Share News

భారీ వరదలు.. చైనీయులను వణికిస్తున్న పాములు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Jul 09 , 2026 | 07:53 PM

చైనాలో మైసాక్ తుఫానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి పాముల పెంపక కేంద్రాలు దెబ్బతినడంతో 900కు పైగా సర్పాలు బయటకు వచ్చాయి. అవి వరద నీటిలో జనావాసాల మధ్య సంచరిస్తున్నాయి.

భారీ వరదలు.. చైనీయులను వణికిస్తున్న పాములు.. వీడియో వైరల్..
China Floods

బీజింగ్: చైనాలో మైసాక్ తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు పదులకొద్దీ ప్రాణాలు పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో ఊహించని పరిస్థితి నెలకొంది. వరదల ధాటికి పాముల పెంపక కేంద్రాలు దెబ్బతినడంతో 900కు పైగా సర్పాలు బయటకు వచ్చాయి. అవి వరద నీటిలో జనావాసాల మధ్య సంచరిస్తున్నాయి. వీటిలో విషపూరిత నాగుపాములు వంటివి ఉండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.


మరోవైపు గ్వాంగ్జీలోని హెంగ్‌జౌ నగరంలో ఓ మహిళ పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు దెబ్బతినడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. దీంతో మహిళను కాపాడలేకపోయినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఘటనపై అప్రమత్తమైన అధికారులు.. విషసర్పాలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అలాగే పాముకాటు బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు తాత్కాలిక వైద్య శిబిరాలనూ ఏర్పాటు చేశారు.


చైనాలో వాణిజ్యపరంగా పాముల పెంపకానికి గ్వాంగ్జీ ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. సంప్రదాయ ఔషధాలు, తోలు ఉత్పత్తులు, మాంసం కోసం ఇక్కడ సుమారు 3 కోట్ల సర్పాలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, వరద నీటిలో పాములు వేగంగా ఈదుకుంటూ వెళ్తుండగా స్థానికులు నడుములోతు నీటిలో వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు నెట్టింట దర్శనమిచ్చాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


వరదల బీభత్సం

భారీ వర్షాలు, వరదలు గ్వాంగ్జీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. రిజర్వాయర్లు పొంగిపొర్లడం, ఆనకట్టలు దెబ్బతినడంతో భారీగా నీరు గ్రామాలు, పట్టణాల్లోకి చేరింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 1.30లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో 8 వేల మందికి పైగా సిబ్బంది, 5,700 పడవలు పాల్గొంటున్నాయి. అంతేకాకుండా వరదల ప్రభావంతో పందుల ఫారాలు, కలప పరిశ్రమలు, మల్లె తోటలు వంటివి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు, ఈ వరదలతో ఓ జంతుప్రదర్శనశాల కూడా ధ్వంసమైంది. దీంతో పందులు, జీబ్రాలు సహా 100కు పైగా జంతువులు బయటకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, చైనాకు మరో భారీ ప్రమాదం పొంచి ఉంది. భీకర టైఫూన్ 'బావి' ముంచుకొస్తోంది. గంటకు 184 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీంతో తైవాన్, చైనా దేశాలు అలర్ట్ అయ్యాయి. ముందస్తు నష్టనివారణ చర్యలు ప్రారంభించాయి.


ఈ వార్తలు కూడా చదవండి

చైనాలో ప్రకృతి వైపరీత్యాల బీభత్సం.. దూసుకొస్తున్న భీకర టైఫూన్ ‘బావి’..

భారత్‌-పాక్‌ యుద్ధంపై ట్రంప్‌ మళ్లీ పాత పాట.. నోబెల్‌ రావాలంటూ కామెంట్!

Updated Date - Jul 09 , 2026 | 08:04 PM