పూర్తిస్థాయి యుద్ధం!
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:36 AM
పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధానికి అమెరికా, ఇరాన్ సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, దాన్ని..
ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధమవుతున్న అమెరికా
అమెరికా చట్టసభకు సమాచారమిచ్చిన ట్రంప్
తామూ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్
మంగళవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని
కీలక రేవు పట్టణాలపై విరుచుకుపడిన అమెరికా
అమెరికా స్థావరాలు, 3 నౌకలపై ఇరాన్ దాడులు
భారతీయ నౌకా సిబ్బంది ఒకరు మృతి
ఇరాన్ దౌత్యవేత్తను పిలిపించి భారత్ నిరసన
హోర్ముజ్ బయట మళ్లీ నౌకా దిగ్బంధం: ట్రంప్
వాషింగ్టన్/దుబాయ్/న్యూఢిల్లీ, జూలై 14: పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధానికి అమెరికా, ఇరాన్ సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, దాన్ని ఎలాగైనా తెరవాలన్న అమెరికా పట్టుదలతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. హోర్ముజ్ అవతల అమెరికా మళ్లీ దిగ్బంధం విధించింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం 50 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారని.. ఎప్పుడైనా, ఏ స్థాయి దాడికైనా తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వీటన్నింటికన్నా ముఖ్యంగా ఇరాన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు అమెరికా చట్టసభ కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రంప్ సమాచారం ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. మరోవైపు అమెరికా దాడులకు దీటుగా గల్ఫ్‌లోని స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్న ఇరాన్.. తామూ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. దీనితో పశ్చిమాసియాలో మరోసారి పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చమురు ధరలు మరోసారి బ్యారెల్‌కు 87 డాలర్లు దాటాయి. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ తీర ప్రాంతాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. బుషెహర్, చబహార్, జాస్క్, కొనారక్, అబు మూసా, బందర్ అబ్బాస్ పట్టణాల్లోని ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్ల నిల్వ కేంద్రాలు, లాంఛర్లను, పోర్టుల్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హోర్ముజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు చేసే సామర్థ్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తెలిపింది. మరోవైపు యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్‌లలోని అమెరికా స్థావరాలపై మంగళవారం రోజంతా విడతల వారీగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తూనే ఉంది. హోర్ముజ్ జలసంధిలో తమ అనుమతి తీసుకోకుండా ప్రయాణిస్తున్నాయంటూ మూడు చమురు నౌకలపైనా దాడులు చేసింది. ఇరాన్ అనుమతి లేకుండా హోర్ముజ్‌లో నౌకల ప్రయాణానికి అమెరికా మిలిటరీ ప్రయత్నిస్తే.. దీటుగా సమాధానం ఇస్తామని హెచ్చరించింది.
ఇరాన్ దాడిలో భారతీయుడు మృతి
తమ దేశానికి చెందిన మొంబాసా, అల్ బహియా చమురు నౌకలపై దాడులు జరిగి మంటలు చెలరేగాయని, భారతీయ సిబ్బంది ఒకరు మరణించారని యూఏఈ వెల్లడించింది. మరో ఆరుగురు భారతీయులు సహా 8మంది గాయపడ్డారని తెలిపింది. ఇక నెదర్లాండ్స్ స్టాల్ట్ ట్యాంకర్స్ సంస్థకు చెందిన ‘స్టాల్ల్ మెగ్నీషియం’ నౌకలోనూ డ్రోన్ దాడితో మంటలు చెలరేగాయి. ఇరాన్ దాడిలో భారతీయ సిబ్బంది మృతిచెందడంపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ భారత్‌లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ జావేద్ హొస్సేనీని తమ కార్యాలయానికి పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
మళ్లీ నౌకా దిగ్బంధం: ట్రంప్
హోర్ముజ్ జలసంధి అవతల మరోసారి నౌకా దిగ్బంధం విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌కు చెందిన, ఆ దేశంతో వాణిజ్యం చేస్తున్న నౌకలను మాత్రం అడ్డుకుంటామని, మిగతా దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హోర్ముజ్ మీదుగా ప్రయాణించే నౌకల నుంచి వాటిలోని ‘సామగ్రి’ విలువపై 20ు ఫీజు వసూలు చేస్తామన్న ప్రకటన నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. కాగా, ఇరాన్‌తో తిరిగి పూర్తిస్థాయి యుద్ధానికి దిగాలని ట్రంప్ భావిస్తున్నట్టు అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. ఏ దేశంపై అయినా అమెరికా యుద్ధం ప్రకటించాలంటే చట్టసభ కాంగ్రెస్ అనుమతి ఉండాలి. అధ్యక్షుడు కేవలం 60 రోజుల పాటు సైనిక చర్య చేపట్టవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా ఆపేయాల్సిందే. ఈ క్రమంలో ఇరాన్‌పై గతంలో చేపట్టిన యుద్ధం మధ్యంతర ఒప్పందాలు, దౌత్య ప్రయత్నాలతో ముగిసిందని.. ఇప్పుడు మరో సైనిక చర్య చేపడుతున్నానని కాంగ్రె్‌సకు ట్రంప్ సమాచారం ఇచ్చినట్టు సమాచారం.
హోర్ముజ్‌లో 7 భారత నౌకలు
హోర్ముజ్ జలసంధి పశ్చిమ భాగంలో ఏడు భారత నౌకలు నిలిచిపోయాయి. వీటిలో 148 మంది భారతీయ నావికులు ఉన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అవి ఆ ప్రాంతాన్ని దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదని, నావికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. భారత సిబ్బందితో కూడిన విదేశీ జెండా ఉన్న మరో 11 నౌకలను కూడా జలసంధి పరిసరాల్లో గుర్తించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా హోర్ముజ్, దానికి అనుకొని ఉన్న జలాల్లో జరిగిన దాడుల్లో కనీసం ఏడుగురు భారతీయ నావికులు మరణించారు. మార్చి 1న మార్షల్ ఐల్యాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై దాడిలో భారతీయ సిబ్బంది ఒకరు మరణించారు. అదే రోజున పలావు జెండాతో ప్రయాణిస్తున్న ట్యాంకర్‌పై దాడిలో ఇద్దరు భారతీయ నావికులు మృతిచెందారు. మే 8న హోర్ముజ్‌లో భారతీయ సిబ్బందితో వెళ్తున్న చెక్క పడవ అగ్ని ప్రమాదానికి గురై భారతీయ నావికుడు చనిపోయాడు. గతనెలలో ఒమన్ తీరంలో సెట్టెబెల్లో ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది మరణించారు.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!