ఆదర్శమూర్తులకు ఆదరణ ఉందా?
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:25 AM
అవినీతికి లొంగకుండా ఉద్యోగం చేసిన అధికారులు, ప్రజల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారులు, సత్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన పాత్రికేయులు, కళను సంపాదనకు గాక, సమాజ చైతన్యం కోసం ఉపయోగించిన...
అవినీతికి లొంగకుండా ఉద్యోగం చేసిన అధికారులు, ప్రజల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారులు, సత్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన పాత్రికేయులు, కళను సంపాదనకు గాక, సమాజ చైతన్యం కోసం ఉపయోగించిన కళాకరులు, గ్రామం బాగుపడాలని తమ భూములు త్యాగం చేసిన నాయకులు... ఇలా ఎంతో మంది ఆదర్శవంతులు ఉన్నారు. వాళ్లంతా ‘మనిషి మారితే, సమాజం మారుతుంది’ అని నమ్మారు. కానీ, సమాజం వాళ్లను తిరిగి ‘మారకపోతే నువ్వే నష్టపోతావు’ అని బెదిరిస్తోంది. మన విలువలలో వచ్చిన భయంకరమైన మార్పు ఇది.
ఒకప్పుడు పిల్లలకు ‘నిజాయితీగా బతకాలి!’ అని చెప్పేవారు. మనం ఇప్పుడు విజయాన్ని... ఎంత సంపాదించాడు? ఎంత పెద్ద ఇల్లు కట్టాడు? ఎన్ని కార్లు ఉన్నాయి? అనే ప్రాతిపదికలమీద కొలుస్తున్నాం. ఎంతమంది జీవితాలను మార్చాడు? ఎంతమందికి న్యాయం చేశాడు? ఉన్నత ఆదర్శాలతో ఎంతమందికి మార్గదర్శకం అయ్యాడు? అనే ప్రశ్నలు అడగడమే మానేశాం.
ప్రతీ తరం తమ ముందుతరాల ఆదర్శవాదులను ప్రశంసిస్తుంది. తమ కాలంలో ఉన్నవారిని మాత్రం హేళన చేస్తుంది. బతికున్నప్పుడు వారిని ‘పిచ్చివాడు’ అంటుంది. చనిపోయాక ‘మహానుభావుడు’ అంటుంది. ఒక ఆదర్శవాదిని ఈ సమాజం అసౌకర్యంగా భావిస్తోంది. ఎందుకంటే, అతను మన తప్పులను గుర్తు చేస్తాడు, రాజీలను ప్రశ్నిస్తాడు, అతని నిజాయితీ మన అబద్ధాలను బట్టబయలు చేస్తుంది. అందుకే అందరం కలిసి అతడిని ఒంటరివాడిని చేస్తున్నాం. మనం మారకపోగా అతనినే మార్చాలనుకుంటున్నాం. లంచం ఇచ్చేదీ, నిజాయితీపరుడిని చూసి ‘ఇతనితో కష్టం’ అనేదీ, సిద్ధాంతాలున్న వారిని ‘ప్రాక్టికల్ కాదు’ అనేదీ, స్వార్ధపరులను గెలిపించి, సేవ చేసేవారిని వదిలేస్తున్నదీ మనమే! నీడనిచ్చి, ఆకలి తీర్చి, ప్రాణాలను నిలబెట్టే చెట్టును నరికేది మనిషే. ఆదర్శవాదుల కథ కూడా అంతే.
ఒక దేశాన్ని నిలబెట్టేవి విలువలే. ఈ రోజు మన పిల్లలు ‘నిజాయితీగా ఉంటే ఉపయోగమేమిటి?’ అని అడుగుతున్నారు. పిల్లలు మన చేతలను చూస్తారు. మనం గౌరవించేది సంపదనే అయితే, వాళ్లు సంపదనే వెంబడిస్తారు. మనం గౌరవించేది విలువలైతే, వాళ్లూ విలువలను కాపాడతారు. లోకోపకారులు, పరోపకారులు ఓడిపోతుంటే చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నామనే ప్రశ్నకు మనవద్ద సమాధానం ఉండితీరాలి.
రవికిరణ్ కోటిలింక
ఈ వార్తలు కూడా చదవండి...
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News