‘తెలుగు తక్కువ’ తరానికి దారేది?
ABN , Publish Date - Aug 29 , 2026 | 02:10 AM
ఏడాదికి రెండుసార్లు.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఆర్నెల్లకోసారి మనకు తెలుగు భాష గుర్తొస్తుంది. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం, ఇంకో ఆర్నెల్లకు ఆగస్టు 29న తెలుగు భాషాదినోత్సవం...
ఏడాదికి రెండుసార్లు.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఆర్నెల్లకోసారి మనకు తెలుగు భాష గుర్తొస్తుంది. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం, ఇంకో ఆర్నెల్లకు ఆగస్టు 29న తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా భాష గురించి మాట్లాడుకుంటాం. తెలంగాణ ఏర్పడిన తరువాత సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా పాటిస్తున్నారు. ఏమైనా, భాష గురించి ఈ రోజుల్లో చర్చించుకోవటానికైనా ఈ ‘దినోత్సవాలు’ పనికొస్తున్నాయి. తెలుగు భాషకు ఇంగ్లీష్ వల్ల పెనుప్రమాదం వచ్చిందని ఈ సందర్భంగా ఉపన్యాసాలు ఇవ్వటం, అందులో మీడియా భాష మీద నాలుగు రాళ్ళేసి వెళ్ళటం క్రమం తప్పకుండా జరుగుతోంది.
వాడుక భాషలో ఇంగ్లీష్ మాటలు ఎక్కువగా వస్తున్నాయనే విమర్శ ఉన్నమాట నిజం. ఇంగ్లీష్ మీడియం చదువులు ఒకవైపు, మీడియాలో అనవసరపు ఇంగ్లీష్ మాటల వాడకం ఇంకోవైపు ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తూ వస్తున్నాయి. అయితే, సంస్కృతం వాడకం సంగతేంటి? ‘జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు’ అనే మాట నిజమే అయినా, ఇంకా ఎంత కాలం అదే సంస్కృతంతో తెలుగుకి దూరమవుదాం? ‘వాడుక భాష’ అనకుండా ‘వ్యావహారిక భాష’ అనటంలోనే మనకున్న సంస్కృత ప్రేమ అర్థమవుతోంది. ఏదైనా ఒక ఇంగ్లీష్ మాట వస్తే దాన్ని తెలుగులో చెప్పాలనుకున్నప్పుడు మనం సంస్కృతాన్ని ఆశ్రయిస్తున్నాం.
మీడియాలో ఇప్పటికీ అదే జరుగుతోంది. మొబైల్ ఫోన్‌ను చరవాణి అని, ఇంటర్నెట్‌ను అంతర్జాలం అని రాస్తున్నాయి. కేవలం ఇంగ్లీష్ వాడకూడదనే అభిప్రాయంతోనే ఇలాంటి అనువాదాలకు దిగుతున్నట్టు ఉంది తప్ప సామాన్యులకు అర్థం కావాలన్న అభిప్రాయం ఉన్నట్టు కనబడడం లేదు. పైగా, ఎక్కువమంది మెచ్చి ఆహ్వానించి వాడటం మొదలుపెట్టినప్పుడే ఇలాంటి మాటలకు సార్వజనీనత వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్‌ను బాహ్య వలయ రహదారి అని అనువదించటం వల్ల ఒరిగేదేమీలేదు. ఇంకా వీలైతే ‘చుట్టుదారి’ లాంటి మాట అయితే జనం అర్థం చేసుకుంటారు.
సామాన్య జనం ‘ఇళ్ళు కడతారు’. మీడియా వాళ్ళు మాత్రం ‘గృహాలు నిర్మిస్తారు’. జనం కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ మీడియా రాతల్లో మాత్రం ‘నూతన వస్త్రాలు ధరిస్తారు’. అసలు ఏ మాత్రమూ ఆలోచించకుండానే మీడియాలో చాలా సందర్భాలలో ‘నూతన’ అని వాడుతున్నారు తప్ప జనం మాటల్లో వాడే ‘కొత్త’ జోలికి పోవటం లేదు. ‘అనంతరం’ బాగుంటుంది గాని తరువాత నచ్చదెందుకో? జనం ‘ఒప్పుకుంటారు’ గాని మీడియా వాళ్ళు మాత్రం ‘అంగీకరిస్తారు’. ‘పుట్టారు’ బదులు ‘జన్మించారు’ అంటారు. ‘వాడకం’ బదులు వినియోగం అంటేనే తృప్తిగా ఉంటోంది.
