Share News

గేట్‌ పరీక్షకు దశలవారీ ప్రిపరేషన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Aug 24 , 2026 | 03:09 AM

గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌) షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి తోడు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కేడర్‌లో చేరేందుకు కూడా గేట్‌లో సాధించిన స్కోర్‌ అవసరమవుతోంది.

గేట్‌ పరీక్షకు  దశలవారీ ప్రిపరేషన్‌ ప్లాన్‌

గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌) షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి తోడు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కేడర్‌లో చేరేందుకు కూడా గేట్‌లో సాధించిన స్కోర్‌ అవసరమవుతోంది. ఒకసారి సాధించిన అర్హతతో మూడు నుంచి నాలుగేళ్ళ వరకు పలు కంపెనీల్లో చేరే అవకాశం కలుగుతుంది. ఈ స్కోర్‌తో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు చాలావరకు నేరుగా ఇంటర్వ్యూ బోర్డును ఎదుర్కొంటే సరిపోతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గేట్‌ ప్రిపరేషన్‌ ఒక పద్ధతి ప్రకారం జరిగితే మంచిది. ఆ క్రమంలో టాపర్ల అనుభవాలను క్రోడీకరించి రూపొందించిన ప్లాన్‌ ఇది. గేట్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న నేపథ్యంలో దశలతో కూడిన ఒక లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌.

మొదటి దశ(తొలి మూడు నెలలు)

లక్ష్యం: హైవెయిటేజ్‌ అంటే మ్యాథ్స్‌ వంటి సబ్జెక్టుల్లో బేసిక్స్‌ పూర్తి చేయాలి.

కోర్‌ సబ్జెక్టులు: ఇంజనీరింగ్‌ మ్యాథ్స్‌, డిస్ర్కీట్‌ మ్యాథ్స్‌కు తోడు ఫౌండేషన్‌ సబ్జెక్టులు(ఉదా: సీ ప్రోగ్రామింగ్‌, డిజిటల్‌ లాజిక్‌ ఫర్‌ సీఎస్‌ఈ)పై దృష్టి సారించాలి.

వ్యూహం: మునుపటి ప్రశ్నపత్రాలను తీసుకుని ఒక టాపిక్‌ కింద వచ్చే ప్రశ్నలతో అసలు సబ్జెక్టును ముడిపెట్టాలి. వాటిలో ఉన్న ప్రాథమిక కాన్సెప్ట్‌లను పక్కాగా నేర్చుకోవాలి.

రెండో దశ(నాలుగు నుంచి ఏడు నెలలు)

లక్ష్యం: యావత్తు సిలబస్‌ను పూర్తి చేసేయాలి. ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌పై ఎక్కువ దృష్టిసారించాలి.

కీ టిప్‌: సెప్టెంబర్‌ నెలాఖరులోపు సిలబస్‌ మొత్తాన్ని పూర్తి చేసేయాలి. అప్పుడే రివిజన్‌, మాక్‌ టెస్టులకు అయిదారు నెలల గడువు ఉంటుంది. అదే టాప్‌ ర్యాంకు పొందేందుకు కీలకమైన సమయం.

నిబంధన: ఏ సబ్జెక్టునూ వదిలిపెట్టవద్దు. టఫ్‌ నుంచి తక్కువ వెయిటేజ్‌ వరకు టాపిక్స్‌ అన్నీ అధిక మార్కులు పొందడంలో ఇతోధిక పాత్రను పోషిస్తాయి.

మూడో దశ(చివరి నెలలు)

లక్ష్యం: రివిజన్‌, ప్రాక్టీస్‌, ఎగ్జామ్‌కు అనుగుణంగా సన్నద్ధం కావడంపై ఫోకస్‌ను మార్చుకోవాలి.


