Share News

‘1/70’ స్ఫూర్తిని ‘సుప్రీం’ నిలబెడుతుందా?

ABN , Publish Date - Jul 14 , 2026 | 02:02 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూముల పరిరక్షణకు బలమైన కవచంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు రెగ్యులేషన్ 1/1970 మరోసారి సుప్రీంకోర్టు...

‘1/70’ స్ఫూర్తిని ‘సుప్రీం’ నిలబెడుతుందా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూముల పరిరక్షణకు బలమైన కవచంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు రెగ్యులేషన్ 1/1970 మరోసారి సుప్రీంకోర్టు న్యాయ పరిశీలనను ఎదుర్కొంటోంది. గిరిజనేతరులకు గిరిజనుల భూముల బదలాయింపును నిషేధిస్తూ, తరతరాలుగా అన్యాక్రాంతమవుతున్న ఆదివాసీ భూములను కాపాడే లక్ష్యంతో రూపొందిన ఈ రెగ్యులేషన్ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ వందలాది మంది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గిరిజనేతరుల ఈ వ్యాజ్యాలు, వారి వాదనలు ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

తెలంగాణకు చెందిన సూరెడ్డి రమణారెడ్డి, ఇతర పిటిషనర్లు 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అనేక గ్రామాలు, మండల కేంద్రాలలో గిరిజనేతరులు అధిక సంఖ్యలో ఉన్నారని వాదిస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న పేద గిరిజనేతరులకు భూములు కొనుగోలు చేయడానికి లేదా కౌలుకు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వారు పేర్కొంటున్నారు.

వాస్తవానికి రెగ్యులేషన్ 1/70 ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న కారణంగానే సన్నకారు గిరిజనేతర వర్గం చేతుల్లో భూములు ఇంకా ఉన్నాయి. ఏజెన్సీలో గిరిజనేతర భూ క్రయ విక్రయాలు అనుమతించినట్లయితే భూస్వామ్య, వాణిజ్య వర్గాల ఆధీనంలోకి వారి భూములు ఏనాడో చేజారిపోయేవి. 1/70 రెగ్యులేషన్ రద్దయితే గిరిజనులకే కాదు, సన్నకారు రైతాంగానికి, వ్యవసాయ కూలీలకూ తీరని నష్టం. రెగ్యులేషన్ 1/70 నిబంధనలు రాజ్యాంగంలోని 14, 19, 21, 300–ఎ అధికరణలకు విరుద్ధమని వాదిస్తూ, కాలానుగుణంగా మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ రెగ్యులేషన్ పునఃపరిశీలించాలని యర్రంశెట్టి సత్యనారాయణతో పాటు 1,672 మంది గిరిజనేతరులు మరొక రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.


1988లో పి.రామిరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు రెగ్యులేషన్ 1/1970 రాజ్యాంగబద్ధతను స్పష్టంగా సమర్థించింది. గిరిజనేతరుల మధ్య భూమి బదలాయింపు నిషేధించడం గిరిజన భూముల పరిరక్షణకు అవసరమని కోర్టు పేర్కొంది. 1997లో సమతా కేసులో సుప్రీంకోర్టు గిరిజనులకు భూమి కేవలం ఆర్థిక వనరు కాదని, అది వారి సంస్కృతి, జీవన విధానం, సామాజిక గుర్తింపు, ఆర్థిక మనుగడకు మూలాధారమని పేర్కొంది. 2013లో ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ కేసులో కూడా గిరిజన సమాజానికీ వారి భూములకూ మధ్య విడదీయలేని సంబంధాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది.

ప్రస్తుత పిటిషనర్లు ‘రూపాంతర రాజ్యాంగవాదం’ సిద్ధాంతం ఆధారంగా రెగ్యులేషన్ 1/70ను సవాలు చేస్తున్నారు. కానీ ఈ సిద్ధాంతం చారిత్రకంగా అణచివేయబడిన వర్గాలకు సామాజిక న్యాయం అందించడానికే ఉద్దేశించబడింది. భారతదేశంలో అత్యంత వెనుకబడిన, దోపిడీకి గురైన వర్గాలలో షెడ్యూల్డ్ తెగ ఒకటి. కాబట్టి వారికి కల్పించిన ప్రత్యేక రక్షణలను తొలగించడం రూపాంతర రాజ్యాంగవాదం లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటుంది.

షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనులకంటే గిరిజనేతర జనాభాయే అనేక ప్రాంతాలలో అధికంగా ఉన్న కారణంగా 1/70 అమలు చేయడం న్యాయం కాదంటున్నారు. వాస్తవానికి జనాభా మార్పులు రాజ్యాంగ హామీలను రద్దు చేయలేవు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనేతరుల సంఖ్య పెరిగిందన్న కారణంతో రక్షణ చట్టాలను రద్దు చేయాలని అనుమతిస్తే, వలసలు ఆక్రమణల ద్వారా ఏర్పడిన పరిస్థితులే గిరిజనుల రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేసినట్లవుతుంది. పరోక్షంగా రెగ్యులేషన్ 1/70ను ప్రభుత్వాలు అమలుచేయడం లేదని అంగీకరించినట్లవుతుంది.

గిరిజనుల భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక గుర్తింపును కాపాడటమే రాజ్యాంగ అయిదవ షెడ్యూల్ లక్ష్యం. జనాభా మార్పులను ఆధారంగా తీసుకొని గిరిజన రక్షణల నియమాలను బలహీనపరిస్తే రాజ్యాంగ హామీలే అర్థరహితమవుతాయి. రెగ్యులేషన్ 1/70 బలహీనపడితే దాని ప్రభావం కేవలం భూమి హక్కులకే పరిమితం కాదు, దానితో ముడిపడి ఉన్న పంచాయతీరాజ్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం–1996, అటవీ హక్కుల చట్టం–2006, గిరిజన స్వయం పాలన వ్యవస్థలు, గ్రామ సభల అధికారాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.


ఆదివాసీ భూమి హక్కులు కేవలం ఆస్తి హక్కులకు సంబంధించిన అంశాలు మాత్రమే కావు. అవి వారి చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, సంప్రదాయ జ్ఞానం, ఆర్థిక మనుగడ, సమష్టి అస్తిత్వంతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆదివాసీ భూమి వనరుల హక్కు విషయంలో ప్రత్యేక రక్షణలను కల్పించాయి.

అంతర్జాతీయ ప్రమాణాలు కూడా గిరిజన హక్కుల పక్షాన ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ఆదివాసీ ప్రజల హక్కుల ప్రకటన(2007), అంతర్జాతీయ కార్మిక సంఘం కన్వెన్షన్–169 వంటి అంతర్జాతీయ ప్రమాణాలు ఆదివాసీ ప్రజల భూమి, సహజ వనరులను రక్షించాల్సిన బాధ్యతను దేశాలపై విధిస్తున్నాయి.

గిరిజనులను భూమి కోల్పోవడం నుంచి, ఆర్థిక దోపిడీ నుంచి, సాంస్కృతిక విచ్ఛిన్నం నుంచి రక్షించడానికి రూపొందించిన ప్రత్యేక చట్టాలు గిరిజనేతరుల పట్ల వివక్షపూరితమైనవి కావు. అవి వాస్తవ సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించడానికి అవసరమైన రాజ్యాంగ చర్యలు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంత 1/1970 రెగ్యులేషన్ వెనుక ఉన్న తాత్విక, రాజ్యాంగపరమైన భావన కూడా ఇదే. ఈ రెగ్యులేషన్ గిరిజనేతరులను వెలివేయడానికి రూపొందించబడినది కాదు. ఇప్పటి వరకూ దోపిడీకి గురైన గిరిజన సమాజాలను అటవీ, భూ, ఆర్థిక వనరుల నుంచి విస్థాపనను, సాంస్కృతిక విధ్వంసాన్ని నివారించడానికి రూపొందించబడిన ఒక రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ.

సుప్రీంకోర్టు ముందున్న నేటి ఈ వివాదం భూమి హక్కుల వివాదం మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూల్ ఇచ్చిన హామీల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. రెగ్యులేషన్–1 ఆఫ్ 1970 కాలం చెల్లిన చట్టం కాదు. గిరిజనుల భూమి, అస్తిత్వం, సాంస్కృతిక గుర్తింపు, సంప్రదాయ జీవన విధానం, స్వయం పాలనను కాపాడే అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ పరిరక్షణ ఇది.

అందువల్ల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో బలంగా సమర్థించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఈ రక్షణల బలహీనత గిరిజన సమాజాల భవిష్యత్తుపైనే ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

డా. పల్లా త్రినాథరావు

ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 02:02 AM