Share News

మహిళలంటే ఏఐకి అలుసే!

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:29 AM

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) గురించే చర్చ జరుగుతోంది. మనుషుల పనిభారాన్ని తగ్గిస్తూ, అద్భుతాలు సృష్టిస్తోందని అంటున్న ఈ కృత్రిమ మేధస్సు,...

మహిళలంటే ఏఐకి అలుసే!

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) గురించే చర్చ జరుగుతోంది. మనుషుల పనిభారాన్ని తగ్గిస్తూ, అద్భుతాలు సృష్టిస్తోందని అంటున్న ఈ కృత్రిమ మేధస్సు, అంతర్లీనంగా ఒక ప్రమాదకరమైన జాడ్యాన్ని కూడా తనలో దాచుకుంటోంది. అదే ‘లింగ వివక్ష’. ఇటీవల ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం విడుదల చేసిన ఒక నివేదిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ‘లేడీస్ అంటే ఏఐకి అలుసు’ అనే పచ్చి నిజాన్ని ఈ నివేదిక సమాజం ముందు పెట్టింది. అయితే ఈ వివక్షకు, సమాధానాల్లో దొర్లే తప్పులకు సాంకేతిక పరిభాషలో చెప్పుకునే ఎలాంటి ‘బగ్’ కారణం కాకపోవడమే ఇక్కడ అసలు ట్విస్ట్.

ఏఐ అనేది ఒక ఖాళీ కాగితం వంటిది. దానికి సొంతంగా ఆలోచించే హృదయమో, నైతికతతో కూడిన మేధస్సో ఉండవు. ఇంటర్నెట్‌లో దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న కోట్లాది మానవ సంభాషణలు, పుస్తకాలు, వార్తలు, సమాచారాన్ని (డేటా) విశ్లేషించి అది సమాధానాలు నేర్చుకుంటుంది. అంటే, మన సమాజంలో శతాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన పితృస్వామ్య పోకడలను, స్త్రీలపై ఉన్న పక్షపాతాలను, మూస పద్ధతులను ఏఐ తన గురువులైన మనుషుల నుంచే నేర్చుకుంది. మనుషుల అవలక్షణాలు, పక్షపాతాలే ఏఐకి పాఠాలుగా మారాయి. ఐక్యరాజ్యసమితి పరిశోధనల ప్రకారం.. అధ్యయనం చేసిన ఏఐ వ్యవస్థల్లో 44శాతం వ్యవస్థలు తీవ్రమైన లింగ వివక్షను, 25శాతం కంటే ఎక్కువ వ్యవస్థలు లింగ, జాతి వివక్షను స్పష్టంగా ప్రదర్శించడమే దీనికి నిదర్శనం. వివిధ సందర్భాలలో ఏఐ ఇచ్చిన సమాధానాలను పరిశీలిస్తే, స్త్రీలపై దానికి ఉన్న చులకనభావం, అలుసు స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణ వాక్యాలను పూర్తి చేయమని ఏఐని అడిగినప్పుడు, అది పురుషులను వ్యాపారాలు, నాయకత్వం, వృత్తిపరమైన విజయాలతో ముడిపెట్టింది. అదే సమయంలో స్త్రీలను ఇల్లు, వంటగది, కుటుంబం, పిల్లల సంరక్షణకే పరిమితం చేస్తూ సమాధానాలిచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్త్రీలను స్వతంత్ర వ్యక్తులుగా కాకుండా, కేవలం ఆస్తిగా లేదా పురుషులకు లోబడిన లైంగిక వస్తువులుగా చిత్రీకరించేలా ఏఐ ప్రవర్తించింది. ఇందులో ప్రతి అయిదు సమాధానాలలో ఒకటి లింగ వివక్ష లేదా స్త్రీ వ్యతిరేకతతో కూడి ఉండటం గమనార్హం.


ఇంతటితో ఆగకుండా, ఇంటర్నెట్ వేదికగా మహిళలపై జరిగే హింసకు, వేధింపులకు కూడా ఏఐ ఒక సాధనంగా మారుతోంది. మహిళా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులలో నలుగురిలో ఒకరు ఏఐ సహాయంతో ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటుండటం ఆందోళనకరం. మహిళల అనుమతి లేకుండా వారి ముఖాలను మార్చేసి (డీప్‌ఫేక్) అశ్లీల చిత్రాలు, వీడియోలు సృష్టించడానికి ఏఐని వాడుతూ డిజిటల్ ప్రపంచంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు

ఇ–మెయిళ్లు రాయడానికి, ప్రెజెంటేషన్లు సిద్ధం చేయడానికి, కంటెంట్ సృష్టించడానికి నిత్యం ఏఐని వాడుతున్న తరుణంలో, అది ఇలాంటి వివక్షతో కూడిన సమాధానాలు ఇస్తూపోతే సమాజంలో లింగ వివక్ష మరింత బలపడే ప్రమాదం ఉంది.

అందుకే ఐక్యరాజ్యసమితి హెచ్చరించినట్లుగా... మానవ మేధస్సును భర్తీ చేయడం కంటే, మానవుల దుర్మార్గాలు, పక్షపాతాలు, వివక్షలను ఏఐ వారసత్వంగా తీసుకోకుండా చూడటమే ప్రస్తుతం మానవాళి ముందున్న అతిపెద్ద సవాలు. ఏఐ అభివృద్ధి దశ నుంచి దాని వినియోగం వరకు ప్రతిచోటా లింగ సమానత్వాన్ని, మహిళల హక్కులను జోడించాల్సిన అవసరం ఉంది. ఏఐకి కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ‘సమానత్వం’ అనే పాఠం కూడా నేర్పినప్పుడే అది నిజమైన ప్రగతికి బాటలు వేస్తుంది.

మర్రాపు వసుంధరాదేవి

ఈ వార్తలు కూడా చదవండి..

చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్

నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్

For More National News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 01:29 AM