పాక్ పోలీసుల కాల్పులు.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:33 AM
పాక్ పోలీసుల కాల్పుల్లో 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం చెందడం కలకలం రేపుతోంది. జూన్ 10న ఈ దారుణం జరిగింది. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులకు శిక్ష పడేలా చేయాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థానీ పోలీసుల కాల్పుల్లో ఇటీవల పాక్ సంతతికి చెందిన 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ పాక్ ప్రభుత్వాన్ని కోరారు. పాంజాబ్ ప్రావిన్స్‌లో జూన్ 10న ఈ దారుణం జరిగింది. బాలిక తన కుటుంబంతో కలిసి పాక్‌లో పర్యటిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, అద్దె కారులో హానియా అహ్మద్ అనే బాలిక తన కుటుంబంతో వెళుతుండగా కొందరు సాయుధులైన దుండగులు వారిని అడ్డగించారు. తుపాకీలతో బెదిరించి వారితో పాటు కారులో కొంత దూరం ప్రయాణించారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. వారిని వెంబడించే క్రమంలో కారులో దుండగులు మాత్రమే ఉన్నారనుకున్న పోలీసులు కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో హానియా కారులోనే కన్నుమూయగా ఆమె తండ్రి, సోదరుడు గాయాలపాలయ్యారు.
బాలిక మరణంతో పాక్ పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. కారులో చిన్నారి ఉన్న విషయాన్ని ఎలా గుర్తించలేకపోయారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనను ఎలా సమర్థించుకోవాలో తెలియక పోలీసు డిపార్ట్‌మెంట్ కూడా సతమతం అవుతోంది. పోలీసుల వల్లే చిన్నారి అన్యాయంగా బలైపోయిందని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, నిజానిజాలను నిగ్గుతేల్చాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ కూడా పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
మరో ఘటన.. కుప్పకూలిన రష్యన్ Tu-22M3 యుద్ధ విమానం..
ఇరాన్‌కు డబ్బులు ఇవ్వలేదు.. అవన్నీ ఫేక్ న్యూస్: ట్రంప్