జులై 1 నుంచి టీటీసీ ఎగ్జామ్ ఆన్‌లైన్ దరఖాస్తులు.. ఫీజు వివరాలు ఇవే!
ABN , Publish Date - Jun 25 , 2026 | 09:50 PM
ఆంధ్రప్రదేశ్‌లో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు–2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాల్లోకి వెళితే..
అమరావతి, జూన్ 25: ఆంధ్రప్రదేశ్‌లో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు–2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. టీటీసీ (TTC) 42 రోజుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు గతంలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులకు కూడా ఈసారి పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన లింక్ జులై 1వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ పరీక్షకు సంబంధించిన ఫీజును రూ.150గా నిర్ణయించారు. ఎలాంటి ఆలస్య రుసుము (ఫైన్) లేకుండా ఫీజు చెల్లించడానికి జూలై 10వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఒకవేళ ఆ సమయానికి చెల్లించలేకపోతే, రూ.50ల జరిమానాతో జులై 17వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ ఫీజులను డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా సులభంగా చెల్లించవచ్చు. అయితే, అభ్యర్థుల వివరాల అప్‌లోడ్ ప్రక్రియను మాత్రం కేవలం సంబంధిత కోర్స్ ఇన్‌చార్జ్ ద్వారా మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News