మనిషిపై ‘మర మనిషి’ పెత్తనం మొదలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:34 AM
కృత్రిమ మేధ(ఏఐ) ఏదో పనిముట్టు అనుకుంటే పొరపాటే. అది మనుషులపై పెత్తనం చేసే యాజమానిగా కూడా మారిపోయింది. అమెరికాలోని ఓ స్టోర్‌లో అచ్చంగా ఇదే జరిగింది. విధులకు...
అమెరికాలో ఓ ఉద్యోగిని తొలగించిన ‘ఏఐ’ బాస్
23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యమైనందుకు చర్యలు
శాన్‌ఫ్రాన్సిస్కో, ఆగస్టు 16: కృత్రిమ మేధ(ఏఐ) ఏదో పనిముట్టు అనుకుంటే పొరపాటే. అది మనుషులపై పెత్తనం చేసే యాజమానిగా కూడా మారిపోయింది. అమెరికాలోని ఓ స్టోర్‌లో అచ్చంగా ఇదే జరిగింది. విధులకు ఆలస్యంగా వస్తున్నందుకు ఏకంగా ఓ ఉద్యోగిని ఇంటికి పంపించివేసింది. ఆ నిర్ణయాన్ని సంబంధిత అధికారులు పరిశీలించినప్పుడు అది సరైనదే అని తేలినా, ఏఐ పాత్ర విస్తృతిని ఈ సంఘటన తెలియజేస్తోంది. ఓ మనిషిని మరో మరమనిషి ఉద్యోగం నుంచి తొలగించిన సందర్భం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఏండన్ లాబ్స్ అనే కంపెనీ శాస్‌ఫ్రాన్సిస్కోలో పూర్తిగా ఏఐతో నడిచే ఏండన్ మార్కెట్ పేరుతో స్టోర్ నిర్వహిస్తోంది. ఏఐతో స్టోర్‌ను నడిపే ప్రయోగాన్ని జరుపుతోంది. ఇందుకు ‘లూనా’ అన్న పేరుతో ఉన్న మరమనిషిని ఏఐ మేనేజర్‌గా పెట్టుకుంది. ఉద్యోగాల భర్తీ, వస్తువుల కొనుగోలు, అమ్మకం, విధానపర నిర్ణయాలు తీసుకోవడం అన్నింటినీ ‘లూనా’యే చూస్తుంది. పనిప్రదేశంలో నిబంధనలు అమలు చేయడం కూడా లూనా పనే. ఓ ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా రావడాన్ని గమనించి నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ కంపెనీ కొన్ని నెలల క్రితం ఉద్యోగుల అటెండెన్స్ విధానాన్ని రూపొందించింది. అయితే అమలును మాత్రం సరిగ్గా పట్టించుకోలేదు. దాంతో ఆలస్యంగా రావడం ఆ ఉద్యోగికి అలవాటుగా మారింది. గమనించిన ఆ కంపెనీ నిర్వాహకులు లూనాను ఆశ్రయించారు. ‘మెమరీ’లో ‘సెర్చ్’ చేసి ఆ ఉద్యోగిని కొనసాగించాలో, తీసేయాలో చెప్పాలని అని అడిగారు. అన్నింటినీ విశ్లేషించి ఆ ఉద్యోగిని తొలగించాలని సిఫార్సు చేసింది. ఆ ఉద్యోగిని తొలగించడంలో అనైతికత ఏమీ లేదని, మానవ మేనేజర్ అయి ఉంటే ఇంతకుముందే తీసేసి ఉండేవారని ఏండన్ ల్యాబ్స్ సీఈఓ లూకాస్ పీటర్స్‌సన్ అన్నారు.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు