Share News

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 07:35 PM

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి అవకాశం కల్పించింది. వివిధ విభాగాల్లో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
Bank of Baroda Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టనున్నారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.1,20,940 వరకు వేతనం లభించే అవకాశం ఉంది.

ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు?

బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ ప్లానింగ్, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

  • ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ – 88

  • సెక్యూరిటీ – 54

  • డిజిటల్ బ్యాంకింగ్ – 19

  • ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ – 16

  • కార్పొరేట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ ప్లానింగ్ – 15

  • ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్ – 14

  • మొత్తం – 206 పోస్టులు


ఏయే పోస్టులకు నియామకం?

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు

పోస్టును బట్టి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, బీఈ లేదా బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ లేదా సంబంధిత విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా తప్పనిసరి. పోస్టును బట్టి కనీసం 2 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు అనుభవం అవసరం కావచ్చు.

వయోపరిమితి

2026 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 23 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


జీతం ఎంత?

ఎంపికైన వారికి పోస్టు, గ్రేడ్‌ను బట్టి వేర్వేరు పే స్కేల్స్ ఉంటాయి. జేఎంజీ గ్రేడ్/స్కేల్ పోస్టులకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు, ఎంఎంజీ గ్రేడ్/స్కేల్-II పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు వేతనం ఉంటుంది. ఎంఎంజీ గ్రేడ్/స్కేల్-III పోస్టులకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు, ఎస్‌ఎంజీ గ్రేడ్/స్కేల్-IV పోస్టులకు రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వరకు పే స్కేల్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.850 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.175గా ఫీజు నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపికలో పలు దశలు ఉండనున్నాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశలను నిర్వహించే అవకాశం ఉంది. తుది ఎంపికలో అన్ని దశల్లో అభ్యర్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 ఆగస్టు 6 నుంచి ప్రారంభమైనట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు గడువు ఆగస్టు 26.

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక కెరీర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు విద్యార్హత, వయసు, అనుభవం, ఫీజు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించడం మంచిది.


Also Read:

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సిందే: విద్యాశాఖ డైరెక్టర్

ఇండియన్ ఆర్మీ సైబర్ క్వెస్ట్ 2026.. ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోండి

Updated Date - Aug 07 , 2026 | 07:35 PM