Share News

అమెరికాకు పోటీగా మరో చైనా ఫైటర్ జెట్! పాక్‌కు తొలి విమానం

ABN , Publish Date - May 06 , 2026 | 03:16 PM

చైనా తాజాగా మరో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. తన జే-35 ఫైటర్ జెట్‌కు మార్పులు చేసి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జే-35ఏఈని తాజాగా ఆవిష్కరించింది. తొలి విమానాన్ని పాక్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి

అమెరికాకు పోటీగా మరో చైనా ఫైటర్ జెట్! పాక్‌కు తొలి విమానం
J-35AE Fighter Jet

ఇంటర్నెట్ డెస్క్: అత్యంత శక్తిమంతమైన అమెరికన్ ఫైటర్ జెట్ ఎఫ్-35 లైట్నింగ్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు చైనా మరో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. తన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ జే-35కి మార్పుల చేసి ఎగుమతులకు అనువుగా కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఈ ఫైటర్ జెట్‌కు సంబంధించిన తొలి విమానం పాక్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

జే-35 విమానాలను చైనా ఇప్పటికే వినియోగిస్తోంది. ఇక జే-35ఏఈ వేరియంట్‌కు సంబంధించి నమూనా విమానాన్ని చైనా గతేడాది ఒక ఎయిర్‌షోలో ప్రదర్శించింది. ఆ తరువాత పూర్తిస్థాయి జెట్‌ తయారీకి రంగంలోకి దిగింది. తొలి విమానాన్ని మే 1న ప్రపంచం ముందుకు తెచ్చింది. ఎఫ్-35 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చైనా దీన్ని రూపొందించింది. ధర 80 మిలియన్ డాలర్ల వరకూ ఉండవచ్చని సమాచారం. ఎఫ్-35 విమానం ఖరీదు మోడల్‌ను బట్టి 120 మిలియన్ డాలర్‌ల వరకూ ఉంటుంది.


చైనా వద్ద ప్రస్తుతం జే-35తో పాటు జే-20 అనే మరో 5వ తరం ఫైటర్ జెట్ కూడా ఉంది. అయితే, యూఎస్-35కి గట్టి పోటీ ఇచ్చేలా చైనా జే-35ని రూపొందించుకుంది. జే-35 ట్విన్ ఇంజెన్స్ ఉన్న విమానం. అత్యాధునిక రాడార్, ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థలు, శత్రుదేశాల రాడార్‌కు చిక్కకుండా ఉండేలా అంతర్గత ఆయుధ కంపార్ట్‌మెంట్ వంటి స్టెల్త్ ఫీచర్స్ ఈ విమానంలో ఉన్నాయి. తన నావికాదళం కోసం చైనా జే-35 వేరియంట్‌ను, ఎయిర్‌ఫోర్స్ కోసం జే-35ఏను రూపొందించింది. అంతర్జాతీయ మార్కెట్‌ కోసం జే-35ఏఈని ఆవిష్కరించింది. ప్రస్తుతం చైనా వద్ద అన్ని వేరియంట్స్ కలిపి మొత్తం 57 జే-35 విమానాలు ఉన్నట్టు సమాచారం.

జే-35 కొనుగోలుకు పాక్ 2024లోనే ఆసక్తి ప్రదర్శించింది. 40 విమానాల కోనుగోలుకు పాక్ సిద్ధమైనట్టు అక్కడి మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ విమానం కోసం చైనాలో పాక్ పైలట్ల శిక్షణ కూడా ప్రారంభమైందని గతేడాది జూన్‌లో పాక్ అధికారి ఒకరు తెలిపారు. అదే నెలలో పాక్ అధికారికంగా ఈ వివరాలను వెల్లడించింది. రెండేళ్లల్లో విమానాల డెలివరీ పూర్తవుతుందని అప్పట్లో పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు సైనిక అంత్యక్రియలు.. పాక్ నేత సంచలన వ్యాఖ్యలు..

పుతిన్ బంకర్లలో దాక్కున్నారా.. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల భయంతోనేనా..

Updated Date - May 06 , 2026 | 03:43 PM