ట్రంప్ వాచాలత
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:25 AM
ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానుషం, జుగుప్సాకరం. ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ మూకుమ్మడి...
ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానుషం, జుగుప్సాకరం. ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడిలో దారుణ మరణానికి గురైన తమ అధినాయకుడికీ, ఆయన కుటుంబ సభ్యులకు యావత్‌దేశం నివాళులర్పిస్తున్న ఆ విషాద సందర్భాన్ని అవహేళన చేస్తూ, అమెరికా అధ్యక్షుడు నోటికి వచ్చినట్టుగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇరాన్ నాయకులంతా ఒకేచోట దొరికారు కనుక ఒక్కదెబ్బకు తాను అందరినీ చంపేయవచ్చట. లక్షలాది మంది ప్రజలు కన్నీటిపర్యంతం అవుతూంటే అవన్నీ దొంగ ఏడుపులట. ఈ పిరికిపంద వ్యాఖ్యలతో ఆయన తన లోపలున్న విషాన్నంత కక్కేశారు. అమెరికానూ, పొరుగున ఉన్న యుద్ధోన్మాద ఇజ్రాయెల్‌నూ ఏ మాత్రం లెక్కచేయకుండా, ఇంకా చెప్పాలంటే, చేతనైతే చంపండి అని సవాల్ చేస్తున్న స్థాయిలో, ఇరాన్ అంతా ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడం ట్రంప్ దొరవారిని ఉక్కిరిబిక్కిరి చేసినట్టుంది. యుద్ధంలో అన్ని దెబ్బలు తిన్నా, అంతటి బీభత్సాన్ని చవిచూసినా, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా ఏ ఒక్కరూ ఇంట్లో కూర్చోకుండా నిర్భయంగా బయటకు వచ్చి తమ ఇమామ్‌కు నివాళులర్పించడం అసామాన్యమైనది.
ఇరాన్ అధినాయకులతో సహా కోటిన్నర, రెండుకోట్ల మంది ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ‘ది ఫ్యూనరల్ ఆఫ్ ది సెంచరీ’ అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఎంత బలహీనమైనదో తెలియంది కాదు. ఆ ఒప్పందాన్ని తుత్తునియలు చేసేందుకు ఇజ్రాయెల్ చివరివరకూ ప్రయత్నించింది. శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న తరుణంలో, అవసరమైతే మళ్ళీ దాడులు తప్పవని ట్రంప్ కూడా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఖమేనీ అంత్యక్రియల సందర్భంలో కూడా ట్రంప్ తన యుద్ధోన్మాద వ్యాఖ్యలు ఆపలేదు. తీవ్రమైన వేడిమికి ఎదురొడ్డి మరీ లక్షలాదిమంది ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం, అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రంప్‌నీ, నెతన్యాహూనీ అంతం చేయాలంటూ కవులు, కళాకారులు నినదించడం అమెరికా అధ్యక్షుడికి ఆగ్రహాన్ని కలిగించడం సహజం. ఐదు దశాబ్దాల క్రితం మేము తిరుగుబాటు చేసింది, దొంగ ఏడుపులు ఏడవడానికి కాదు, శత్రువుల చేత వలవలా కన్నీరు పెట్టించడానికి అంటూ అంత్యక్రియల్లో పాల్గొన్నవారు వ్యాఖ్యానించారట. వారి ఏడ్పులను దొంగ కన్నీళ్ళని ఆడిపోసుకోవడం కంటే, ఇరాన్ ప్రజలను రెచ్చగొడితే వారు తమ పాలకులమీద సులువుగా తిరగబడతారనీ, మతపెద్దలను అంతం చేస్తే జనం సంతోషిస్తారనీ తనకు అబద్ధాలు చెప్పి, యుద్ధంలోకి తోసిన ఆ నలుగురు మంత్రులనూ, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూను ట్రంప్ తప్పుబట్టాలి. ధైర్యం ఉంటే తనకు తప్పుడు సలహాలు ఇచ్చినవారిని పదవులనుంచి పీకివేయాలి. కానీ, ఒకపక్క చర్చలు జరుపుతూ మరోపక్క ఇరాన్ ప్రజలను అవమానించే దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు. యుద్ధ లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నెరవేరకపోవడంతో ఆయన వాచాలతకు అడ్డూ ఆపూ లేకపోతున్నది.
ఈ తరహా వ్యాఖ్యలతో, పదేపదే అవే హెచ్చరికలతో ఇరాన్‌ను వీసమెత్తు కూడా లొంగదీయలేనని ట్రంప్ గ్రహించాలి. ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేయపడుతోందనీ, అది కుదిరినా లేకున్నా విజయం తనదేనని ట్రంప్ అదేపనిగా చెప్పుకుంటున్న గొప్పలను మిగతా ప్రపంచం ఎప్పుడో నమ్మడం మానేసింది. ఈ యుద్ధం ఇరాన్‌ను మరింత శక్తిమంతమైన, ప్రభావవంతమైన దేశంగా మార్చిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇరాన్ మతపాలకులను హతమార్చి మహ్మద్ రెజా పహ్లావీ వంటి అస్మదీయులను అక్కడ ప్రతిష్ఠించుకోవాలన్న ట్రంప్ లక్ష్యం నెరవేరకపోగా, ఈ యుద్ధంతో ఇరానియన్లంతా పాలకులపై తమ వ్యతిరేకతలను పక్కనబెట్టి ఏకమైనారు. ఇరాన్‌లోని వివిధ సైద్ధాంతిక గ్రూపులన్నీ ఒక్కటైనాయి. పాలనమార్పు తన ఎజెండా కాదని, యుద్ధం దెబ్బతో ఇరాన్ ఇప్పుడు మూడోతరం చేతుల్లోకి పోయిందని ట్రంప్ సమర్థించుకుంటున్నారు కానీ, పెజెష్కియాన్ వంటి సంస్కరణవాదుల గొంతు వినబడని రీతిలో దేశం పూర్తిగా ఐఆర్‌జీసీ చేతుల్లోకి పోయింది. తమ ఉనికికోసం దేశాన్ని పణంగా పెట్టే ఛాందసులు, యుద్ధోన్మాదులు ఇరాన్‌ను ప్రస్తుతం ఏలుతున్నారు. ఇరాన్ ప్రస్తుత నాయకత్వం అమెరికా దాడులను, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, చర్చల్లో చివరకు అమెరికాయే దిగేట్టు చేసింది. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ముగిసేవరకూ ట్రంప్‌కు సరిగా నిద్ర ఉండదు కనుక, ఆయన నోట ఈ తరహా వ్యాఖ్యలు మరిన్ని వినాల్సి రావచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్
నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్
For More National News And Telugu News