అమెరికా వెలుగులకు క్యూబన్ చీకట్లు ఎందుకు?
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:57 AM
‘క్యూబా విషయంలో నేను ఏమనుకుంటే అది చేయగలను.. దాన్ని స్వాధీనం చేసుకునే గౌరవం నాకు లభిస్తుందని భావిస్తున్నాను’ నాలుగురోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన...
‘క్యూబా విషయంలో నేను ఏమనుకుంటే అది చేయగలను.. దాన్ని స్వాధీనం చేసుకునే గౌరవం నాకు లభిస్తుందని భావిస్తున్నాను’ నాలుగురోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. ఇరాన్ మీద మొదలుపెట్టిన అధర్మయుద్ధంలో కూరుకుపోయి ఏమిచేయాలో తోచని పరిస్థితుల్లో మరో దేశాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లుగా ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ఇటీవల కాలంలో వెనెజువెలాతో మొదలైన ప్రభుత్వాధినేతల మార్పు, అనుకూల రాజ్యాల ప్రతిష్ఠాపన పరంపరలో త్వరలో క్యూబా చేరబోతోంది. అమెరికాతో విభేదించి, దాని సామ్రాజ్య కాంక్షలకు గండికొట్టి, నచ్చిన మార్గంలో స్వతంత్రంగా వ్యవహరించిన దేశాల్లో ఒకప్పుడు క్యూబాకు ప్రముఖస్థానం ఉంది. పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి ఇరాన్ ఒకరకంగా 1979లో సవాలు విసిరితే అంతకు 20 ఏళ్లకు ముందు క్యూబా అంతకుమించిన సాహసాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శించింది. ఇరాన్‌లో 1979 నాటి ఇస్లామిక్ విప్లవం దాని చుట్టూ ఉన్న కొన్ని ముస్లిందేశాల పాలకులను భయపెడితే, 1959 నాటి క్యూబన్ విప్లవం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎందరికో ఉత్తేజంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా సొంత ఖండంలో తనకు తిరుగులేదనుకున్న అమెరికాకు క్యూబా పక్కలో బల్లెంలా మారింది.
అమెరికా కోరుకున్న రాజకీయ వ్యవస్థలను ఏర్పాటుచేయలేని, కావాలనుకునే ఆర్థిక విధానాలను అమలుచేయలేని చిన్న, మధ్యస్థాయి దేశాలకు వరుసగా ముప్పు ముంచుకొస్తోందని ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే తేలికగా అర్థమవుతుంది. పరిస్థితి అంతమేరకే పరిమితమయ్యేలా ఉందని కూడా చెప్పలేం. భారత్ లాంటి పెద్దదేశమే ఎటూ నోరు విప్పలేని స్థితిలో ఉంది. రష్యా నుంచి చమురు కొనొద్దని శాసిస్తే అమలుపరచాల్సిన అగత్యం ఏర్పడింది. ఇరాన్‌పై దాడులతో ఏర్పడిన ఒడుదుడుకులను ఎదుర్కోటానికి రష్యా నుంచి నెలపాటు చమురు కొనుగోళ్లకు భారత్‌కు అనుమతిని ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించి చిన్నబుచ్చినా ఏమీచేయలేని అశక్తత ఆవరించింది. చైనా లాగా భారత్‌ని ఆర్థికంగా ఎదగనీయబోమనే అర్థంలో అమెరికా విదేశాంగశాఖ సహాయమంత్రి క్రిస్టొఫర్ లాండో ఈనెల 5న ఢిల్లీలో ప్రకటించినా గట్టిగా, సూటిగా, నిక్కచ్చిగా ఖండించలేని నిర్బలతే కన్పించింది. భారత–అమెరికా వ్యాపార సంబంధాలపై ఏర్పాటైన చర్చావేదికపైనే ఎటువంటి మొహమాటం లేకుండా లాండో ఆ ప్రకటన చేశారు. అమెరికాను మరోమారు గొప్పదేశంగా మారుస్తామనే నినాదాన్నీ విధానాన్నీ అందిపుచ్చుకున్న తర్వాత సంభాషణల్లో, ప్రకటనల్లో ఔచిత్యాలను ఆ దేశ నాయకులు పట్టించుకోవటం లేదు. వస్తుసేవల్లో నాణ్యతను మెరుగుపరచటానికీ, నవ్యతను తీసుకురావటానికీ, కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టటానికీ వ్యాపారరంగంలో పోటీతత్వానికి మించిన ప్రత్యామ్నాయం లేదని ఒకప్పుడు ఇంటాబయటా వినిపించిన వాదనలు ఇప్పుడు కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించటం లేదు. అమెరికాకు పూర్వవైభవాన్ని తేవటానికి ఏ దుశ్చర్యకైనా దిగుతామనే ధోరణే ఇప్పుడు వినిపిస్తోంది. దేశాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన నానాజాతి సమితిని హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతలు పట్టించుకోలేదు. విజేత రాజ్యాలన్నీ కలిసి ఏర్పాటుచేసిన సంస్థను ఎందుకు లెక్కపెట్టాలన్న ధోరణితో దాని నిబంధనలన్నిటినీ ధిక్కరించి హిట్లర్ యూరప్‌లో ఒక్కోరాజ్యాన్ని చెరబట్టారు.
రెండో ప్రపంచయుద్ధం తర్వాత స్వయంగా అమెరికా ప్రోద్బలంతో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితికీ ఇప్పుడు అదేస్థితి వచ్చింది. తేడా అల్లా ఒక్కటే. స్థాపించిన వారే ఇప్పుడు దాని అస్తిత్వాన్ని లెక్కచేయటం లేదు. ఐక్యరాజ్యసమితికి సమస్యలు తీసుకెళ్లకుండా, అందులో చర్చలు లేకుండా యుద్ధాలను ప్రకటించటమూ, రాజ్యాధినేతలను ఎత్తుకుని పోవటమూ, హతమార్చటమూ అమెరికాకు ఇప్పుడు రివాజుగా మారింది.
అమెరికాకు భూభాగం కొరత ఎప్పుడూ లేదు. విస్తీర్ణం పరంగా ప్రపంచంలో మూడోస్థానంలో ఉంది. వనరులపరంగానూ లోటులేదు. కానీ విస్తరణకాంక్షతోనే మొదటినుంచీ తన్నుకులాడుతోంది. క్యూబా విషయంలో అది మరింత నిజం. క్యూబాను స్పెయిన్ నుంచి కొనుగోలు చేయటానికి ప్రయత్నాలూ చేశారు, ఆక్రమించుకోటానికి పావులూ కదిపారు. థామస్ జఫర్‌సన్ అమెరికా అధ్యక్షుడిగా (1801–1809) ఉన్నప్పుడే ఈ వ్యవహారాలు నడిచాయి. స్పెయిన్ వాటిని పడనీయలేదు. లాటిన్ అమెరికాలో మిగతా దేశాలపై పెత్తనాన్ని 1820ల నాటికే వదులుకోవాల్సి వచ్చినా క్యూబాపై పట్టును వీడలేదు. ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో ఆనాడు క్యూబా అగ్రస్థానంలో ఉండటమే అందుకు కారణం. 19వ శతాబ్దంలో సామ్రాజ్యశక్తిగా స్పెయిన్ ప్రాబల్యం క్షీణించిపోయింది. అదే సమయలో క్యూబన్ జాతీయవాదులు బలం పుంజుకున్నారు. స్పెయిన్‌పై యుద్ధానికీ దిగారు. విస్తరణకాంక్షతో ఉన్న అమెరికాకు అది చక్కని అవకాశంగా పరిణమించింది. జాతీయవాదుల పక్షాన స్పెయిన్‌తో యుద్ధానికి దిగింది. స్పెయిన్ ఓడిపోయింది. క్యూబాకు స్వాతంత్ర్యం లభించింది. అయితే ఆ సంతోషం కొద్దికాలం కూడా నిలవలేదు. అన్నింటా తనకు లోబడి ఉండాలనే షరతులను అమెరికా విధించింది. అనుకూల వ్యాపార ఒప్పందాలను క్యూబాపై రుద్దింది. సముద్రతీరం పక్కనే ఉన్న క్యూబాకు చెందిన ‘గ్వాంటానమో–బే’నీ అప్పుడే స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ అమెరికా సైనికస్థావరం అక్కడే ఉంది. పేరుకు స్వతంత్రదేశమైనా అమెరికాను ఎదిరించలేని క్యూబా నిజానికి వలస ప్రాంతంగానే ఉండిపోయింది. 1898 నుంచి 1933 వరకూ అమెరికా సైన్యం క్యూబా నుంచీ కదల్లేదు. పొరుగుదేశాలతో మంచిగా మెలగాలంటూ (గుడ్ నేబర్) ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ప్రవేశపెట్టిన విధానంతో అమెరికా సైనికులు క్యూబాను వదిలారు. ఆ వెంటనే అమెరికాకు ఇష్టుడైన క్యూబా సైనికనేత ఫూల్‌హెన్సియో బటిస్టా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా వ్యాపార ప్రయోజనాలకూ, వాటికి తోడ్పడి లాభపడే క్యూబన్ భూస్వామ్య, ధనికవర్గాలకూ ప్రతీకగా బటిస్టా పాలన నిలిచిపోయింది. విచ్చలవిడి అవినీతితో పాటు, జూదానికీ మాఫియా పాలనకూ క్యూబా నిలువుటద్దంగా మారిపోయింది. అమెరికాతో అన్ని విధాలుగా అంటకాగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యపాలన సైతం క్యూబాలో ఉందని ప్రచారం చేసుకోటానికి