Share News

UPSC ప్రిలిమ్స్ 2026 .. అభ్యర్థులు తప్పక పాటించాల్సిన నిబంధనలు

ABN , Publish Date - May 24 , 2026 | 12:54 PM

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 పరీక్ష నేడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ పరీక్ష కోసం యూపీఎస్సీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

UPSC ప్రిలిమ్స్ 2026 .. అభ్యర్థులు తప్పక పాటించాల్సిన నిబంధనలు
UPSC Prelims 2026

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026 నేడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత పదవులను లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించేందుకు యూపీఎస్సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే అధికారిక మార్గదర్శకాలు తెలుసుకుని కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిబంధనలు పాటించకపోతే పరీక్ష హాల్‌లోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.


రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానంలో రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. జనరల్ స్టడీస్ (పేపర్-1) పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగుతుంది. అనంతరం సీశాట్ (పేపర్-2) పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. రెండో సెషన్‌కు మధ్యాహ్నం 2 గంటలకు గేట్లు మూసివేస్తారు. గేట్లు మూసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలికి అనుమతించరు. అందుకే కనీసం గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తున్నారు.

వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలు

అభ్యర్థులు తప్పనిసరిగా ఈ పత్రాలు వెంట ఉంచుకోవాలి:

  • అడ్మిట్ కార్డు ప్రింట్

  • అడ్మిట్ కార్డులో పేర్కొన్న ఒరిజినల్ ఫొటో ఐడీ ప్రూఫ్

  • అవసరమైతే రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు

  • ఫొటో స్పష్టంగా కనిపించని అభ్యర్థులు అదనపు ఫొటోలు సమర్పించాల్సి ఉంటుంది.


ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు జాగ్రత్త

  • పరీక్షలో సమాధానాలను ఓఎంఆర్ షీట్‌పై గుర్తించాల్సి ఉంటుంది. దీనికి కేవలం బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. జెల్ పెన్, ఇంక్ పెన్ లేదా పెన్సిల్ ఉపయోగించరాదు.

  • రోల్ నంబర్, బుక్‌లెట్ కోడ్ వంటి వివరాలు తప్పులేకుండా నింపాలి. ఒకసారి తప్పుగా గుర్తిస్తే సరిచేసుకునే అవకాశం ఉండదు.

నిషేధిత వస్తువులు

పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం

  • మొబైల్ ఫోన్లు

  • స్మార్ట్‌వాచ్‌లు

  • బ్లూటూత్ పరికరాలు

  • ఇయర్‌ఫోన్స్

  • కాలిక్యులేటర్లు

  • పెన్ డ్రైవ్‌లు

పైవేవీ అనుమతించరు. సమయం చూసుకోవడానికి సాధారణ అనలాగ్ వాచ్ మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు పరీక్షకు సాధారణ, తేలికపాటి దుస్తులు ధరించడం మంచిది. పురుషులు సాధారణ షర్టులు, టీషర్టులు, కాటన్ ప్యాంట్లు ధరించాలి. మెటల్ బెల్టులను నివారించాలి. మహిళలు సాధారణ కుర్తీలు, సల్వార్ సూట్లు లేదా తేలికపాటి చీరలు ధరించడం ఉత్తమం. అలాగే ఎక్కువ ఆభరణాలు ధరించకూడదు. పరీక్ష హాల్‌లోకి పారదర్శక ట్రాన్స్‌పరెంట్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. రెండు పేపర్లలోనూ నెగెటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read:

అరటితో ‘ఆహా’రాలు

జగన్ కుటుంబం జోలికొస్తే ఎవరినైనా దారుణంగా చంపేస్తారు: బీటెక్ రవి

For More Latest News

Updated Date - May 24 , 2026 | 01:01 PM