Share News

తెలుగు విలాపం

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:42 AM

ఎన్ని గౌరవాలు అందుకున్నాను ఎన్నెన్ని వైభవాలు నేననుభవించినాను శాతవాహనుల చేత...

తెలుగు విలాపం

పల్లవి:

కనిపించుటలేదు – నేను/ వినిపించుటలేదు

బతికే ఉన్నానని – నాకే/ అనిపించుటలేదు

నా పేరు అ ఆ లు/ పూర్తి పేరు ఓనమాలు

తరతరాల వెలుగని నా వెనుకటి పేరు

దినదినము చీకటి అవుతున్నది నా తీరు ll కని ll

చరణం: 1

ఎన్ని గౌరవాలు అందుకున్నాను

ఎన్నెన్ని వైభవాలు నేననుభవించినాను

శాతవాహనుల చేత

పద – అభిషేకాలు/ పాదాభిషేకాలు

రాజరాజ నరేంద్రుని నీరాజనాలు

రాజసమరియాదలు

కాకతీయ రుద్రమతో కరచాలనలు

చెరిగిపోయి మిగిలె నాకు అవహేళనలు ll కని ll

చరణం: 2

ఆంధ్రభోజుడు మోసిన పల్లకినైనాను

మొల్ల కవిత సిగలొ మొలిచె మల్లికనైనాను

విశ్వనాధ సినారె భరద్వాజ/ కలాలతో

మొన్న కదా నేను జ్ఞాన/ పీఠమెక్కినాను

ఇపుడు తెలుగువారి ఎదల/ గడపకూడ ఎక్కలేక

దుఃఖముతో వెక్కి వెక్కి

చిక్కి శల్యమై నేను ll కని ll

చరణం: ౩

బడి పిల్లల నోట నా తెలుగు మాట వినబడెనని

వెడల గొడితే కంట నీటి కడవను అవుతున్న

నా కడుపున పుట్టినోళ్లే

గడప దాటి పొమ్మంటే కన్నతల్లిగా నాకు

ఎంత కడుపు కోత

రాయకండి నా నుదుటన జీవచ్ఛవ రాత ll కని ll

చరణం: ౪

ఇద్దరు తెలుగు బిడ్డలు కలిసిన చోటు

ఇంగ్లీషులో మాటాడితె ఎంత సిగ్గుచేటు

ఆంగ్లభాష నేర్చుకుంటే వద్దన్నానా

అమ్మభాష కన్యాయం వద్దంటున్న

సాటి రాష్ట్ర భాషలకట ఎంత వికాసం

తేట తెలుగునూ ఇట నాకెందుకీ వినాశం ll కని ll

సుద్దాల అశోక్ తేజ

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్

For More National News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 12:42 AM