ప్రస్తుత పరిస్థితుల్లో మన బాధ్యత ఏమిటి?
ABN , Publish Date - May 29 , 2026 | 12:38 AM
ఒక పక్క ముగింపు లేని రష్యా–ఉక్రెయిన్‌ల యుద్ధం, మరోపక్క ఏ మలుపు తిరుగుతుందో తెలియని ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం. ఈ పరిస్థితుల్లో రూపాయి విలువ దారుణంగా పడిపోయి నేడో, రేపో...
ఒక పక్క ముగింపు లేని రష్యా–ఉక్రెయిన్‌ల యుద్ధం, మరోపక్క ఏ మలుపు తిరుగుతుందో తెలియని ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం. ఈ పరిస్థితుల్లో రూపాయి విలువ దారుణంగా పడిపోయి నేడో, రేపో సెంచరీ కొట్టే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం రూపాయి విలువ పడిపోవటం ఒక సహజ ప్రక్రియగా భావించిందే కానీ, దాని విలువ పెంచే ప్రయత్నం చేయలేదు. కొంతవరకు అటువంటి ప్రయత్నం చేసిన ఏకైక ప్రధాని పీవీ మాత్రమే. ఆయన ప్రధాని అయ్యే నాటికి దేశంలో విదేశీ మారక ద్రవ్యం అడుగంటిపోయి బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి నెలకొన్నది. దీంతో పరిశ్రమల శాఖను తన దగ్గరే పెట్టుకొని ‘లైసెన్స్ రాజ్’ పద్ధతిని రద్దు చేసి పరిశ్రమలు బలపడేటట్టు చేశారు. దాని ఫలితాలు ఈ రోజున చూస్తున్నాం.
రూపాయి విలువ పెరగటానికి ప్రభుత్వాలు ఏ ఆలోచనా చేయకపోవటం దురదృష్టం. డాలర్లతో కొనేవాటి మీద దృష్టి పెట్టి, ఆ డాలరు వాడకాన్ని తగ్గిస్తే రూపాయి బలపడుతుంది. మనం డాలర్లని ఎక్కువ ఖర్చు చేసేది పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలుకు. అది తగ్గాలంటే ప్రజా రవాణా పెరిగి కార్లు, మోటార్ సైకిళ్ళ వాడకం తగ్గాలి. హైదరాబాద్‌లో మెట్రో వచ్చి దశాబ్దమైనా సర్వీసులు పెరగలేదు, కొత్త లైన్లు ఏర్పాటు కాలేదు. ఎందుకు జరగలేదని మనం అడగం!
ఇక రాజకీయ పార్టీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలంగాణ గత ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే కనీసం కలిసేవారు కాదు. ఎన్నికలప్పుడు రాజకీయం చేయవచ్చు, కానీ ప్రతి నిమిషం అలాగే ఆలోచిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇక ప్రధాన మంత్రిని చూస్తే మా పార్టీని గెలిపిస్తే, డబుల్ ఇంజన్ సర్కారు వస్తే అభివృద్ధి జరుగుతుందని అంటారు. అంటే వేరే పార్టీకి ఓటేస్తే సహాయం చేయం అని అర్థమా? ఇది న్యాయమా? ఇక కాంగ్రెస్‌కు అధికారం లేక పుష్కరం దాటింది. వస్తే ఆలోచిస్తామంటారే కానీ ఇది మేం చేస్తామనే క్లారిటీ లేదు.
మన దగ్గర ఉన్న వనరులు, వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ రోజున ఒక కారు తయ్యారయ్యే ధర కంటే దాని మీద వేసే పన్నులే ఎక్కువ. కొన్ని పన్నులను తగ్గించుకొని పెట్రోల్ కారు ధరకు బ్యాటరీ కారు అమ్మగలిగితే, డాలర్లతో పెట్రోలియం ఉత్పత్తులను కొనే అవసరం తగ్గుతుంది. యుద్ధం మొదలై 70 రోజులవుతుంటే ఈ రోజు రెండు కార్ల కాన్వాయిలో వెళుతున్నాం, సైకిల్ మీద వెళుతున్నాం, మెట్రోలో వెళుతున్నామనే రాజకీయ నాయకులు.. శాశ్వతంగా ఇలాగే చేయవచ్చు కదా!
