Share News

శరీరమే మాధ్యమంగా.. మాట్లాడుకునే ఇంప్లాంట్లు

ABN , Publish Date - Oct 27 , 2026 | 02:57 AM

వైద్య పరికరాల రంగంలో సాంకేతిక విప్లవానికి తెరలేచింది. శరీరంలో అమర్చే చిన్న ఇంప్లాంట్లు బ్లూటూత్‌, రేడియో తరంగాలపై ఆధారపడకుండా.. శరీర కణజాలం ద్వారానే విద్యుత్‌ సంకేతాలు పంపి ఒకదానితో ఒకటి సంభాషించుకునేలా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని జార్జియా టెక్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

శరీరమే మాధ్యమంగా..   మాట్లాడుకునే ఇంప్లాంట్లు
implant1

  • బ్లూటూత్‌, రేడియో తరంగాలపై ఆధారపడాల్సిన పనిలేదు

  • మన శరీర కణజాలాన్నే నెట్‌వర్క్‌గా మార్చే స్వాన్స్‌ టెక్నాలజీ

  • ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్న జార్జియా టెక్‌ పరిశోధకులు

అట్లాంటా, అక్టోబర్‌ 26: వైద్య పరికరాల రంగంలో సాంకేతిక విప్లవానికి తెరలేచింది. శరీరంలో అమర్చే చిన్న ఇంప్లాంట్లు బ్లూటూత్‌, రేడియో తరంగాలపై ఆధారపడకుండా.. శరీర కణజాలం ద్వారానే విద్యుత్‌ సంకేతాలు పంపి ఒకదానితో ఒకటి సంభాషించుకునేలా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని జార్జియా టెక్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనివల్ల ఒక ఇంప్లాంట్‌ లక్షణాన్ని గుర్తిస్తే, మరొకటి చికిత్స అందించే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఇంప్లాంట్ల మధ్య సమాచార మార్పిడికి కొన్ని ఇబ్బందులున్నాయి. పేస్‌మేకర్లు, గ్లూకోజ్‌ మానిటర్లతో అనుసంధానమయ్యే ఇన్సులిన్‌ పంపుల వంటి కొన్ని వైద్య పరికరాలు బ్లూటూత్‌ను వాడుతున్నాయి. దీనివల్ల అవి పనిచేసేటప్పుడు మాత్రమే కాక.. సంకేతాల కోసం వేచి ఉన్నప్పుడు కూడా ఆయా పరికరాలకుశక్తి కావాల్సి వస్తోంది. దీంతో బ్యాటరీ అవసరం పెరిగి, పరికరాల పరిమాణాన్ని తగ్గించడం కష్టమవుతోంది.పైగా రేడియో సంకేతాలు శరీర కణజాలం గుండా వెళ్లేటప్పుడు బలహీనపడతాయి.


implant2.jpgఈ సమస్యను అధిగమించేందుకు జార్జియా టెక్‌ పరిశోధకులు ‘స్మార్ట్‌ వైర్‌లెస్‌ అటానమస్‌ నెట్‌వర్కింగ్‌ సిస్టమ్‌(స్వాన్స్‌)’ పేరుతో రూపొందించిన ఈ కొత్త నెట్‌వర్క్‌ పనితీరు దీనికి భిన్నంగా ఉంటుంది. దీంట్లో భాగంగా లోపల అమర్చే చిప్‌లను సమన్వయం చేసేందుకు శరీరంపై ఒక పరికరాన్ని అమరుస్తారు.సమయానుసారం (భోజనం తర్వాత లేదా 4 గంటలకొకసారి మందు విడుదల కావాలంటే) లేదా సందర్భాన్ని బట్టి (రోగి పరిగెత్తడం, వేగంగా నడవడం వంటివి చేసినప్పుడు) అది మన చర్మానికి చిన్నచిన్న విద్యుత్‌ సంకేతాలను పంపుతుంటుంది. ఆ సంకేతాలను మన శరీర కణజాలాలే ఒక వైరులా లోపలికి మోసుకెళ్తాయి. శరీరంలో అమర్చిన ఇంప్లాంట్లు ఆ సంకేతాన్ని సులభంగా గుర్తించి ఉత్తేజితమవుతాయి. తాము చేయాల్సిన పని చేసి, అవసరమైతే వేరే చిప్‌లకు సమాచారాన్ని కూడాపంపుతాయి. సంకేతాల కోసం వేచి చూసే సమయంలో వాటికి అయ్యే బ్యాటరీ ఖర్చు దాదాపు సున్నా. పెద్ద బ్యాటరీల అవసరం లేదు కాబట్టి వాటిని కేవలం 3 మిల్లీమీటర్ల సైజులో తయారుచేసి.. ఇంజెక్షన్‌ ద్వారా చర్మం కింద, కండరాల్లో ప్రవేశపెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ట్రయల్స్‌లో భాగంగా.. పరిశోధకులు దీన్ని ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఎలుకల ముందు కాళ్లకు మోషన్‌ సెన్సర్లు, వెనుక కాళ్లలోని సయాటిక్‌ నరాలకు న్యూరోస్టిమ్యులేటర్లను అమర్చారు. ముందు కాళ్లు కదలగానే, శరీరం ద్వారా ప్రయాణించిన విద్యుత్‌ సంకేతాలు ఎలుకల వెనుక కాళ్ల కండరాల్లో కదలిక వచ్చేలా చేశాయి. ఈ టెక్నాలజీ పార్కిన్సన్స్‌ వంటి వ్యాధుల చికిత్సలో ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వందల ఏఐ క్లౌడ్ స్టార్టప్‌లు కనుమరుగవుతాయి: మస్క్ హెచ్చరిక

అమెరికా మళ్లీ దాడి చేసినా మా విధానాలు మారవు: ఇరాన్ విదేశాంగ మంత్రి

Updated Date - Oct 27 , 2026 | 02:58 AM