ను స్ఫూర్తిగా తీసుకుని పాకిస్తాన్ నెటిజన్లు కూడా అక్కడ సరికొత్త వ్యంగ్య రాజకీయ ఖాతాలను తెరుస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
పాకిస్తాన్‌ను ముంచెత్తుతున్న 'బొద్దింకల' పార్టీలు!
భారత్‌లో మే 16న ప్రారంభమైన ఈ సరికొత్త వ్యంగ్య ఉద్యమం కేవలం వారం రోజుల్లోనే కోట్లాది మందిని ఆకర్షించింది. ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా దీనికి ప్రతిరూపాలు వెలిశాయి. అక్కడ రకరకాల పేర్లతో ఖాతాలు వెలుస్తున్నాయి.
కాక్రోచ్ అవామీ పార్టీ (దీని బయోలో 'యువత కోసం, యువత చేత నడపబడే పాకిస్తాన్ రాజకీయ వేదిక'అని రాశారు. కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తహిదా కాక్రోచ్ మూవ్‌మెంట్ ఇలా కాక్రోచ్ అక్కడ ట్రెండింగ్ అవుతోంది.
ఇక, మరో ఖాతా బయోలో పాకిస్తానీ నెటిజన్లు రాసిన ఒక లైన్ బాగా వైరల్ అవుతోంది. 'జిన్హే సిస్టమ్ నే కాక్రోచ్ సంఝా, హమ్ ఉన్హీ అవామ్ కీ అవాజ్ హైన్' (వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా భావించిందో.. మేము ఆ సామాన్య ప్రజల గొంతుకలం!)
లోగోల వెనుక వ్యూహం
ఈ పాకిస్తానీ పేజీల లోగోలు భారతీయ కాక్రోచ్ జనతా పార్టీ లోగోను పోలి ఉన్నప్పటికీ, వారు అక్కడ పచ్చ (గ్రీన్), తెలుపు రంగులను ఉపయోగించారు. అక్కడి సాంప్రదాయ రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ 'పిటిఐ' (PTI), నవాజ్ షరీఫ్ 'పిఎమ్ఎల్-ఎన్' (PML-N), 'పిపిపి' (PPP) లకు తాము ఒక భిన్నమైన ప్రత్యామ్నాయం అని చూపించడానికి ఈ బ్రాండింగ్‌ను ఎంచుకున్నారు.
అసలు ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎవరు పెట్టారు? దీని నేపథ్యం ఏంటి?
వ్యవస్థాపకుడు: భారత్‌లో ఈ కాక్రోచ్ జనతా పార్టీని అభిజీత్ దిప్కే (30) అనే భారతీయ విద్యార్థి ప్రారంభించారు. ఈయన ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. గతంలో ఈయన 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) లో పొలిటికల్ కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. ఈ పార్టీకి ఒక మేనిఫెస్టో, అధికారిక వెబ్‌సైట్ కూడా ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌లో మాత్రం ఇది ఏ ఒక్కరో ప్రారంభించకుండా, వేర్వేరు క్రియేటర్లు విడివిడిగా అకౌంట్లు తెరిచి నడుపుతున్నారు.
ఎందుకు మొదలైంది?: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ఒక విచారణ సందర్భంగా.. ఉద్యోగాలు లేని యువతను, సామాజిక కార్యకర్తలను ఉద్దేశించి 'బొద్దింకలు', 'పరాన్నజీవులు'(Parasites) అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. 'కొంతమంది యువకులు బొద్దింకల్లా తయారవుతున్నారు, వారికి ఉద్యోగాలు దొరకడం లేదు, వృత్తిలో స్థానం లేదు'అని ఆయన అన్నారు. (తర్వాత ఆయన సర్దుబాటు చేసుకుంటూ.. నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చేవారిని ఉద్దేశించి ఆ మాట అన్నానని స్పష్టం చేశారు).
తిరుగుబాటుగా మారిన బొద్దింక గుర్తు: ఈ వ్యాఖ్యలపై యువత తీవ్రంగా స్పందించింది. వ్యవస్థ ఎంత అణచివేయాలని చూసినా చావకుండా, వేగంగా విస్తరించే 'బొద్దింక'ను (Cockroach) ఒక తిరుగుబాటుకు చిహ్నంగా మార్చుకున్నారు. ఇదొక అధికారిక రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ.. కేవలం వారం రోజుల్లోనే 20 మిలియన్ల (2 కోట్లు)పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించి రికార్డు సృష్టించింది.
భారతదేశంలో నిరుద్యోగం, వ్యవస్థలోని లోపాలపై వ్యంగ్యంగా మొదలైన ఈ 'బొద్దింకల' రాజకీయం.. ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లోని వ్యవస్థాగత లోపాలపై, అక్కడి యువత గొంతుకగా మారడం విశేషం. ఇరు దేశాల్లోని సామాన్య యువత సోషల్ మీడియా వేదికగా డిజిటల్ విప్లవాన్ని ఎలా సృష్టిస్తోందో చెప్పడానికి ఈ ట్రెండే ఒక నిదర్శనం.
Also Read:
వడదెబ్బ ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి
తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం? జగన్ తీరుపై మంత్రి గొట్టిపాటి ధ్వజం