Share News

తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో 'ఎమర్జెన్సీ' పాఠ్యాంశం.. NCERT వివరణ

ABN , Publish Date - Jun 25 , 2026 | 06:48 AM

NCERT ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.. తొమ్మిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో మొదటిసారిగా ఎమర్జెన్సీకి సంబంధించిన విభాగాన్ని చేర్చింది అంటూ సర్కులేట్ అవుతున్న వెర్షన్స్ ఫేక్ అంటూ వివరణ ఇచ్చింది.

తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో 'ఎమర్జెన్సీ' పాఠ్యాంశం.. NCERT వివరణ
NCERT Introduces Emergency Chapter in Class 9 Textbook

న్యూఢిల్లీ, జూన్ 25: భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన, వివాదాస్పద ఘట్టంగా నిలిచిన 'అత్యవసర పరిస్థితి' (ఎమర్జెన్సీ) విధించి దాదాపు ఐదు దశాబ్దాలు (50 ఏళ్లు) పూర్తయిన తరుణంలో, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో తరగతి (Class IX) సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో మొదటిసారిగా ఎమర్జెన్సీకి సంబంధించిన విభాగాన్ని చేర్చింది. దీనిని ప్రజాస్వామ్యానికి ఎదురైన ఓ పెద్ద సవాలుగా దీనిని అభివర్ణించింది.

కొత్తగా రూపొందించిన 'అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్'(Understanding Society: India and Beyond) అనే పాఠ్యాంశాన్ని, భారత ప్రజాస్వామ్య బలాలు, సవాళ్లను వివరించే అధ్యాయంలో ఈ అంశాన్ని చేర్చినట్లు ఎన్‌సీఈఆర్‌టీ అధికారి ఒకరు ధృవీకరించారు.


ప్రజాస్వామ్యానికి సవాలుగా 'ఎమర్జెన్సీ'

1975–1977 మధ్య కాలంలో విధించిన జాతీయ ఎమర్జెన్సీని భారత ప్రజాస్వామ్యానికి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ఈ పుస్తకంలో పేర్కొన్నారు. '1970ల ప్రారంభంలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కుంభకోణాల ఆరోపణల వల్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో జూన్ 1975లో అంతర్గత అల్లర్ల నెపంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది,' అని పాఠ్యపుస్తకం పేర్కొంది.


ఎమర్జెన్సీ కాలంలోని ప్రధాన పరిణామాలు:

పౌరుల మెజారిటీ ప్రాథమిక హక్కులను రద్దు చేశారు. పత్రికలపై ఆంక్షలు విధించారు. ప్రెస్ సెన్సార్‌షిప్ విధించి, మీడియా స్వేచ్ఛను హరించారు. అనేకమంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలను జైలులో పెట్టారు. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.


జయప్రకాశ్ నారాయణ్ (JP) పాత్రకు గుర్తింపు

ఈ కష్టకాలంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలను చైతన్యపరిచిన సోషలిస్ట్ నాయకుడు, 'లోక్ నాయక్' జయప్రకాశ్ నారాయణ్ పాత్రను ఈ పాఠంలో ప్రత్యేకంగా హైలైట్ చేశారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో విద్యార్థులను, పౌరులను ఆయన ఎలా సమీకరించారో వివరించారు. 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు జరపడం, అందులో అప్పటి అధికార పక్షం ఓడిపోవడం.. భారత ప్రజాస్వామ్య శక్తిని, ప్రజల బలాన్ని నిరూపించిందని పుస్తకంలో పేర్కొన్నారు.


ఇతర సమకాలీన సవాళ్లు, అంశాలు

ఎమర్జెన్సీతో పాటు నేటి సమాజంలో ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన మరికొన్ని అంశాలను కూడా ఈ అధ్యాయంలో చేర్చారు. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం (Misinformation) ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పేదరికం, ప్రాంతీయతత్వం, సామాజిక వివక్ష, లింగ అసమానతలను గురించి కూడా ఈ పాఠ్యాంశంలో వివరించే ప్రయత్నం చేశారు.


పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యాంశాలు:

1. ప్రజాస్వామ్యం, మీరు (Democracy and You): విద్యార్థులు కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా, దేశ బాధ్యతాయుత పౌరులుగా ఎలా భాగస్వాములు కావాలో తెలియజెప్పేలా ఈ కొత్త విభాగాన్ని చేర్చారు.

2. మీడియా పాత్ర: సమాజంలో మీడియాను ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం (Fourth Pillar)గా అభివర్ణిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో దాని ప్రాధాన్యతను వివరించారు.

3. భారత ఎన్నికల వ్యవస్థ: భారత ప్రజాస్వామ్య విస్తృతిని తెలిపేందుకు 2024 నాటి గణాంకాలను చేర్చారు. దేశంలో 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నట్లు, అలాగే విస్తృతమైన పోలింగ్ కేంద్రాల నెట్‌వర్క్ గురించి ప్రస్తావించారు.

4. ప్రాథమిక స్థాయి ప్రజాస్వామ్యం (Grassroots Democracy): గుజరాత్‌లోని ఒక పంచాయితీ, అలాగే త్రిపురలోని మహిళా-సానుకూల (Women-friendly) పంచాయితీలను కేస్ స్టడీలుగా ఇస్తూ స్థానిక పరిపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని వివరించారు. మహిళల ఓటింగ్ హక్కులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక విభాగం కేటాయించారు. ఇలా.. తొమ్మిదో తరగతి విద్యార్థులకు భారత ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని, దానికి ఎదురైన ఇబ్బందుల్ని సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశారు.


NCERT అధికారిక ప్రకటన:

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తన అధికారిక 'X' (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలను హెచ్చరిస్తూ ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది. తొమ్మిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకానికి సంబంధించి మార్కెట్లో, ఆన్‌లైన్‌లో తిరుగుతున్న కాపీలు నకిలీవని (Spurious), వాటికి ఎన్‌సీఈఆర్‌టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ అనధికారిక కాపీలలోని సమాచారం తప్పుగా ఉండటమే కాకుండా, అధ్యాయాలను మార్చడం లేదా పూర్తిగా అబద్ధపు విభాగాలను చేర్చి విద్యార్థులను, ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టించేలా రూపొందించారని హెచ్చరించింది. అధికారికంగా ప్రచురణ ప్రక్రియ పూర్తయి, తమ సొంత ఛానళ్ల ద్వారా మార్కెట్లోకి విడుదల చేసేవరకు ఏ పుస్తకాన్ని కూడా చట్టబద్ధంగా సర్క్యులేట్ చేయడానికి వీల్లేదని ఎన్‌సీఈఆర్‌టీ స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 11:28 AM