‘కోప్పడ్డారు’ బదులు ‘ఆగ్రహించారు’ అని వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? గెలిచారు అనటానికి బదులు విజయం సాధించారు అని, అమ్మకం బదులు విక్రయం అని, ఓడినవాళ్లను పరాజితులు అని, ‘మెచ్చుకున్నారు’ బదులు ‘అభినందించారు’ అని, ఎగతాళి బదులు అపహాస్యం అని, పుకార్లు బదులు వదంతులు అని రాయటం, చెప్పటం నిజం కాదా? మనం రాసేటప్పుడు ఆ మాట సామాన్య జనం వాడుతున్నదా, కాదా అనేది ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నామా?
తరచూ తెలుగుభాష గురించి ఆవేదన వెళ్లగక్కే ఒక ఆచార్యులవారు ఈ మధ్యనే తన అనుభవాన్ని పంచుకున్నారు. చాలా పెద్ద చికిత్సాలయానికి వెళ్ళి ‘దంతవైద్యునితో కలిసేది ఉంది’ అని అక్కడున్న మహిళతో అంటే ఆమె ఏగాదిగా చూసిందట. ‘డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ ఉంది’ అన్నప్పుడు ఆమెకు అర్థమైందట. ఈ పరిస్థితికి తెలుగు వాళ్ళందరినీ సిగ్గుపడవలసిందిగా కోరతున్నారాయన. దంత వైద్యుడనే సంస్కృతం జోలికి పోకుండా, దుష్టసమాసమంటూ చాదస్తానికి పోకుండా ‘పళ్ల డాక్టర్’ అని అడిగి ఉంటే సరిపోయేది.
జనం నోళ్లలో నానే ‘బడి’ని ‘పాఠశాల’ చేసి అదే రుద్దాలని చూడటం వల్ల చివరికి ‘స్కూలు’ స్థిరపడిపోయింది. ‘పై చదువులకు’ అని జనం మాట్లాడుకుంటూ ఉంటే మీడియా మాత్రం ‘ఉన్నత విద్యాభ్యాసం కోసం’ నుంచి దిగిరాలేదు. ఈలోగా ‘హయ్యర్ స్టడీస్’ అని మాట్లాడే తరం వచ్చేసింది. అతిగా ఇంగ్లీష్ వాడవద్దని చెప్పాలి తప్ప చీటికి మాటికి సంస్కృతాన్ని ఆశ్రయించటం తగ్గించుకోమని ఎవరైనా చెప్పినా సంస్కృత ప్రేమికులకు కోపమొస్తుంది. వందల ఏళ్లనాటి పరాయిభాష కంటే వేల ఏళ్ల నాటి మన సంస్కృతం మెరుగు అనేది వీళ్ళ సమాధానం.
ఒకప్పటి గ్రాంథికం నుంచి ఇప్పుడున్న స్థాయికి రావటానికి అవిశ్రాంత పోరాటం జరిపి, వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళినవాడు గిడుగు రామమూర్తి. కొంతమంది పండితులు ఆయన వాదనతో ఏకీభవించి సరళ గ్రాంథికంలో రచనలు మొదలుపెట్టారు. ఆ తరువాత పత్రికలు కూడా అదే బాట పట్టాయి. తాపీ ధర్మారావు లాంటివాళ్లు చొరవతీసుకున్నారు. శిష్టవ్యావహారికంలో రాయటం మొదలుపెట్టారు. ‘వారు పరమపదంబు జెందె’ నుంచి ‘వారు పరమపదించారు’ దాకా తీసుకురాగలిగారు. ఆ తరువాత తరాల్లో మరింత సరళమై ‘వారు చనిపోయారు’ దాకా రావటం చూస్తున్నాం.