ఇక గ్యాసు కొరత గురించి ప్రభుత్వం ఇప్పుడు బొగ్గు నుంచి గ్యాసు తయారు చేస్తే ఇన్ని వేల కోట్లు సబ్సిడీ ఇస్తామని ప్రకటన చూస్తే దప్పిక వేసినప్పుడు బావి తవ్వినట్లుంది. దానికి బదులుగా గ్రామాల్లో పంట కోసిన తర్వాత వచ్చే వ్యర్ధాలతో తయారుచేసే బ్రిక్వెట్సు చేయించవచ్చు. వాటిని మండలానికి ఒకటి, రెండు ఏర్పాటు చేయిస్తే అక్కడి యువతకు ఉపాధి కలుగుతుంది. రైతులకు మిర్చి కట్టె, పత్తి కట్టె, కంది కట్టె లాంటి వ్యర్ధాలను అమ్మటం వల్ల కొంత అదనపు ఆదాయం వస్తుంది. అంతేకాక వాటిని కాల్చినప్పుడు వచ్చే గ్రీన్ హౌస్ వాయువుల వల్ల పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. కమర్షియల్ గ్యాసు వాడే వారికి సగం ధరలో ఇవి లభించడంతో గ్యాసు కొనవలసిన అవసరం తగ్గుతుంది. దీనికి కావలసినది రాజకీయ చిత్తశుద్ధి. ఇంకొక ప్రధాన ఖర్చు పప్పు దినుసులు, నూనె కొనుగోళ్ళు. దీనికి ప్రభుత్వమే ఒక పాలసీ తయారు చేసి రైతులకు మంచి రేటు వచ్చేలా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలి.
ప్రభుత్వాలు ఆలోచించడానికి ధైర్యం చేయని ఒక విధానం ప్రతిదాన్నీ విదేశీ కంపెనీల నుంచి కొనే మన అలవాటు మార్చే ప్రయత్నం. కనీసం ప్రజలకు ఇలా చేయండి అని చెప్పే ధైర్యం ప్రభుత్వాలు చేయవు, చేస్తే బతకవు. మనకది తెలియదు, చెప్పవలసిన ప్రభుత్వాలు చెప్పవు. అదేమిటంటే ప్రతిదాన్నీ మనం విదేశీ కంపెనీల నుంచి కొంటాం, వాళ్ళు ఆ లాభాలను డాలర్లలో తరలిస్తారు. మన దగ్గర తయారు కానిదాన్ని విదేశీ కంపెనీల నుంచి కొంటున్నామంటే అర్థం ఉంది. కానీ మన దగ్గర నుంచి తీసిన నీటిని విదేశీ కంపెనీల నుంచి ఎందుకు కొనాలి? వాటిని శుభ్రం చేయటానికి లీటరుకు రూపాయి కూడా కాదు, బాటిల్ ఒక ఆరు రూపాయలైతే ఆ నీటిని ఇరవై రూపాయలు పెట్టి కొంటున్నాం, లాభాల్ని ఆ కంపెనీలు డాలర్ల రూపంలో విదేశాలకు తరలిస్తాయి, మనం ఆ డాలర్లను ఎక్కువ రేటుకు తిరిగి కొంటున్నాం. సబ్బులు, పేస్టులు, కూల్‌డ్రింకులు మొదలైనవి ఎందుకు విదేశీ కంపెనీల నుంచి కొనాలి?
కోకోకోలా కంపెనీ ఆదాయం గడచిన సంవత్సరంలో 5,042 కోట్లు, పెప్సీ ఆదాయం 9,096 కోట్లు. ఇంకా సబ్బులు తయారు చేసే హిందుస్థాన్ లీవర్ ఆదాయం 16,351 కోట్లు. కాల్గేట్ ఆదాయం 6,548 కోట్లు. ఇలా అన్ని విదేశీ కంపెనీల ఆదాయాన్ని చూస్తే లక్ష కోట్లు దాటుతున్నాయి. వాటి మీద వచ్చే లాభాలను డాలర్లలో తీసుకుపోవటం వల్ల మన రూపాయి బలహీనపడుతున్నది. దీనికి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఇది మనలో నుంచి రావాలి. భారతదేశపు కంపెనీల ఉత్పత్తులు ప్రజలు వాడితే ఇక్కడి కంపెనీలు బలపడతాయి, రూపాయి విలువ పెరుగుతుంది. ఈ విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వమైనా చర్యలకు యత్నిస్తే ఆ ప్రభుత్వాన్ని ఈ కంపెనీలు ఉండనీయవు. మన దేశపు రాజకీయ నాయకులు వాళ్ళ విరాళాలకు ఆశపడి వారికి భూములు, సౌకర్యాలు, సబ్సిడీలు కల్పిస్తారే కానీ, ప్రజలకు నిజాన్ని తెలియనివ్వరు. జరుగుతున్న దానిని ప్రజలు గమనించి, ప్రశ్నించిన రోజునే మన రూపాయి, మన దేశ ప్రతిష్ఠ బలపడుతుంది.
జమలాపురపు శ్రీనివాస్
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News