జ్ఞాన దంతాలు తొలగిస్తే చూపు తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే.?
ABN , Publish Date - Feb 24 , 2026 | 03:07 PM
జ్ఞాన దంతాలు తీయించుకోవడం వల్ల చూపు దెబ్బతింటుందని చాలామంది భయపడుతుంటారు. అయితే.. జ్ఞాన దంతాలు తొలగిస్తే నిజంగా చూపు తగ్గుతుందా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఒక వ్యక్తికి సాధారణంగా 32 దంతాలు ఉంటాయి. అయితే 20 సంవత్సరాల వయసు తర్వాత చివరగా వచ్చే 4 దంతాలను జ్ఞాన దంతాలు(Wisdom Teeth) అంటారు. ఇవి పై, కింది దవడల వెనుక భాగంలో పెరుగుతాయి. జ్ఞాన దంతాలు వచ్చినప్పుడు అవి నొప్పిగా ఉండటంతో చాలా మంది వీటిని తీయించుకుంటుంటారు. అయితే.. జ్ఞాన దంతాలను తొలగించుకోవడం మంచిదేనా? ఈ ప్రభావం కళ్లపై ఏమైనా పడుతుందా? అనే విషయంపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
చిన్న వయసులో దవడ పరిమాణం చిన్నదిగా ఉంటుంది. పెద్దయ్యాక దవడ కొంచెం పెరిగినా, కొందరికి జ్ఞాన దంతాలు రావడానికి సరిపడా స్థలం ఉండదు. అందువల్ల దంతాలు సరిగా బయటకు రాక, ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది.
కళ్లపై ప్రభావం పడుతుందా?
చాలామంది జ్ఞాన దంతాలు తీసేస్తే కళ్లు దెబ్బతింటాయని, చూపు తగ్గుతుందని భయపడుతుంటారు. కానీ అది నిజం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జ్ఞాన దంతాలు నోటి వెనుక భాగంలో ఉంటాయి. అవి కళ్లు లేదా కంటి నరాలకు దగ్గరగా ఉండవు. దంతాన్ని తీసే సమయంలో పన్నుతో పాటు చుట్టుపక్కల కణజాలాన్ని మాత్రమే తొలగిస్తారు. కాబట్టి కళ్లు, మెదడు లేదా చూపుపై ఎలాంటి ప్రభావం ఉండదు.
జ్ఞాన దంతాలు తీసేయడం మంచిదేనా?
జ్ఞాన దంతాలు నొప్పి, ఇన్ఫెక్షన్, లేదా పక్క దంతాలకు ఇబ్బంది కలిగిస్తుంటే వాటిని తీయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దవడలో తగినంత స్థలం లేకపోవడం వల్ల ఇవి సరిగ్గా పెరగక, దంత క్షయం, చిగుళ్ల వ్యాధికి దారితీస్తాయి. నొప్పి లేకుండా.. సరైన స్థితిలో ఉంటూ, శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంటే తీయాల్సిన అవసరం లేదు. జ్ఞాన దంతాలను తొలగించడం సురక్షితమైన ప్రక్రియ. ఇది కళ్లకు లేదా చూపునకు ఎలాంటి హాని కలిగించదు. కాబట్టి అవసరమైతే భయపడకుండా డెంటిస్ట్ సలహా తీసుకోవాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News