బలూచిస్థాన్‌ను చైనా ఎందుకు నిశితంగా గమనిస్తోంది?
ABN , Publish Date - Jul 15 , 2026 | 08:10 PM
బలూచ్ వేర్పాటువాదులు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారన్న లేఖ ఇప్పుడు అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ పరిణామం ఇస్లామాబాద్‌తో పాటు డ్రాగన్ కంట్రీ చైనాలోనూ తీవ్ర కలకలం రేపుతోంది.
ఆంధ్రజ్యోతి, జులై 15: పాకిస్థాన్ నైరుతి ప్రాంతంలోని కల్లోలిత రాష్ట్రం బలూచిస్థాన్ మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. 'రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్' పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. బలూచ్ వేర్పాటువాదులు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారని, ఆ భూభాగంలోని ఎక్కువ ప్రాంతం ఇప్పుడు వారి ఆధీనంలోనే ఉందనేది ఆ లేఖ సారాంశం.
ఈ ప్రకటనకు సంబంధించి ఎలాంటి అధికారిక లేదా స్వతంత్ర ధ్రువీకరణ లేనప్పటికీ, ఈ పరిణామం ఇస్లామాబాద్‌తో పాటు డ్రాగన్ కంట్రీ చైనాలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. బలూచిస్థాన్‌లో చైనా వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడమే దీనికి ప్రధాన కారణం.
బలూచిస్థాన్ ప్రాధాన్యత ఏంటి?
పాకిస్థాన్‌లో భూభాగం పరంగా బలూచిస్థాన్ అతిపెద్ద రాష్ట్రం. ఇది దేశ మొత్తం భూభాగంలో దాదాపు 44 శాతం కలిగి ఉంది. ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్నప్పటికీ, ఇది పాకిస్థాన్‌లో అత్యల్ప జనాభా, అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఈ ప్రాంతం రాగి (Copper), బంగారం, సహజ వాయువు, బొగ్గు, అరుదైన ఖనిజాలతో సహా అపారమైన సహజ వనరులకు నిలయం. అరేబియా సముద్ర తీరాన ఉన్న బలూచిస్థాన్... దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలను అనుసంధానించే కీలక ద్వారంగా ఉంది.
దశాబ్దాలుగా పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంత వనరులను దోచుకుంటూ, స్థానిక ప్రజల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బలూచ్ జాతీయవాద గ్రూపులు ఆరోపిస్తున్నాయి. ఈ అసంతృప్తే అక్కడ సుదీర్ఘకాలంగా వేర్పాటువాద ఉద్యమం నడవడానికి కారణమైంది.
చైనాకు బలూచిస్థాన్ ఎందుకు ముఖ్యం?
చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బిలియన్ డాలర్ల 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్' (BRI) లో భాగమైన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులన్నీ బలూచిస్థాన్‌తోనే ముడిపడి ఉన్నాయి. దాదాపు 65 బిలియన్ డాలర్ల (రూ. 5.4 లక్షల కోట్లకు పైగా) విలువైన ఈ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమ చైనాను అరేబియా సముద్రంతో అనుసంధానించాలని బీజింగ్ వ్యూహం పన్నింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే 'మలక్కా జలసంధి' (Malacca Strait) పై ఆధారపడటాన్ని తగ్గించుకుని, అంతర్జాతీయ షిప్పింగ్ లేన్లకు నేరుగా యాక్సెస్ పొందడం కోసం చైనాకు బలూచిస్థాన్ అత్యంత కీలకంగా మారింది.
చైనా ప్రధాన పెట్టుబడులు
1. గ్వాదర్ పోర్ట్ (Gwadar Port) కీలక కేంద్రం
CPEC ప్రాజెక్టులలో అత్యంత కీలకమైంది అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్ లోతైన ఓడరేవు. దీనిని పూర్తిగా చైనా సంస్థలే నిర్వహిస్తున్నాయి. గ్వాదర్‌ను అంతర్జాతీయ వాణిజ్య హబ్‌గా మార్చేందుకు చైనా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇందులో భాగంగా ఈస్ట్‌బే ఎక్స్‌ప్రెస్‌వే కొత్త రోడ్ నెట్‌వర్క్‌ల నిర్మాణం. విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాల కల్పన. 'న్యూ గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయం' నిర్మాణం చేపట్టింది.
2. మైనింగ్ ప్రాజెక్టులు
మౌలిక సదుపాయాలే కాకుండా, ఇక్కడి ఖనిజాలపై చైనా కన్నేసింది. చాగి జిల్లాలోని ప్రసిద్ధ 'సైందాక్ కాపర్-గోల్డ్ ప్రాజెక్ట్'ను మెటలర్జికల్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (MCC) చాలా ఏళ్లుగా నిర్వహిస్తోంది. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల కోసం మరిన్ని మైనింగ్ ప్రాజెక్టులను విస్తరించేందుకు చైనా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
భద్రతాపరమైన సవాళ్లు.. వేర్పాటువాదుల హెచ్చరికలు
చైనా పెట్టుబడులకు బలూచిస్థాన్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. 'బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ' (BLA) వంటి వేర్పాటువాద గ్రూపులు చైనా ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్థానిక ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా, ఇస్లామాబాద్ ప్రభుత్వం తమ వనరులను దోచుకోవడానికి చైనా సహాయం చేస్తోందని వారు వాదిస్తున్నారు. దీని కారణంగా, చైనా పౌరులు, CPEC ప్రాజెక్టులే లక్ష్యంగా బాంబు దాడులు, ఆత్మహుతి దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. చైనా కార్మికుల రక్షణ కోసం పాకిస్థాన్ వేలాది మంది సైనికులతో ప్రత్యేక భద్రతా విభాగాలను ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ ముప్పు మాత్రం తొలగలేదు.
ఒకవేళ బలూచిస్తాన్ స్వతంత్రమైతే చైనా పరిస్థితి ఏంటి?
ప్రస్తుతానికైతే బలూచిస్థాన్.. పాకిస్థాన్ నుంచి విడిపోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయమే అయినప్పటికీ, అక్కడ వేర్పాటువాద ఉద్యమం మరింత బలోపేతమైతే చైనా దీర్ఘకాలిక వ్యూహాలకు పెద్ద బ్రేక్ పడుతుంది. ఒకవేళ అక్కడ స్వయంప్రతిపత్తి లేదా స్వతంత్ర పాలన వస్తే.. గతంలో పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ కొత్త ప్రభుత్వం సమీక్షించవచ్చు. మైనింగ్, ఇన్‌ఫ్రా కాంట్రాక్టులను రద్దు చేయడం లేదా తిరిగి బేరసారాలు సాగించవచ్చు. సహజ వనరులపై స్థానిక నియంత్రణను డిమాండ్ చేస్తూ, చైనాకు కాకుండా ఇతర దేశాల ఇన్వెస్టర్లతో భాగస్వామ్యానికి మొగ్గు చూపవచ్చు.
అందుకే, బలూచిస్థాన్‌లో జరుగుతున్న ప్రతి చిన్న పరిణామాన్ని చైనా అత్యంత నిశితంగా గమనిస్తోంది. అక్కడ పాకిస్థాన్ పట్టు కోల్పోతే, చైనా కలల ప్రాజెక్ట్ CPEC భవిష్యత్తు అంధకారంలో పడటం ఖాయం.
ఇదిలాఉంటే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. బలూచ్ నాయకుడు మీర్ యార్ బలోచ్, పాకిస్థాన్ నుంచి వేరుగా బలూచిస్థాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించారు...! ఆయన 'మచుకీన్ బలోచానీ' (Machukeen Balochani)ని జాతీయ గీతంగా, 'బలోచీ ఫాలూస్' (Balochi Falus)ను కరెన్సీగా ప్రకటించారు. ఆ ప్రాంతంలో 85శాతం పైగా భూభాగంపై బలూచ్ సైన్యం నియంత్రణ ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కువైట్, జోర్డాన్‌పై ఐఆర్‌జీసీ తాజా దాడులు..
గోరింటాకు అందాలు.. ఆరోగ్యానికీ మంచిదే..