బటిస్టా కొన్ని ఏర్పాట్లను చేశారు. కొంతకాలం అధికారం నుంచి తప్పుకొన్నా తెరవెనుక నుంచి అసలు వ్యవహారాలన్నీ తనే నడిపారు. ఎన్నికలప్పుడు రిగ్గింగు చేయటం, ప్రత్యర్థులను భయపెట్టటం సర్వసాధారణంగా మారింది. చివరికి 1952లో నామమాత్రంగా అమలయ్యే రాజ్యాంగాన్ని సైతం సస్పెన్షన్‌లో ఉంచి దేశం నుంచి పారిపోయేవరకూ బటిస్టా నియంతగానే పాలించారు. అమెరికా కంపెనీల పెట్టుబడులు ఆ కాలంలో క్యూబాలోకి ఎక్కువగానే వచ్చాయి. అమెరికాకు అవసరమైన రీతిలో క్యూబాలో కొంత అభివృద్ధీ జరిగింది. అదంతా పైవర్గాలకే ఉపయోగపడింది. అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికా పెట్టుబడులు వచ్చినా క్యూబాలో చక్కెర పరిశ్రమ మినహా ఇతర పరిశ్రమలు పెద్దగా అభివృద్ధి కాలేదు. ఆ పరిశ్రమలోనూ అమెరికా కంపెనీల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది.
ఇతర పరిశ్రమల స్థాయి ఎంత అధోగతిలో ఉండేదో తెలుసుకోవాలంటే ఆ దేశ ఎగుమతులను చూస్తే సరిపోతుంది. వాటిల్లో చక్కెర వాటా 80 నుంచి 85 శాతం ఉండేది. మిగిలిన 15 శాతంలో పొగాకు వాటా సగభాగం ఆక్రమించేది. రాగి, నికెల్ లాంటి లోహాలు 3 నుంచి 5 శాతం ఉండేవి. మిగిలినవన్నీ వ్యవసాయ, పశు ఉత్పత్తులే.
బటిస్టా అవినీతి పాలన, అణచివేతలతో ప్రజలు విసిగివేసారి ఉన్న సమయంలో ఫిడేల్‌కాస్ట్రో రెండువేల మంది సాయుధులతో క్యూబా రాజధాని హవానాలోకి ప్రవేశించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. నిజానికి కాస్ట్రో, చేగువేరాల విధానాలపై మొదట్లో అమెరికాకు స్పష్టతలేదు. కాస్ట్రోకు కూడా అడుగులు ఎటువేయాలన్న దానిపై సందిగ్ధత ఉండేది. ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఐజన్‌హోవర్.. కాస్ట్రో సైతం తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని కొంతవరకూ భావించారు. 1959 నాటి విప్లవం తర్వాత వెంటనే కాస్ట్రో అమెరికాకు వెళ్లి ఐజన్‌హోవర్‌తో చర్చలూ జరిపారు. అమెరికాకు తలవొగ్గి ఉండటం కష్టమని కాస్ట్రోకు అర్థమవ్వగానే ఆలోచనలూ అడుగులూ స్పష్టత సంతరించుకున్నాయి. 1960లో సోవియట్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి వచ్చిన చమురును శుద్ధిచేయటానికి క్యూబాలోని అమెరికన్ ఆయిల్ రిఫైనరీలు తిరస్కరించాయి. దీంతో వాటిని కాస్ట్రో జాతీయం చేశారు. ప్రతీకారచర్యగా క్యూబా నుంచి దిగుమతయ్యే చక్కెర కోటాను అమెరికా తగ్గించివేసింది. దాంతో చక్కెర పరిశ్రమలనూ, ఇతర అమెరికన్ కంపెనీలనూ కాస్ట్రో జాతీయం చేశారు. భూసంస్కరణలతో అమెరికన్ల చేతుల్లో పెద్దఎత్తున పోగుపడిన భూములూ చేజారాయి. క్యూబాపై సంపూర్ణ వాణిజ్య నిషేధాన్ని అమెరికా ప్రకటించింది. అప్పటి నుంచి ఒబామా అధ్యక్షుడయ్యే వరకూ ఆ నిషేధం కఠినంగా కొనసాగింది. 2015లో మొదలైన సడలింపులు 2017 వరకూ మాత్రమే కొనసాగాయి. ట్రంప్ వాటన్నిటినీ పక్కనబెట్టి మళ్లీ యథాతథ స్థితిని తీసుకొచ్చారు. టెర్రరిస్ట్ దేశాల జాబితాలోకి క్యూబానూ చేర్చారు.
ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా రాజధానిపై దాడిచేసి అప్పటి అధ్యక్షుడు నికొలస్ మదురోను అరెస్టు చేసిన తర్వాత అమెరికా అక్కడి చమురు పరిశ్రమను తన అదుపులోకి తెచ్చుకుంది. క్యూబాకు చమురు ఎగుమతులను నిలిపివేసింది. విద్యుత్తు ఉత్పత్తికి చమురుపైనే ప్రధానంగా (80–90%) ఆధారపడిన క్యూబాలో చీకట్లు అలుముకుంటున్నాయి. 1959 తర్వాత విద్య, వైద్య రంగాల్లో క్యూబా మంచి ప్రగతినే సాధించినా ఇతర రంగాల్లో అనుకున్నంత ముందుకు వెళ్లలేదు. ఎగుమతులు– దిగుమతులు చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఎగుమతులు 2–3 బిలియన్ డాలర్లు ఉంటే 8–12 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు. ఆహారధాన్యాలకు కూడా 60 నుంచి 80 శాతం వరకూ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో క్యూబన్ వైద్యులూ, వైద్య సిబ్బందీ అందించే సేవల ద్వారానే ప్రధానంగా విదేశీమారక ద్రవ్యం (40–50%) లభిస్తోంది. పర్యాటకరంగం నుంచి మరో 15 నుంచి 25 శాతం అందుతోంది.
65 ఏళ్ల పాటు అమెరికా నిషేధాలనూ, రహస్య పథకాలనూ, కుట్రలనూ ఎదుర్కొని క్యూబా సాటిలేని ధైర్యాన్ని ప్రదర్శించి రాజకీయంగా నిలబడగలిగినా ఆర్థిక పునాదులను పటిష్ఠంగా వేసుకోలేకపోయింది. సోవియట్ రష్యా ఆర్థిక సహాయంతో 1990ల వరకూ ఎలాగోలా నెట్టుకువచ్చినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1990ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొదలైన ఆర్థిక సంస్కరణలను పరిమితంగా చేపట్టినా అవి ఇచ్చిన ఫలితం కొంతే. 1995 నుంచి 2008 వరకూ సాధించిన ప్రగతి ప్రధానంగా వెనెజువెలా చమురుపై ఆధారపడే జరిగింది. 2008 నుంచి ఇప్పటివరకూ 1–2 శాతాల మధ్య ఆర్థికాభివృద్ధి ఊగిసలాడుతూ ఉంది.
ఏకపార్టీ రాజకీయ ఆధిపత్యాన్ని స్థాపించిన విప్లవోద్యమం.. ఆరంభంలోని ఊపునూ, ఉత్సాహాన్నీ కోల్పోయిన తర్వాత చాలా పరిమితంగానే ఆర్థిక విజయాలను నమోదు చేస్తుంది. రష్యా, తూర్పు యూరపు దేశాలే దీనికి ఉదాహరణ. ఈ ఒరవడికి భిన్నంగా ఏకపార్టీ పాలనలోని చైనా ఒక్కటే ఊహించని విజృంభణతో ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించి, పోటీతత్వంతో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలకు పదునుపెట్టుకుని ఆ బలహీనతను గణనీయంగా అధిగమించింది. ప్రజల జీవనప్రమాణాలను స్వల్పకాలంలో కనీవినీ ఎరగని రీతిలో పెంచగలిగింది. క్యూబా ఆ బలహీనతను తనదైన దారిలో అధిగమించకపోతే మళ్లీ అమెరికా ఆధిపత్యం కింద నలిగిపోతుంది. అమెరికా గత వైభవ వెలుగుల కోసం క్యూబా మళ్లీ చీకట్లలో కూరుకుపోకూడదనుకుంటే జరగాల్సింది అదే!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం
విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్
జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News