Share News

6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? హై బీపీతో ఇక డేంజరే..

ABN , Publish Date - May 17 , 2026 | 04:08 PM

ప్రతీ రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. నిద్రలేమి కారణంగా హైపర్ టెన్షన్ మరింత పెరుగుతుంది. మనదేశంలో సుమారు 22 కోట్ల మంది హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నారు.

6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? హై బీపీతో ఇక డేంజరే..
lack of sleep hypertension

ఇంటర్‌‌నెట్ డెస్క్: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. నిద్రపోవటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. శారీరకంగానూ.. మానసికంగా నిద్ర చాలా అవసరం. ప్రతీ రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. నిద్రలేమి కారణంగా హైపర్ టెన్షన్ మరింత పెరుగుతుంది. మనదేశంలో సుమారు 22 కోట్ల మంది హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నారు. హైపర్ టెన్షన్ కారణంగా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.


నిద్రలేకపోతే ఏం జరుగుతుంది..

సాధారణంగా మనం నిద్రపోతున్నపుడు హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ 10 నుంచి 20 శాతం తగ్గుతాయి. తద్వారా గుండె, రక్త నాళాలు విశ్రాంతి పొంది, రికవర్ అవుతాయి. రోజుకు 6 కంటే తక్కువ గంటలు నిద్రపోయే వారిలో హైపర్ టెన్షన్ 20 నుంచి 32 శాతం అధికంగా వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరగటం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. రక్త నాళాలు కుంచించుకుపోతాయి. అంతేకాదు.. తగినంత నిద్రపోలేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది.


హైపర్ టెన్షన్ నుంచి రక్షణ పొందండిలా..

హైపర్ టెన్షన్ సమస్య ఉన్నవారిలో సగం మందికి అసలు తమకీ సమస్య ఉందనే తెలియదు. 12.5 శాతం నుంచి 15 శాతం మంది మాత్రమే సరైన చికిత్స తీసుకుంటున్నారు. హైపర్ టెన్షన్ బారినపడకుండా ఉండాలన్నా.. వచ్చిన తర్వాత బీపీని కంట్రోల్‌లో ఉంచాలన్నా 7 నుంచి 9 గంటలు మంచి నిద్ర ఉండాల్సిందే. మగత నిద్ర వల్ల శరీరానికి ఎలాంటి లాభం ఉండదు. ప్రతీ రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. ఒకే సమయానికి లేవాలి. నిద్రలేమి, గురక ఇతర సమస్యలపై తప్పకుండా దృష్టిపెట్టాలి. నిద్రపోయే ముందు సెల్ ఫోన్ అస్సలు వాడకూడదు.


ఇవి కూడా చదవండి

వయనాడ్‌ను మరచిపోయారంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

Updated Date - May 17 , 2026 | 04:32 PM