చైనాలో ప్రకృతి వైపరీత్యాల బీభత్సం.. దూసుకొస్తున్న భీకర టైఫూన్ ‘బావి’..
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:13 PM
చైనాలో ప్రకృతి వైపరీత్యాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసాక్ తుఫాను ధాటికి ఇప్పటికే దక్షిణ చైనా అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 39 మంది మృతిచెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు చైనాకు మరో భారీ ప్రమాదం పొంచి ఉంది.
ఢిల్లీ: చైనాలో ప్రకృతి వైపరీత్యాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసాక్ తుఫాను ధాటికి ఇప్పటికే దక్షిణ చైనా అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 39 మంది మృతిచెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు చైనాకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ఆ దేశం వైపుగా భీకర టైఫూన్ ‘బావి’ ముంచుకొస్తోంది. గంటకు 184 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీంతో తైవాన్, చైనా దేశాలు అలర్ట్ అయ్యాయి.
తూర్పు తీరంలో వరద సహాయక చర్యల కోసం 5,700 బోట్లు, భారీ సంఖ్యలో డ్రోన్లను అధికారులు రంగంలోకి దించారు. శనివారం నాటికి టైఫూన్ తీరం దాటే అవకాశం ఉంది. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, మైసాక్ తుఫాను ఇప్పటికే భారీ నష్టాన్ని మిగిల్చింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్జూ రీజియన్‌లో గత శనివారం నుంచి రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు నాన్నింగ్ నగర పరిధిలోని జలాశయం నిండిపోయింది. దీంతో వరద పోటుకు ఒక్కసారిగా డ్యామ్ బద్దలైంది. ఆ వరదనీరు మొత్తం హెంగ్‌జౌ నగరాన్ని ముంచెత్తింది. దీంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతి దృష్ట్యా సుమారు 1.30 లక్షల మంది ప్రజలను ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
మరోవైపు గుయ్‌గాంగ్ జూ నుంచి వందలాది వన్యప్రాణులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జూలోని పాములు వరద నీటిలోకి చేరడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అలాగే వరదల్లో చిక్కుకున్న 10,000 మంది విద్యార్థులను చైనా ఆర్మీ సురక్షితంగా కాపాడింది. కాగా, చైనా మధ్య ప్రాంతం హుబేలోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. శనివారం తీరం దాటనున్న భీకర టైఫూన్ బావితో ఇంకెంత ప్రమాదం వచ్చి పడుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..
మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..