Ragi Java in Winter Season: శీతాకాలం రాగి జావ తాగవచ్చా..?
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:55 PM
శీతాకాలం, వర్షాకాలంలో రోగాలు ముసురుతాయి. ఈ సమయంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి. అలాంటి వేళ.. రాగి జావ తాగవచ్చా? తాగకూడదా? ఏం చేయాలి...
వర్షాకాలం, శీతాకాలంలో రోగాలు ముసురుతాయి. వాతావరణం చల్లబడడంతో శరీరానికి అవసరమైన వేడి తగ్గుతుంది. చల్లని.. అతి చల్లని గాలులు వీయడం వల్ల రోజు వారీ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈ సమయంలో ఏ మాత్రం వ్యాధి నిరోధక శక్తి తగ్గినా.. జలుబు, దగ్గు, ఫ్లూ తదితర అనారోగ్య సమస్యలు ముప్పేట దాడి చేస్తాయి. కొందరిలో జీర్ణక్రియ మందగిస్తుంది. కీళ్ల నొప్పులు, అలసట వంటి ఇబ్బందులు పెరుగుతాయి. దీంతో ఆసుపత్రులు చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కాలంలో శరీరాన్ని లోపలి నుంచి బలంగా ఉంచే ఆహారం తీసుకోవడం అత్యవసరం. మరి ముఖ్యంగా శీతాకాలంలో రాగులు తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అదీకాక రాగుల్లో సహజంగా ఉండే పోషకాలు శరీరానికి వేడి అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రాగుల్లో ఇనుము, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
శీతాకాలంలో రాగి జావా తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు. రాగి పిండిని నీటితో కలిపి జావా చేసుకోవాలి. అందులో పాలు లేదా మజ్జిగతో కలిపి తాగుతారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి సులభంగా జీర్ణమయ్యే ఆహారం రాగి జావ. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.
లోపలి నుంచి వెచ్చగా..
ఈ జావ తాగడం వల్ల శరీరం లోపల నుంచి వెచ్చగా ఉంచడంల కీలక పాత్ర పోషిస్తుంది. రాగుల్లో ఉండే సహజ గుణం.. శరీరానికి వేడిని అందిస్తుంది. దీని వల్ల చలి ప్రభావం తగ్గుతుంది. అలాగే రోజంతా చురుగ్గా ఉండేందుకు అవసరమైన శక్తిని అందిస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి ..
శరీరంలో ఎముకల బలానికి ఈ జావ దివ్యౌషధమని చెప్పాలి. రాగుల్లో కాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. శీతాకాలం చలికి ఎముకలు, కీళ్ల నొప్పులు అధికమయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఈ ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. వృద్ధుల్లో ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడతుంది.
జీర్ణక్రియకు..
ఈ కాలంలో చలి కారణంగా నీరు తక్కువగా తాగుతారు. శారీరక చురుకుదనం తగ్గడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. రాగుల్లో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. పేగు కదలికలను సక్రమంగా పని చేస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణమై శరీరానికి అవసరమైన పోషకాలను బాగా శోషించుకుంటుంది.
రాగి జావ తీసుకుంటే శరీరానికి తక్షణం శక్తిని ఇస్తుంది. ఇది తాగిన వెంటనే కడుపు నింపిన భావన కలుగుతుంది. మధ్య మధ్యలో ఆకలి వేయదు. పని మీద దృష్టి నిలబడుతుంది. వేసవి కాలంలో రాగి జావను మజ్జిగ లేదా పెరుగుతో కలిపి తీసుకుంటే శరీరానికి అత్యంత మేలు జరుగుతుందంటారు.