బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:54 AM
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం సాధించింది. పార్టీ ఛైర్మన్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఆహ్వానించింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్‌పీ (బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ) ఛైర్మన్ తారిక్ రహ్మాన్ త్వరలో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు (Tarique Rahman Oath Taking Ceremony). ఫిబ్రవరి 17న జరగనున్న ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది (PM Modi Invited). బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ ప్రధాని మోదీతో సహా 13 దేశాధినేతలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. అదే రోజున ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ వెళ్లకపోవచ్చని తెలిసింది. అయితే, ప్రధానికి బదులు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది .
భారత్‌తో పాటు చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, యూఏఈ, ఖతర్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ దేశాల అధినేతలకు బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానాలు అందాయి. పార్లమెంటు హౌస్‌లోని సదరన్ ప్లాజా భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తారిక్ రహ్మాన్‌తో దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇది తమ దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమని బీఎన్‌పీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటులోని 299 స్థానాల్లో 212 సీట్లను బీఎన్‌పీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక జమాతే ఇస్లామీ పార్టీ 70 సీట్లలో, ఇతర స్వతంత్ర అభ్యర్థులు మిగిలిన స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక బీఎన్‌పీకి చెందిన సీనియర్ హిందూ నేత గయేశ్వర్ కూడా ఈ ఎన్నికల్లో ఢాకా-3 నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.
ఇవీ చదవండి:
బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ భారీ విజయం
10 వేల కండోమ్స్ ఖతం.. వింటర్ ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో కొరత