Share News

భారత్‌లో కూతురు.. చికాగోలో భార్య హత్య.. అసలేం జరిగింది..?

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:16 PM

అమెరికాలో భారత సంతతికి చెందిన అంకుర్ పటేల్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. భార్య మరో వ్యక్తితో సంబంధం కొనసాగించడం, తనతో కలిసి ఉండేందుకు నిరాకరించడంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

భారత్‌లో కూతురు.. చికాగోలో భార్య హత్య.. అసలేం జరిగింది..?
Ankur Patel

చికాగో: అమెరికాలో భారత సంతతికి చెందిన అంకుర్ పటేల్ (31) తన భార్యను కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. భార్య మరో వ్యక్తితో సంబంధం కొనసాగించడం, తనతో కలిసి ఉండేందుకు నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. హత్య అనంతరం భారత్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన అంకుర్‌ను పోలీసులు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఈ ఘటన గత ఆగస్టులో చోటుచేసుకోగా.. తాజాగా వివరాలు వెలుగులోకి వచ్చాయి.


అంకుర్ పటేల్ తన భార్య, కుమార్తెతో కలిసి విస్కాన్సిన్‌లో నివసించేవారు. కుటుంబకలహాలతో వారిద్దరూ ఈ ఏడాది మేలో విడిపోయారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో భర్త వద్దకు తిరిగొచ్చిన కొన్ని రోజులకే ఆమె మళ్లీ వెళ్లిపోయింది. అనంతరం తన సహోద్యోగితో సంబంధం ఏర్పరచుకుని లూసియానాలో స్థిరపడింది. భార్య తనను విడిచి వెళ్లడాన్ని అంకుర్ జీర్ణించుకోలేకపోయాడు. వారిద్దరినీ చంపేస్తానని పలుమార్లు బెదిరించాడు. అంతేకాకుండా కుమార్తెతో మాట్లాడేందుకు భార్యకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. హత్యకు రెండు వారాల ముందు చికాగోలోని బంధువుల ఇంటికి అంకుర్ వెళ్లాడు. అనంతరం కుమార్తెను భారత్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు పంపించాడు.


ఆ తర్వాత కుమార్తెను కలుసుకోవచ్చంటూ భార్యను చికాగోకు పిలిచాడు. కుమార్తె భారత్‌కు వెళ్లిపోయిన విషయం తెలియని మహిళ.. తన కొత్త భాగస్వామితో కలిసి అక్కడికి చేరుకుంది. అతను రోడ్డుపై వేచి ఉండగా.. అంకుర్‌తో కలిసి ఆమె అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. అయితే, లోపలికి వెళ్లిన మహిళకు కుమార్తె కనిపించలేదు. అదే సమయంలో తనతో కలిసి ఉండాలని అంకుర్ ఆమెను కోరాడు. అందుకు నిరాకరిస్తూ తాను కొత్త భాగస్వామితోనే ఉంటానని స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అంకుర్.. భార్య మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. బయట ఆమె కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి పలుమార్లు మెసేజ్‌లు పంపినా, ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, వారు ఆ ఇంటిని గుర్తించలేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.


అంకుర్ స్నేహితులు అతని ఇంటికి రాగా, అక్కడ మృతదేహాన్ని చూసి షాక్‌ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్య అనంతరం మరుసటి రోజు అంకుర్ చికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, విమానం ఎక్కకముందే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో తన భార్యను చంపాలనే ఉద్దేశం మొదట లేదని, ఆమె తనతో కలిసి ఉండేందుకు నిరాకరించడంతో హత్య చేసినట్లు అంకుర్ చెప్పాడు. కాగా, నిందితుడిపై అమెరికా పోలీసులు ఫస్ట్ డిగ్రీ హత్య అభియోగం మోపారు. ఈ కేసులో తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి: ప్రధాని కార్నీ

దుబాయ్‌లో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్.. షారుక్ ఖాన్‌తో స్పెషల్ కనెక్షన్!

Updated Date - Oct 16 , 2026 | 01:29 PM