జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? ఇందులో నిజమెంత?
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:09 PM
వేసవిలో వడదెబ్బ తగలకుండా జేబులో ఉల్లిపాయ పెట్టుకోవాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ప్రజలకు ఓ సలహా ఇచ్చారు. తాను ఇదే చిట్కా పాటిస్తానని చెప్పారు. అయితే, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా?
ఇంటర్నెట్ డెస్క్: ‘జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి.. వడదెబ్బ తగలదు’ అంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన సలహా ఇటీవల చర్చనీయాంశమైంది. తాను కూడా ఇదే చిట్కా పాటిస్తానని చెబుతూ, తన జేబులో ఉంచుకున్న ఉల్లిపాయను చూపించడంతో ఈ విషయంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అయితే నిజంగా జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుందా? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. ఈ అంశంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, జేబులో ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుందనే విషయానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పూర్వం కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో ఉల్లిపాయను ఎక్కువగా తినేవారు. ఈ అనుభవం ఆధారంగా 'ఉల్లిపాయ వడదెబ్బను తగ్గిస్తుంది' అనే నమ్మకం ఏర్పడింది. అది తర్వాత 'జేబులో పెట్టుకుంటే కూడా ప్రయోజనం ఉంటుంది' అనే అపోహగా మారింది. అయితే, ఉల్లిపాయలో కొన్ని సహజ గుణాలు ఉన్నాయనేది నిజం. ముఖ్యంగా ఉల్లిపాయను ఆహారంగా తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దాంతో కొంతవరకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడవచ్చు. కానీ, ఉల్లిపాయను జేబులో పెట్టుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఏ మాత్రం తగ్గదు. ఉల్లిపాయను జేబులో పెట్టుకోవడం కన్నా, దాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. అయితే వడదెబ్బ నుంచి రక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి వెళ్లకపోవడం మంచిది.
తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, లేదా ఓఆర్‌ఎస్ (ORS) తాగాలి.
బయటకు వెళ్లేటప్పుడు వదులుగా, లేత రంగులో ఉండే కాటన్ దుస్తులను ధరించాలి.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్, టోపీ, స్కార్ఫ్ ఉపయోగించడం మంచిది. అలాగే, తప్పకుండా ఫేస్‌కు సన్‌స్క్రీన్‌ను రాయాలి.
దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను తినాలి.
ఆల్కహాల్, కెఫిన్ (కాఫీ, టీ), చక్కెర పానీయాలు డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి, కాబట్టి వాటిని తగ్గించాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News