గిడుగు తరువాత కూడా వ్యావహారిక భాష మీద మరింత ఆలోచన జరిగింది. 1970లలో కూడా యూనివర్సిటీల పాఠ్యగ్రంథాలు గ్రాంథికంలోనే ఉండటం మీద చర్చ మొదలైంది. ప్రభుత్వ కార్యకలాపాలు, యూనివర్సిటీ పరీక్షలు, పరిశోధనాపత్రాలు శిష్టవ్యావహారికంలో అనుమతించాలంటూ 1971లో ఆంధ్రా యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం ఒక చరిత్రాత్మక ఘట్టం. దీనిమీద 11 మందితో ఏర్పాటైన కమిటీ ఐదు సమావేశాలు జరిపింది. ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల పరిధిలోని ఎనిమిది మంది, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని ఏడుగురు సాహిత్య, పాత్రికేయ ప్రముఖుల అభిప్రాయాలు సేకరించారు. ఆ విధంగా రూపొందించి ఇచ్చిన నివేదిక ఆధారంగా శిష్టవ్యావహారానికి ఆమోద ముద్ర పడి యాభై ఏళ్ళు గడిచాయి.
ఈ యాభై ఏళ్ళలో భాష వాడకంలో చాలా మార్పులొచ్చాయి. రచనల్లో, విద్యారంగంలో, మీడియాలో వచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. అయితే, ఈ మార్పులు ఏ దిశగా వెళుతున్నాయన్నదే భాషా ప్రేమికుల ఆందోళన. తప్పులు ఎంచుకుంటూ బాధపడటం కంటే, ప్రవాహశీలమైన భాషను క్రమబద్ధం చేసి దిశానిర్దేశం చేయాలన్న ఆలోచన కూడా కొంతమంది మాటల్లో బైటపడుతోంది. ఇది వ్యక్తులతో వీలయ్యే పనికాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు ఆకాడెమీలు, తెలుగు విశ్వవిద్యాలయాలు, అధికార భాషా సంఘాలు, మీడియా అకాడెమీలు ఉన్నాయి. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ సంస్థల సారథ్యంలో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. తెలుగు భాష వాడకం తీరుతెన్నులను సమీక్షించి ఇప్పటి ‘తెలుగు తక్కువ’ తరానికి మార్గదర్శనం చేసేలా సూచనలివ్వాలి.
కృత్రిమ మేధస్సు (AI), యంత్ర అనువాదం, వాయిస్ అసిస్టెంట్లు, పాడ్‌కాస్ట్‌లు, ఓటీటీ వేదికలు, సోషల్ మీడియా, డిజిటల్ వార్తా వ్యవస్థల విస్తరణతో తెలుగు భాష వాడకం ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. అందువల్ల భవిష్యత్తులో చాలా మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. తెలుగు వాయిస్ సెర్చ్ వినియోగం పెరుగుతుంది. ఎఐ ఆధారిత వార్తా రచన అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ నిఘంటువులు మరింతగా అందుబాటులోకి వస్తాయి. యూనికోడ్ వినియోగం వల్ల తెలుగు లిపి మరింత విస్తరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు కంటెంట్ వాడకం పెరుగుతుంది. మీడియాలో తెలుగు సాంకేతిక పదసంపద అభివృద్ధి చెందుతుంది. వాడుక భాషను వేగంగా జనంలోకి తీసుకువెళ్లటంలో సోషల్ మీడియా పాత్ర చెప్పుకోదగినంతగా ఉంది. అయితే, భాషా ప్రమాణాల మీద ప్రతికూల ప్రభావం కూడా చూపుతోంది. అందుకే అవసరమైనంత మేరకే ఇంగ్లీష్, సంస్కృతం వాడేట్టు చూడటం ద్వారా తెలుగును కాపాడుకోవాలి. ఆధునిక తెలుగు వాడకం కోసం ఒక శైలీపత్రం తయారు చేయాలి.
విశ్వవిద్యాలయాల స్థాయిలో శిష్టవ్యావహారానికి ఆమోద ముద్రపడి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంలోనైనా తెలుగుభాషా దినోత్సవం ఒక రోజుకే పరిమితం కాకూడదని, భాషను కాపాడుకోవటం గురించి పాలకులు సానుకూలంగా దృష్టిపెట్టాలని కోరుకుందాం.
తోట భావనారాయణ
సీనియర్ జర్నలిస్ట్
(నేడు గిడుగు రామమూర్తి జయంతి; తెలుగు భాషాదినోత్సవం)
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్
For More National News And Telugu News