ఇంజనీరింగ్ కాలేజీ ఎంపికలో ఇవే కీలకం!
ABN , Publish Date - May 11 , 2026 | 05:08 AM
జేఈఈ అడ్వాన్స్‌డ్ మినహా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్షలన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. మంచి ర్యాంకు పొందిన వారికి పేరున్న సంస్థలోనే సీటు వస్తుంది....
జేఈఈ అడ్వాన్స్‌డ్ మినహా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్షలన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. మంచి ర్యాంకు పొందిన వారికి పేరున్న సంస్థలోనే సీటు వస్తుంది. మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన విద్యార్థులకే అసలైన కష్టం. కాలేజీ ఎంపికలో వారే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏది మంచిదన్న ప్రశ్నతో ఈ ప్రక్రియ మొదలవుతుంది.
సాదారణంగా ఎంపిక విషయానికి వచ్చే సరికి చాలా మంది విద్యార్థులు ఓ పది ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకుంటారు. అక్కడి క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు, వార్షిక ప్యాకేజీ వివరాలు తెలుసుకుంటారు. అక్కడికే పరిమితమైతే మరికొన్ని మంచి కాలేజీలను మిస్ కావచ్చు. నిజానికి సీటుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సాధ్యమైనన్ని కాలేజీలను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది.
బ్రాండ్ ఇమేజ్ అనగానే ఐఐటీ లాంటివి గుర్తుకు వస్తాయి. అక్కడ నాణ్యమైన విద్య లభిస్తుంది. పూర్వ విద్యార్థుల ప్రతిభ, అక్కడి ప్రొఫెసర్లు - విద్యార్థుల పరిశోధనలు ప్రామాణికంగా ఉంటాయి. మరికొన్ని కాలేజీలకూ బాగానే పేరుంటుంది. అవి ప్రామాణికాంశాలతో కాకుండా తమ ప్రచారంతో సంపాదించినవి. చిన్న కాలేజీలు, కొత్తగా ఏర్పాటైనవి ఆ స్థాయిలో ప్రచారానికి వ్యయం చేయలేవు. అందుకే కొన్ని చిన్న కాలేజీలు నాణ్యమైన విద్యను అందించినా ఆ స్థాయి ప్రచారాన్ని అందుకోలేక ‘వెనుకబాట’ పడతాయి. అందువల్లే కొత్త, చిన్న కాలేజీలు రిక్రూటర్లను పెద్దగా ఆకర్షించలేవు కూడా. అలాంటివాటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
ఒక కాలేజీలోని ఫ్యాకల్టీ విద్యార్హతలు ఏమిటన్నది తప్పక పరిశీలించాలి. అధ్యాపకుల్లో పిహెచ్‌డి ఎంత మందికి ఉందన్నది తెలుసుకోవాలి. ఆ డిగ్రీ లేనప్పటికీ కొందరు మంచి అధ్యాపకులు ఉంటారు. అలా ఎందరున్నారన్నదీ పరిశీలించాలి.
నాణ్యమైన విద్యను పొందేందుకు అధ్యాపక - విద్యార్థి నిష్పత్తి అతి ముఖ్యమైంది. విద్యార్థుల సగటు సంఖ్య తక్కువగా ఉండే తరగతి గదుల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది. సరిపడా అధ్యాపకులు లేనిపక్షంలో ఉన్నవారిపైనే పనిభారం అంతా పడుతుంది. దాంతో వారు స్వీయ పరిశోధనకు సమయం కేటాయించుకోలేరు. సరైన రీతిలో అసైన్‌మెంట్లను, ప్రాజెక్టు వర్క్‌ను విద్యార్థులకు ఇవ్వలేరు.
అక్కడి అధ్యాపకులు ఎవరైనా పరిశోధన చేస్తుంటే వారికి తప్పకుండా ఆయా రంగాల్లో వస్తున్న మార్పులపై సరైన అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తులు మంచి బోధనను అందిస్తారు. దానికి తోడు అక్కడ సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారా అన్న విషయాన్నీ పరిశీలించాలి.
చేరాలనుకుంటున్న విభాగంలో ల్యాబ్‌ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. అందులో ఆధునిక పరికరాలు ఉన్నాయా, ఉంటే విద్యార్థులంతా ఒకేసారి ప్రయోగాలు చేసేందుకు సరిపడా ఉన్నాయా అన్నదీ తెలుసుకోవాలి.
