మోదీ సర్కార్‌కు ‘బొద్దింకల’ బెదురు!
ABN , Publish Date - May 29 , 2026 | 12:43 AM
సర్వవ్యాపక జీవి బొద్దింక మన రాజకీయ పరిభాషలో భాగం కావడానికి చాలా కాలం ముందే అది నా పాత్రికేయ పదావళిలో ఒక భాగంగా ఉండేది. జర్నలిజంపై నా ప్రసంగాలలో నేను తరచు పాత్రికేయులను...
సర్వవ్యాపక జీవి బొద్దింక మన రాజకీయ పరిభాషలో భాగం కావడానికి చాలా కాలం ముందే అది నా పాత్రికేయ పదావళిలో ఒక భాగంగా ఉండేది. జర్నలిజంపై నా ప్రసంగాలలో నేను తరచు పాత్రికేయులను బొద్దింకలతో పోల్చుతూ ఉండేవాణ్ణి. ఎందుకు? రేపు, ప్రపంచం ఒక మహా అణ్వాయుధ దాడికి (అది సంభవించకుండా ఉండుగాక) గురైతే బతికి బయటపడే జీవి బొద్దింక ఒక్కటే కదా. మానవాళి విధ్వంసాన్ని బ్రేకింగ్ న్యూస్‌గా నివేదించేందుకు ఎవరో ఒకరు తప్పనిసరిగా అవసరమమవుతారు. ఆ ఎవరో ఒకరు పాత్రికేయులు కాక మరెవరు?
సమాజ సమస్యలను పరిష్కరించడంలో దేశ రాజకీయ వ్యవస్థ ఘోర వైఫల్యం పట్ల పెల్లుబుకుతోన్న ఆగ్రహావేశాలను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆకస్మిక ఆవిర్భావం నిండుగా ప్రతిబింబించింది. పాలనను అవినీతిమయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహరిస్తున్న భయానక అంధకారాన్ని ఎత్తిచూపేందుకు మురికి తావుల్లో నడయాడే కీటకం బొద్దింకను నిరసనకారులు ఒక ప్రతీకగా తీసుకున్నారు. పాలకులు అంతకంతకూ చక్రవర్తుల్లా ప్రవర్తిస్తున్న ఒక రాజకీయ విశ్వంలో మనం ఉన్నాం. అధికారాలను విచక్షణారహితంగా చెలాయిస్తున్న పాలకులను గట్టిగా ఎదుర్కోలేనిరీతిలో ప్రతిపక్షం చీలిపోయి ఉన్న రాజకీయ విశ్వమది. ఈ వికృత రాజకీయ విశ్వంలోకి బొద్దింక పాకుకుంటూ వచ్చింది.
అసహ్యకరమైన కీటకాన్ని చిహ్నంగా స్వీకరించిన ఒక అసాధారణ వ్యంగ్య నిరసన ఉన్నపాటున ఒక ఉద్యమంగా పరిణమించింది. సుదూర అమెరికన్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక అజ్ఞాత రాజకీయ సందేశ వ్యూహకర్త ఈ ఉద్యమాన్ని ఆరంభించి భారతదేశ అధికార నడవాలలో ప్రకంపనలు సృష్టించాడు. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన (పూర్తిగా అనవసరమైన) ‘బొద్దింక’ వ్యాఖ్యలు పురికొల్పిన ఆన్‌లైన్ వేలం వెర్రి ప్రపంచ అతి పెద్ద రాజకీయ పార్టీ, మహాశక్తిమంతమైన భారత రాజ్య వ్యవస్థను తీవ్రంగా కలవరపరిచింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా ‘కొంతమంది యువకులు ఉద్యోగాల్లేక, చేస్తున్న పనిలో గుర్తింపు లేక బొద్దింకల్లా అన్ని చోట్లకు విస్తరిస్తున్నారు. వారు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థలపై దాడి చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఒక డిజిటల్ తిరుగుబాటుకు దారి తీశాయి. ఆగ్రహం ఆ తిరుగుబాటును ఉసిగొల్పగా వ్యంగ్యం దానికి అసాధారణ శక్తినిచ్చింది.
