రూట్ కెనాల్ చికిత్సతో గుండె ఆరోగ్యం మెరుగు.. అధ్యయనంలో వెల్లడి
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:31 PM
రూట్ కెనాల్ చికిత్సతో దంతాల ఆరోగ్యమే కాకుండా డయాబెటిస్, గుండె జబ్బుల నుంచి కూడా రక్షణ లభిస్తుందని కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: రూట్ కెనాల్ చికిత్సతో గుండె ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశాలు ఉన్నట్టు కింగ్స్ కాలెజ్ లండన్ జరిపిన ఒక అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. ఈ చికిత్సతో పంటి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఏమిటీ రూట్ కెనాల్ చికిత్స?
పంటి అంతర్భాగమైన పల్ప్‌కు సోకిన ఇన్ఫెక్షన్ తీవ్రమైనప్పుడు రూట్ కెనాల్ చికిత్స ద్వారా వైద్యులు పరిస్థితిని చక్కదిద్దుతారు. ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని ప్రత్యేక పదార్థంతో నింపి మూసివేసి చికిత్సను పూర్తి చేస్తారు. దీంతో, పంటిని తొలగించాల్సిన అవసరం లేకుండానే సమస్య నుంచి బయటపడవచ్చు.
పంటి సమస్యలతో బాధపడుతున్న వారిని కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు దాదాపు రెండేళ్ల పాటు పరిశీలించిన అనంతరం ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. పంటి సమస్యలు ఉన్నప్పుడు నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి చేరి ఇన్‌ఫ్లమేషన్‌ను కలుగజేస్తుందట. దీంతో, జీవక్రియలు, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందట. రూట్ కెనాల్ చికిత్స తరువాత ఈ సమస్యలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు.
రూట్ కెనాల్ చికిత్స తరువాత ఈ సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులోకి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగు అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..
యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..