విద్యార్థుల సంఖ్యతో పోల్చినప్పుడు సగటున ఎన్ని పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయో కనుక్కోవాలి. లైబ్రరీకి ‘ఈ-జర్నల్స్’ ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎంత తలసరి బ్యాండ్ విడ్త్ ఉంది, తరగతి గదిలో కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, స్ర్కీన్‌లు, ఆడియో సౌకర్యం ఉందా, క్రీడల నిర్వహణ ఎలా ఉంది లాంటి అంశాలను కేవలం ఆయా కాలేజీల వెబ్‌సైట్ల నుంచి మాత్రమే పొందలేం. అందుకోసం ప్రస్తుత లేదా తెలిసిన నమ్మకమైన పూర్వ విద్యార్థులతో సంభాషించడం ఉత్తమం. వీలైతే వాటి పరిశీలనకు ఆ కాలేజీని సందర్శించడం మరో మార్గం.
చేరబోయే సంస్థకు యూనివర్సిటీ స్థాయి ఉండే పక్షంలో అక్కడ కొత్త ఆలోచనలకు, అకడమిక్ స్వేచ్ఛకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంతకాలంగా మనుగడలో ఉందన్నదీ ముఖ్యమే. అది పూర్తి రెసిడెన్షియల్ క్యాంపస్ అయితే అక్కడ నేర్చుకొనే వాతావరణం అధికంగా ఉంటుంది. సిలబ్‌సను తరచుగా మారుస్తున్నారా, అక్కడ ఎన్ని కోర్సులు అందుబాట్లో ఉన్నాయి, వంటివీ తెలుసుకోవాలి.
సదరు కాలేజీ/ డీమ్డ్ వర్సిటీలో ఎన్ని ఎలక్టివ్స్ అందుబాట్లో ఉన్నాయి, అవి ఉద్యోగాలకు పనికి వచ్చేవా లేక ఉన్నత విద్యాభ్యాసానికి ఉపకరించేవా కూడా తెలుసుకోవాలి. ఆ సంస్థలోని విద్యార్థులు ఎక్కువగా ఉన్నత విద్యకు వెళ్తున్నారంటే - అక్కడ మంచి అభ్యసన వాతావరణం ఉన్నట్లే!
అక్కడి విద్యార్థులు గేట్/క్యాట్ లాంటి పరీక్షల్లో చూపిన ప్రతిభను కూడా గమనించాలి.
ఆ కాలేజీ/ డీమ్డ్ వర్సిటీ పది పదిహేనేళ్లుగా మనుగడలో ఉంటే, దానికి పూర్వ విద్యార్థుల సంఘం ఉందా అని కూడా చూడాలి. ఒక వేళ లేనిపక్షంలో, ఆ కాలేజీని వారే పట్టించుకోనప్పుడు మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉందా అనేది తేల్చుకోవాలి. నాక్/ఎన్‌బీఏ గుర్తింపు తప్పనిసరి.
ఇంత సమాచారం కనుగొనడం చాలా కష్టమని మీరు భావించవచ్చు. అయితే అన్ని కాలేజీల సమాచారం సేకరించాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఎంచుకోవాలని భావించే కాలేజీల గురించి సేకరిస్తే చాలు. అప్పుడు అదంత కష్టం కాబోదు. కాలేజీ వెబ్‌సైట్ కూడా ఈ విషయంలో తోడ్పడుతుంది.
సహజ మేధస్సు
ప్రతి ఒక్కరిలో సహజ మేధస్సు అంతర్లీనంగా ఉంటుంది. అది వికసించేందుకు భౌతిక వాతావరణం తోడవ్వాలి. కుటుంబ నేపథ్యం, ఉత్తమ సహచర్యం, లక్ష్యం, ఆ దిశలో పయనం లాంటివి వికాసానికి తోడ్పడుతాయి తప్ప ఏదో ఒక కాలేజీలో విద్యాభ్యాసం చేయడం మూలంగానే అన్నీ సాధ్యం కావు. అలా అని కాలేజీ ప్రాధాన్యం తగ్గించలేం. మంచి కాలేజీలోనే విద్యార్థి ప్రతిభ వికసిస్తుందన్నది నిగ్గుతేలిన నిజం. విద్యార్థి దశలోనే అవగాహన, విశ్లేషణ, అన్వయం అనేవి అలవడతాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News