సీజేపీ ఒక రాజకీయ పార్టీ కూడా కాకపోవడం ఈ బొద్దింకల ఉద్యమాన్ని మరింత ఆకర్షణీయమూ, ఆసక్తిదాయకమూ చేస్తోంది. దానికొక నాయకుడు లేడు, ఇంచుమించు 150 కోట్ల ప్రజలతో అపార వైవిధ్యాలతో అలరారుతున్న దేశంలో చాలావరకు సైబర్ స్పేస్‌లోనే జరుగుతున్న ఉద్యమం యథాతథ పరిస్థితులకు ముప్పు కాబోదు. అయినా నరేంద్ర మోదీ నాయకత్వంలోని పాలనా వ్యవస్థ సీజేపీ గురించి ఎందుకు అంతగా ఆందోళన చెందుతోంది? విదేశీ నిధులతో జరుగుతున్న ఉద్యమమని సీజేపీని మోదీ ప్రభుత్వ మంత్రులు విమర్శించారు. దాని అనుయాయుల్లో చాలా మంది పాకిస్థాన్‌లో ఉన్నారని మోదీ సర్కార్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు అవరోధాలు కల్పించారు. వాటిని తమ ఆన్‌లైన్ దాడులకు లక్ష్యంగా చేసుకున్నారు సీజేపీ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ పరోక్ష ప్రమేయమున్నదని పలువురు ఆరోపించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సామాజిక మాధ్యమాలలో పనిచేసినవాడు కావడమే ఆ ఆరోపణకు ఆధారం.
అధికారపక్షంలో ఈ ఆందోళనకు నాలుగు కారణాలు ఉన్నాయి. మొదటిది– తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రాజకీయ కథనాల నియంత్రణపై పెద్ద ఎత్తున ఆధారపడిన ప్రభుత్వం మోదీ సర్కార్. దాని పాలన రేయింబవళ్ల వాణిజ్య ప్రచారంలా సాగుతోంది: విజయాలను ఘనంగా చెప్పుకోవడం, వైఫల్యాలను పూర్తిగా కప్పిపుచ్చడం, సరికొత్త నినాదంతో ముందుకు సాగడం. ఏటా కోటి ఉద్యోగాల సృష్టి ఒక స్వప్నంగానే మిగిలిపోయింది. రైతుల ఆదాయాలు రెట్టింపు కావడమనేది జరగనే లేదు. ప్రశ్నపత్రాలు లీక్ కావడం ఆగనే లేదు. అయినా ప్రభుత్వ అధ్వాన పనితీరును పాలకుల కథనాలు పూర్తిగా కప్పిపుచ్చుతున్నాయి. అయితే ఇంటర్నెట్ బొద్దింకలు ఈ ప్రభుత్వ కథనాలను విశ్వసించేందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. ఈ తిరస్కారమే ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరుస్తోంది.
రెండోది– యువత ఆగ్రహం. ఎన్నికలలో జయాపజయాలను అది నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుందనేది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. జీడీపీ అంకెలు పతాక శీర్షికలవుతున్నాయి. జాతీయవాద భావోద్వేగాలు ఉధృతమవుతున్నాయి. అయినా ఒక అంతులేని అభద్రతా భావంతో నేటి తరం సతమతమవుతోంది. లక్షలాది విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. పరీక్షల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతి అస్తుబిస్తుగా ఉన్నది. యువ భారతీయులలో నెలకొన్న అసంతృప్తి నైరాశ్యంలోకి జారిపోతోంది. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు శ్రద్ధ చూపడం లేదన్నది యువత ప్రధాన ఆరోపణ. వారి ఆగ్రహం భావజాలపరమైనది మాత్రమేకాదు, పూర్తిగా వ్యక్తిగతమైనది కూడా.