రివిజన్‌: నాలుగు అంచెల రివిజన్‌ మోడల్‌ను అనుసరించాలి. కొత్త టాపిక్స్‌ను 24 గంటల్లో రివిజన్‌ చేయాలి. తదుపరి ఏడు రోజులు, 30 రోజులు, చివరగా పరీక్షలకు ముందు ఒకటి - రెండు నెలలుగా ప్రిపరేషన్‌ ఉండాలి. సంక్షిప్తంగా నోట్స్‌ - ప్రతి చాప్టర్‌పై ఒక పేజీకి మించకుండా రూపొందించుకుంటే చివర్లో త్వరితగతిన రివిజన్‌ చేసుకోవచ్చు.

మాక్‌ టెస్టులు: మొదట్లో తక్కువ స్కోర్‌ వచ్చినా ఆందోళన చెందవద్దు. అవన్నీ నేర్చుకునే ప్రక్రియలో భాగం. అసలు ఎగ్జామ్‌లోపు పది నుంచి పన్నెండు మాక్‌ టెస్టులు రాయాలి. వాటిలో దొర్లిన తప్పులను విశ్లేషించుకోవాలి. ఎగ్జామ్‌కు అనుగుణంగా సన్నద్ధమవ్వాలి. అందుకు క్రమం తప్పకుండా కమిట్‌మెంట్‌తో కృషి చేయాలి.

షార్ట్‌ టర్మ్‌ ప్లాన్‌(ఆఖరు వారం)

ప్రిపరేషన్‌ తుది దశలో ఉన్నప్పుడు కొత్త టాపిక్‌లను చూడకూడదు. ఇంతకుమునుపు నేర్చుకున్న వాటిపైనే దృష్టి పెట్టాలి. వాటి రివిజన్‌, ప్రాక్టీస్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి.

రోజూ: ఫార్ములాలు, షార్ట్‌ నోట్స్‌ రివిజన్‌ చేయాలి.

మ్యాథ్స్: ఒకట్రెండ్‌ పూర్తి నిడివి ఉన్న మాక్‌ టెస్ట్‌లకు హాజరుకావాలి. వాటిని లోతుగా విశ్లేషించుకుని తప్పులను సవరించుకోవాలి.

ఆరోగ్యం: ప్రతి రోజు కనీసం ఏడెనిమిది గంటలు నిద్రకు కేటాయించుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే మైండ్‌ ఫ్రెష్‌గా ఉంటుంది.

అటెంప్ట్‌ కూడా చక్కగా ఉంటుంది.

పరీక్ష వ్యూహం

ఈజీ, మీడియమ్‌, హార్డ్‌ వ్యూహాన్ని అనుసరించాలి. పరీక్ష రాయడానికి ముందే పేపర్లో ఆ మూడింటి కింద ప్రశ్నలను చాలా వేగంగా వర్గీకరించుకోవాలి.

  • సులువుగా ఉన్న ప్రశ్నలను మొదట సాల్వ్‌ చేస్తే ఆత్మవిశ్వాసం కలగుతుంది.

  • మీడియం అంటే మళ్ళీ ఒకసారి పరిశీలించే విధంగా ఉన్నవి. ఈ కేటగిరిలో అస్సలు ఇంతకమునుపు చూడని, తెలియని ప్రశ్నలు కూడా ఉండొచ్చు.

  • చివరగా కష్టమైనవి. అంటే సమయం ఉంటే సాల్వ్‌ చేయదగ్గ ప్రశ్నలు

లక్ష్యం: బాగా తెలిసినవి అంటే అందులో కచ్చితత్వం గరిష్ఠంగా ఉండాలి. నెగెటివ్‌ మార్కింగ్‌తో మార్కులు పోగొట్టుకోరాదు. అందుకు కచ్చితంగా మార్కులు సాధించగలమన్న వాటినే అంటెప్ట్‌ చేసేలా వ్యూహం ఉండాలి. తెలిసిన ఒక్క ప్రశ్నను విడిచిపెట్టకూడదు.

పరీక్షకు సంబంధించి అదే పక్కా వ్యూహం అనిపించుకుంటుంది.

ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణారావు

డైరెక్టర్‌, ఎన్‌ఐటీ, రాయ్‌పూర్‌

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 03:09 AM