Share News

పురుషులు Vs స్త్రీలు.. మధుమేహం ఎక్కువగా ఎవరిని ప్రభావితం చేస్తుంది?

ABN , Publish Date - Apr 28 , 2026 | 10:44 AM

మధుమేహం ఇప్పుడు లింగ భేదం లేకుండా పురుషులు, స్త్రీలు అందరినీ ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యగా మారింది. అయితే పరిశోధనల ప్రకారం పురుషులు, స్త్రీలలో దీని ప్రభావం, సమస్యల తీవ్రత కొంత భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పురుషులు Vs స్త్రీలు.. మధుమేహం ఎక్కువగా ఎవరిని ప్రభావితం చేస్తుంది?
Diabetes in Men Vs Women

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం మధుమేహం అనేది లింగ భేదం లేకుండా పురుషులు, స్త్రీలు, యువకులు, వృద్ధులు అందరినీ ప్రభావితం చేస్తున్న ఒక ఆరోగ్య సమస్య. అయితే, పురుషులు, స్త్రీల మధ్య ఈ వ్యాధి ప్రభావంలో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాల ప్రకారం, స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో మధుమేహం కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే స్త్రీలలో మధుమేహం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.


నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పురుషులు సుమారు 17.7 మిలియన్ల మంది ఎక్కువగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. స్త్రీల్లో హార్మోన్ల మార్పులు, గర్భధారణ వంటి కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో కొంతమందిలో గర్భధారణ మధుమేహం (Gestational Diabetes) వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తరువాత టైప్ 2 మధుమేహానికి దారితీయవచ్చు.

స్త్రీలపై మధుమేహ ప్రభావం

మధుమేహం స్త్రీల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెపోటు నుంచి కోలుకోవడం కూడా కష్టంగా మారవచ్చు. అలాగే ఋతుక్రమ సమస్యలు, దృష్టి లోపం, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. RSSDI ప్రకారం, మధుమేహం ఉన్న పురుషుల్లో గుండెపోటు ప్రమాదం సుమారు 50% పెరుగుతే, స్త్రీల్లో అది 150% వరకు పెరుగుతుందని చెబుతున్నారు.


ఇన్ఫెక్షన్ల ప్రమాదం

మధుమేహం ఉన్న స్త్రీల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, యోని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే శరీరంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా పెరుగుతుంది. మధుమేహం వల్ల రక్తప్రసరణ తగ్గడం, హార్మోన్ల మార్పులు, నరాల సమస్యలు రావచ్చు. దీని వల్ల లైంగిక కోరిక తగ్గడం, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురవుతాయి.

వంధ్యత్వ సమస్యలు

రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే గర్భధారణ కష్టమవుతుంది. గర్భం దాల్చినప్పుడు గర్భస్రావం, పుట్టుకలో లోపాలు లేదా ముందుగానే ప్రసవం వంటి ప్రమాదాలు ఉండవచ్చు. అందుకే గర్భధారణకు ముందు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మెనోపాజ్ సమయంలో ప్రభావం

మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్న స్త్రీల్లో నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు మరింత ఎక్కువగా కనిపించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అస్థిరంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తంగా చూస్తే.. మధుమేహం పురుషులు, స్త్రీలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. కానీ స్త్రీలలో దీని ప్రభావం కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - Apr 28 , 2026 | 11:08 AM