ఇది ఇటీవలి ఎన్నికలలో స్పష్టంగా కన్పించింది. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ రాజకీయ సంచలనంలో సంప్రదాయ రాజకీయాల పట్ల యువ ఓటర్ల అసహనం ఫూర్తిగా ప్రతిబింబించింది. దేశవ్యాప్తంగా యువ ఓటర్లు అంతకంతకూ కాలం చెల్లిన రాజకీయ ద్వంద్వాల – వామక్షాలు వర్సెస్ మితవాద పక్షాలు, ఉన్నత వర్గం వర్సెస్ ప్రజాకర్షక వాదం,–ను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. భవితనిచ్చే నవ్యత, వాస్తవికత, భావోద్వేగ బాంధవ్యాలకోసం వారు ఆరాటపడుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా విశాల, విస్తృత సమూహాలను సమీకరించే మీమ్ సంస్కృతి వారి నిరసనను వ్యక్తం చేసే భాషగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీకి ప్రాణవాయువుగా ఉన్న ఈ మీమ్ సంస్కృతి, బహుశా ఆ పార్టీకి సంబంధించి చాలా తక్కువగా అర్థం చేసుకున్న విషయమని విశదమవుతుంది. వ్యంగ్యం ఒక రాజకీయ ఆయుధమయింది. నిరంకుశ పాలనా వ్యవస్థలు ఆశ్చర్యకరంగా తరచు ఈ పదునైన శస్త్రాన్ని నెదుర్కోలేక ఆత్మరక్షణలో పడుతుంటాయి. ప్రతిపక్షాల ప్రసంగాలు, టెలివిజన్ చర్చలు, ఆగ్రహ సంపాదకీయాలను అవి సంబాళించుకుంటాయి. ఎందుకంటే అవి సుపరిచితమైన సమరాస్త్రాలే. అయితే పరిహాసాన్ని తట్టుకోవడం చాలా కష్టం. దానిని అణచివేయడం మరీ అసాధ్యం. ఒక పత్రికా ప్రకటన కంటే ఒక మీమ్ వడివడిగా విస్తృత ప్రభావాన్ని నెరపుతుంది. మీమ్ ది కాంతివేగం! చాలా జాగ్రత్తగా పెంపొందించుకుని పటిష్ఠం చేసుకున్న పేరు ప్రతిష్ఠలను ఒక ఎత్తి పొడుపు లేదా పరుషోక్తి ఒక క్షణంలో కూల్చివేస్తుంది. పరిహాసానికి పవిత్ర వస్తువు అనేది ఏమైనా ఉంటుందా? ఉండదు. అధికారం ఎప్పుడైతే ఎగతాళికి గురవుతుందో అప్పుడే దాని ప్రాభవ కాంతులు మసకబారడం ప్రారంభమవుతుంది.
మూడోది– సీజేపీ ఘోషించిన అంశాలన్నీ ప్రగాఢంగా ప్రతిధ్వనిస్తున్నాయి: పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగిత; ప్రశ్న పత్రాల లీక్‌లు; పాదుకుపోయిన అవినీతి; అనైతిక పార్టీ ఫిరాయింపులు; ఆప్తులు, ఆశ్రితులు, ఆస్తిపరుల ప్రయోజనాల పరిరక్షణకే పాలనా వ్యవస్థ ప్రాధాన్యమివ్వడం మొదలైనవి. ఈ ‘బొద్దింకల’ ఉద్యమం ఒక గందరగోళ వ్యవహారంగా కనిపించవచ్చు; అప్పుడప్పుడూ ఆదర్శాల ఆరాటం లేదా నైరాశ్యాల నిరుత్సాహంలో ఉన్న కుర్రకారు కదన కాహళిగా విన్పించవచ్చు గానీ అది అసంఖ్యాక యువత నిజమైన ఆందోళనలే ఆధార భూమికగా ఉన్న అపూర్వ ఉద్యమమది. యువతను పీడిస్తున్న వ్యాకులతలను తొలగించడంలో ఘోరంగా విఫలమైన సంప్రదాయ రాజకీయాలను నిరసిస్తున్న పెనుకేక అది.
