చేతిలో పిస్టల్‌తో డ్రగ్స్ స్థావరంపై దాడి.. బంగ్లాదేశ్ మంత్రి వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:42 AM
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మంత్రి సినిమా హీరో స్టైల్లో తన తడాఖా చూపించారు. చేతిలో పిస్టల్ పట్టుకుని స్వయంగా డ్రగ్స్ స్థావరంపై దాడి చేశారు. బంగ్లా రాజధాని ఢాకాలోని గెండారియా ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మంత్రి సినిమా హీరో స్టైల్లో తన తడాఖా చూపించారు. చేతిలో పిస్టల్ పట్టుకుని స్వయంగా డ్రగ్స్ స్థావరంపై దాడి చేశారు. బంగ్లా రాజధాని ఢాకాలోని గెండారియా ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విముక్తి యుద్ధ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇష్రాక్ హుస్సేన్ తన అనుచరులతో కలిసి ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Bangladesh Minister Drug Raid).
అక్టోబర్ 17న ఢాకాలోని గెండారియా రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మురికివాడకు మంత్రి ఇష్రాక్ హుస్సేన్ (Ishraque Hossain video) తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఒక చేతిలో మెగాఫోన్, మరో చేతిలో పిస్టల్ పట్టుకుని అక్కడున్న కొందరిని వెంబడించారు. ఆ ప్రాంతంలో మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయని అనుమానంతో ఈ చర్య చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అక్కడి యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
అనుమానితుల వద్ద తెల్లటి పొడి పదార్థం లభించిందని, అది మాదకద్రవ్యమా కాదా అనేది పరీక్షల తర్వాతే నిర్ధారిస్తామని పోలీసులు వెల్లడించారు (Bangladesh Drug Raid). మంత్రి చేపట్టిన దాడిపై మరో వివాదం మొదలైంది. ఈ ఆపరేషన్‌కు ముందు మంత్రి తమకు సమాచారం ఇవ్వలేదని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు అధికారి మసూద్ రాణా తెలిపారు. ఘటన జరిగిన తర్వాతే తమకు విషయం తెలిసిందని చెప్పారు. ఇష్రాక్ హుస్సేన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ దాడికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. అయితే, వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పోస్టును తొలగించారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..