తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:23 AM
ఇటీవల చాలామంది ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే గుండెపోటు వస్తోందేమో అని భయపడుతున్నారు. అయితే ప్రతి ఛాతీ నొప్పి గుండె సమస్యకే సంబంధించినదిగా ఉండదు. మరి ఛాతీ నొప్పికి గుండెపోటు కాకుండా ఉండే ఇతర కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చాలా మంది తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఛాతీ నొప్పి వస్తే చాలామంది వెంటనే గుండెపోటు వస్తోందేమో అని భయపడతారు. కానీ వాస్తవానికి ఛాతీ నొప్పి రావడానికి గుండె సమస్య మాత్రమే కారణం కాదు.
మన జీవనశైలి, ఆహారం, ఎక్కువసేపు కూర్చునే అలవాటు, వ్యాయామం లేకపోవడం లేదా ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల కూడా ఛాతీ నొప్పి రావచ్చు. గుండెపోటు ప్రమాదకరమైనదే అయినప్పటికీ, ఇతర కారణాల వల్ల వచ్చే ఛాతీ నొప్పిని సరైన అవగాహనతో సులభంగా నియంత్రించవచ్చు. మరి ఛాతీ నొప్పికి ఉండే కొన్ని ముఖ్యమైన కారణాలు ఏమిటో చూద్దాం..
అసిడిటీ
కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి రావడం వల్ల ఛాతీ మధ్యలో మంట లేదా నొప్పి అనిపించవచ్చు. ఇది ఎక్కువగా కారంగా ఉన్న ఆహారం తినడం, తిన్న వెంటనే పడుకోవడం లేదా సరికాని సమయాల్లో భోజనం చేయడం వల్ల వస్తుంది. సరైన ఆహార నియమాలు పాటించడం, వైద్యులు సూచించిన మందులు తీసుకోవడం వల్ల ఇది తగ్గుతుంది.
కండరాల నొప్పి
తప్పు భంగిమలో నిద్రపోవడం, అకస్మాత్తుగా తిరగడం లేదా భారీ బరువులు ఎత్తడం వల్ల ఛాతీ కండరాలు బిగుసుకుపోయి నొప్పి కలిగించవచ్చు. చేతులు కదిలించినప్పుడు లేదా లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకుంటే సాధారణంగా ఇది తగ్గిపోతుంది.
ఒత్తిడి, ఆందోళన
ప్రస్తుతం పని ఒత్తిడి, మానసిక ఆందోళన కూడా ఛాతీ నొప్పికి కారణమవుతాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కొన్ని హార్మోన్లు విడుదల చేస్తుంది. దీంతో గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీలో బిగుతు అనిపించడం జరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఇది తగ్గుతుంది.
ప్లూరల్ ఎఫ్యూషన్
ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొర వాపు వచ్చినప్పుడు లేదా న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఛాతీ ఒక వైపున నొప్పి వస్తుంది. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. జ్వరం, వణుకు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనికి వైద్యుల చికిత్స అవసరం.
పిత్తాశయ రాళ్లు
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఈ నొప్పి పొత్తికడుపు పైభాగంలో మొదలై ఛాతీ, వీపు వరకు వ్యాపించవచ్చు. ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న తర్వాత నొప్పి ఎక్కువ అవుతుంది.
కడుపులో పుండ్లు
కడుపులో లేదా పేగుల మొదటి భాగంలో పుండ్లు ఏర్పడితే కూడా ఛాతీ వద్ద మంట లేదా నొప్పి అనిపించవచ్చు. ఖాళీ కడుపుతో లేదా కారంగా ఉన్న ఆహారం తిన్నప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది. సరైన సమయానికి భోజనం చేయడం, వైద్యుల సూచించిన మందులు తీసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఛాతీ నొప్పి తరచుగా వస్తే లేదా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం అవసరం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News