నాల్గవది– అంతకంతకూ బలపడుతోన్న ప్రతి నిరంకుశ పాలనా వ్యవస్థ, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను జాతి వ్యతిరేక చర్యగా చట్టవిరుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తుంది. విమర్శను అసమ్మతిగా భావించడానికి బదులు ఒక కుట్రగా పరిగణిస్తుంది. అధికారాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ క్రమంగా కుదించుకుపోతూ చివరకు వ్యంగ్య వ్యాఖ్యలను సైతం తన మనుగడకు ముప్పుగా చూడడం ప్రారంభమవుతుంది. ఇదిగో, ఇటువంటి సందర్భాన్నే సీజేపీ సృష్టించింది. ప్రధాన స్రవంతి భావవ్యక్తీకరణ మార్గాలను మూసివేస్తే యువత అనివార్యంగా తమ అసమ్మతిని మరింత అంతరాయం కలిగించే విధ్వంసక పద్ధతులలో వ్యక్తం చేసేందుకు తప్పక పూనుకుంటారు. ఈ దృష్ట్యా, అసహన పాలనా వ్యవస్థ తనకు తానుగా సృష్టించుకున్న తిరుగుబాటు వేదికే కాక్రోచ్ జనతా పార్టీ.
ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ‘బొద్దింకల’ ఉద్యమ ఉత్థానంలో ప్రతిపక్షానికీ ఒక హెచ్చరిక ఉన్నది. ఆగ్రహావేశాలు యువ భారతాన్ని సంపూర్ణంగా ఆవహించి ఉన్న తరుణమిది. అయితే ఆగ్రహం దానికదే ఒక రాజకీయ మార్పుగా పరిణమించదు. యువ భారతీయుల నిరాశానిస్పృహలను ఒక నిర్మాణాత్మక మార్గంలోకి మళ్లించేందుకు ప్రతిపక్షాలు వివేకవంతంగా సంఘటితమవ్వాలి. విపక్షాలు అలా ఒక వివేకశీల వేదికగా ఏర్పడనంతవరకు యువత శక్తిసామర్థ్యాలు ఒక విస్తృత ప్రజాస్వామిక ఉద్యమంగా ప్రభవించడానికి బదులు మీమ్‌లు, ఆన్‌లైన్ తిరుగుబాటులోనే చిక్కుకుపోతాయి. నేపాల్‌లో జెన్ జడ్ తిరుగుబాటుకు సమాంతరమైనదిగా సీజేపీని చూస్తున్నవారు ఒక వాస్తవాన్ని గుర్తించాలి: పట్టుమని మూడు కోట్ల మంది ప్రజలు కూడా లేని దేశంలో ఉవ్వెత్తున ఎగసిన తిరుగుబాటు తుఫాను ఇంచుమించు 150 కోట్ల జనాభాతో విస్తారంగా సామాజిక, రాజకీయ సంకీర్ణతలు పరిఢవిల్లుతోన్న భారతీయ సమాజంలో చెలరేగడం అసాధ్యం.
కాక్రోచ్ జనతా పార్టీగా సంఘటితమవుతోన్న నేటి యువతకు ఒక సంస్థాగత ఉనికి, భావజాలం లేదా వనరులు లేకపోవచ్చు కానీ వారికి అసాధారణ శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. సృజనాత్మకత, ఆధిపత్య శక్తుల పట్ల గౌరవ భావ రాహిత్యం, అధికారాన్ని అపహసించే నిర్భీకత వారి సహజ సొత్తులు. బీజేపీ లాంటి శక్తిమంతమైన రాజకీయ సంస్థలు తమ సంప్రదాయ ప్రత్యర్థులను నిర్దయగా ఎదుర్కొని, అణచివేయడం పరిపాటి. అయితే స్పష్టమైన నాయకత్వం, ఒక కేంద్ర కార్యాలయం, మరీ ముఖ్యంగా కోల్పోవడానికి ఏమీలేని వికేంద్రీకృత తిరుగుబాటు ఉద్యమాలతో తలపడడమనేది ఒక కొత్త, వేరు విషయం. ఇదే మోదీ ప్రభుత్వ అసలైన బొద్దింకల సమస్య.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News