Share News

ఊరి బడులకు ఉరి వేస్తారా?!

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:20 AM

ఈ మధ్య బెంగళూరులో జరిగిన హిందూ పత్రిక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ బడులను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించడం, అత్యంత బాధాకరమైన విషయం. మరొకవైపు నీతి ఆయోగ్ సమావేశంలో...

ఊరి బడులకు ఉరి వేస్తారా?!

ఈ మధ్య బెంగళూరులో జరిగిన హిందూ పత్రిక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ బడులను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించడం, అత్యంత బాధాకరమైన విషయం. మరొకవైపు నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడుతూ, దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అనడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం, అయిదో తరగతి లోపు చదివే విద్యార్థులకు ఒక కిలోమీటర్ దూరంలో, ఆ పై తరగతులు చదివే విద్యార్థులకు మూడు కిలోమీటర్ల లోపల పాఠశాల విద్యను అందించాలి. దీనికి విరుద్ధంగా తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు ఊపిరి పోసే ప్రభుత్వ బడులను మూసివేస్తానని ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. గత ప్రభుత్వం విద్యారంగాన్ని దిగజార్చిందని, ఆ ప్రభుత్వం మూసివేసిన 6,000 పాఠశాలలను తెరిపిస్తామని, విద్యా రంగానికి 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెప్పిన మాటలు నీటిమూటలు అయ్యాయి.

ఒకే యాజమాన్యంలో పాఠశాలలు ఉండకపోవడం, ఒకే విధమైన విద్యా పాలన కొనసాగకపోవడం, ఒకే సిలబస్‌ను, పుస్తకాలను అవలంబించకపోవడం, కార్పొరేట్, ఒలింపియాడ్, ఐఐటీ, నీట్‌ పేర రెండు రకాలుగా విద్యా వ్యవస్థను కొనసాగించడం వల్ల ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో చిక్కుకున్నదన్నది కాదనలేని వాస్తవం. దీన్ని సరిచేయాల్సిన పాలకులు ఎవరి పాలనలో వాళ్లు రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, కేజీబీవీలు, పీఎంశ్రీ పాఠశాలల పేర రకరకాల పాఠశాలలను కొనసాగించడంతో, అసలు విద్యారంగానికి పునాదిరాళ్లుగా ఉన్న ఊరు బడులు ఇవాళ బలిపీఠం మీద ఉన్నాయి. వీటిని పరిష్కరించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల స్థలం 200 కోట్ల రూపాయలతో ‘మెగా’ స్కూల్స్ పెట్టి, అందులో రాష్ట్రంలో పక్కా బిల్డింగ్ లేని రెసిడెన్షియల్ పాఠశాలలను విలీనం చేస్తూ, మిగిలిన 27 వేల పాఠశాలలను పాతర వేయదలుచుకున్నది. అదే 200 కోట్లను ఒక మండలంలో ఉన్న అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఫర్నీచర్, రూమ్స్, సకల వసతులతో పాటు, ఆట స్థలం, గ్రంథాలయం కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్‌తో, మరి కొంతమంది టీచర్ల నియామకంతో అద్భుతమైన వికాస కేంద్రాలుగా మార్చవచ్చు.

తెలంగాణ విద్యా కమిషన్ పెంచమన్న బడ్జెట్‌ను పెంచకుండా, ఆ కమిషన్ సూచించినట్టుగా విద్యార్థులు, మేధావులతో చర్చించి, ఆమోదయోగ్యమైన ప్రజలందరికీ ఉచిత విద్య అందించే చర్యలు చేపట్టవచ్చు. కానీ అందుకు భిన్నంగా విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి, తెలంగాణ విద్యారంగాన్ని అతలాకుతలం చేసే నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధమైన అంశం.


గ్రామంలో పాఠశాలకు సరిపడ టీచర్లు, తరగతి గదులు, వసతులు కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో చదివించిన తల్లిదండ్రులకే ఉపాధి హామీ, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడం, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకుల పిల్లలందరూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఊరి బడులను మూసివేయ చూస్తున్న ప్రభుత్వ విధానాలను విద్యార్థులు, మేధావులు, అన్ని రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగులు వ్యతిరేకించాలి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకునేదాకా పోరాడాలి. ఇవాళ సమాజంలో యువత పెడదారిన పడడానికి కారణమైన మద్యం దుకాణాలను మూసివేయాల్సింది పోయి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి దోహదపడే బడులను మూసివేయడం అత్యంత బాధాకరం.

బడిబాటలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో సర్పంచులు ఊర్లోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రానీయమని, ‘మా ఊరు బడే మా అమ్మ ఒడి’ అని తీర్మానాలు చేయడం, కొంతమంది సర్పంచులు, అవసరమైతే గ్రామపంచాయతీ నిధుల నుంచి, పూర్వ విద్యార్థుల నుంచి బడి బాగు కోసం, మెరుగైన చదువు కోసం ముందుకు రావడం ఆహ్వానించదగినది.

తెలంగాణ సమాజమంతా ఇవాళ ప్రభుత్వ బడుల మూసివేతను ఆపకపోతే.. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య దాకా కార్పొరేట్ కత్తులకు విద్యార్థులను బలిపెట్టవలసి వస్తుంది. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ప్రైవేటు పాఠశాలలను మూసివేసి ఆ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. రాష్ట్రంలో విద్యావంతులు, మేధావులు, టీచర్లు కొనసాగిస్తున్న విద్యా పరిరక్షణ ఉద్యమాన్ని ఊరూరా విస్తరింపజేయాలి.

ప్రభాకర్ కస్తూరి

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 02:20 AM