Share News

చిన్న ఉత్పత్తితోనే పెద్ద ఉపాధి!

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:18 AM

వస్తు ఉత్పత్తికి పెద్ద పరిశ్రమలు మాత్రమే అనుకూలమనే వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ కొన్ని దేశాలు పారిశ్రామిక వికేంద్రీకరణ అమలు జరిపి, విజయవంతంగా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. వస్తు ఉత్పత్తిని...

చిన్న ఉత్పత్తితోనే పెద్ద ఉపాధి!

వస్తు ఉత్పత్తికి పెద్ద పరిశ్రమలు మాత్రమే అనుకూలమనే వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ కొన్ని దేశాలు పారిశ్రామిక వికేంద్రీకరణ అమలు జరిపి, విజయవంతంగా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. వస్తు ఉత్పత్తిని వికేంద్రీకరించడం అంటే చిన్న చిన్న ఉత్పత్తి కేంద్రాలను స్థాపించడం. ఒక పెద్ద వస్తువును విడగొట్టి తయారు చేయడం. దీనివల్ల పరిశ్రమలు అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో ఏర్పాటుచేసే అవకాశం కలుగుతుంది. ఉద్యోగ అవకాశాలు గ్రామాల్లో మెరుగుపడతాయి. అప్పుడు యువత పట్టణాల బాట పట్టదు. నగరాల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. సాంకేతిక అంశాలతో కూడిన ఉత్పత్తిని ఇలా వికేంద్రీకరించడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. నాణ్యమైన ఉత్పత్తులు తయారవుతాయి. దీనివల్ల ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పించాల్సిన అవసరమూ తగ్గుతుంది. ఆర్థికంగా ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది.

దీనితో పాటు ప్రభుత్వం సొంత సాంకేతికతను అంటే గ్రామాల్లో ఉండే చేతి వృత్తులను, చేతి పనులను గుర్తించి, ప్రోత్సహించాలి. వాటికి తగిన సౌకర్యాలు కల్పించడం వల్ల పెద్ద మొత్తంలో ఉపాధిని కలిగించవచ్చు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేత, చేతివృత్తులే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇప్పుడు మనం వాటి నుంచి వైదొలగి యాంత్రీకరణను ప్రోత్సహించాం. అందువల్ల గ్రామాలలో ఉపాధి లేక యువత నగరాల బాట పడుతోంది. పరిశ్రమలు స్థాపించేందుకు కొంత పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఏయే ప్రాంతాలలో ఏయే ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. వాటిని ఏ పరిశ్రమలుగా వృద్ధి చేయొచ్చు అనే విషయం పరిశీలించాలి.

ఉదాహరణకు ఉత్తరాంధ్ర వెంబడి ఉన్న తూర్పు కనుమల నుంచి వచ్చే అటవీ ఉత్పత్తులను పరిశ్రమలుగా మార్చవచ్చు. తూర్పు కనుమల్లో పనస, చింతపండు, కాఫీ విరివిగా లభిస్తుంది. వీటిని పరిశ్రమలుగా మార్చవచ్చు. అలాగే ఇక్కడి అటవీ ప్రాంతంలో చాలా రకాలైన వనమూలికలు, సహజమైన రంగులు లభిస్తాయి. వీటిని పెద్ద ఎత్తున విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్మవచ్చు. ఇక్కడ ఉండే సహజమైన చలి వాతావరణం మొక్కల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. దీనిని ఆసరా చేసుకుని మొక్కల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల గిరిజన యువతకు ఉపాధి లభిస్తుంది. నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేసి భారతదేశమంతటా అమ్మవచ్చు. కరక్కాయ, ఎర్రచందనం, నరమామిడి, తెల్ల మద్ది, నల్ల మద్ది వంటి అనేక రకాలైన చెట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటిని సహజమైన రంగులను తయారు చేయడానికి వినియోగించవచ్చు. అలాగే గ్రామాల్లో ఉన్న కమ్మరి, కుమ్మరి, చేనేత, బొమ్మల తయారీ వంటి వృత్తులను గుర్తించి ఆయా ప్రాంతాలలో తయారీ కేంద్రాలను నెలకొల్పడం ద్వారా స్థానిక కులవృత్తిదారులకు ఉపాధి కల్పించవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది దీనికి భిన్నంగా ఉంది.


పెద్ద పెద్ద పరిశ్రమలను ఆహ్వానించి వాళ్లకు వేలాది కోట్ల రూపాయలు విలువచేసే సహజ వనరులను ఉచితంగా అందిస్తున్నాం. ఈ పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది అనుకోవడం ఒక భ్రమ. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ కాలంలో మనుషులు చేసే పనులు తగ్గిపోయాయి. అలాగే ఒక ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తే అక్కడి స్థానికులను కార్మికులుగా మాత్రమే పనిలోకి తీసుకుంటున్నారు. సాంకేతిక నిపుణులను, ఉన్నతాధికారులను బయట నుంచే తీసుకువస్తారు. పైగా, ఈ పెద్ద పరిశ్రమల వల్ల స్థానికంగా ఉండే సహజ వనరులైన నీరు, గాలి కలుషితం కావడం తప్ప పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. విదేశాల నుంచి వచ్చిన కంపెనీలు సంపదను తమ వెంట తీసుకుపోతాయి.

స్వదేశీ పారిశ్రామిక విధానాన్ని రూపొందించి ప్రభుత్వాలు పరిశోధనలను పెంచడం ద్వారానే చిన్న ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు. మన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసుకోవాలి. దీని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. విదేశీ మారకద్రవ్యం కూడా లభిస్తుంది. సుశిక్షితులైన ఉద్యోగులు తయారవుతారు. గ్రామాలలో ఉపాధి పెరుగుతుంది. ఈ దిశగా ప్రణాళికలు రూపొందించేలా రూపకర్తలు ఆలోచిస్తే మన పరిశ్రమలకు మేలు జరుగుతుంది.

చలపతిరావు ఆకుల

అధ్యక్షుడు, నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 12:18 AM