Share News

సముచిత తీర్పు

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:10 AM

రోజూ ఐదువందలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఈ దేశంలో, యాభైఆరుశాతం వాహనాలు ఇన్సూరెన్స్‌ లేకుండా రోడ్లమీద యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇవన్నీ సక్రమంగా రిజిస్టరై, రికార్డుల్లో ఫిట్‌గా ఉన్నవే. ప్రమాదాలు...

సముచిత తీర్పు

రోజూ ఐదువందలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఈ దేశంలో, యాభైఆరుశాతం వాహనాలు ఇన్సూరెన్స్‌ లేకుండా రోడ్లమీద యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇవన్నీ సక్రమంగా రిజిస్టరై, రికార్డుల్లో ఫిట్‌గా ఉన్నవే. ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలవారికి ఒక్కరూపాయి కూడా దక్కకుండా చేస్తున్న ఈ స్థితిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి, కొన్ని సూచనలు చేయడం బాగుంది. వాహనదారులు మోటారువాహనాల చట్టంలోని అత్యంత కీలకమైన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే, వాటిని కచ్చితంగా అమలు చేయించడంలో అధికారులు విఫలమవుతున్న తరుణంలో, పెట్రోల్‌ బంకుల దగ్గరే ఈ స్థితిని సరిదిద్దాలన్నది సుప్రీంకోర్టు ఆలోచన. ఇన్సూరెన్స్‌ లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల దగ్గర చమురు నిరాకరించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయమని కేంద్రానికి కోర్టు చేసిన సూచన బాగుంది.

ఇన్సూరెన్స్‌ సమస్యను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ప్రమాదాల నివారణ మీద అధికదృష్టి పెట్టి, ప్రభుత్వాలను నిలదీసివుంటే మరింత బాగుండేదన్నది వేరే సంగతి. కానీ, మొత్తం రోడ్డుప్రమాదాల్లో దాదాపు నాలుగోవంతు ఇన్సూరెన్స్‌ లేని వాహనాలవల్లనే జరుగుతున్నాయి. బీమా ఉల్లంఘన మోటార్‌ వాహనాల చట్టంలోని అతికీలకమైన 146వ నిబంధన అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నది. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేని వాహనాన్ని నడుపుతున్నవారికి పెనాల్టీలతో పాటు, జైలుశిక్ష కూడా విధించాలని చట్టం చెబుతూంటే, దానిని ఉల్లంఘించి వాహనాన్ని నడిపి యాక్సిడెంట్లు చేయడం ద్వారా వాహనదారులు ఎదుటివారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వాహన ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలవారికి సత్వరమే పెద్దమొత్తంలో దక్కాల్సిన నష్ట పరిహారాన్ని దూరం చేస్తున్నారు. ఏళ్ళతరబడి న్యాయపోరాటాలు చేసినా ఫలితం దక్కని స్థితి బాధితులకు ఏర్పడుతోంది. బంకుల్లో పెట్రోల్‌ పోయడం మానేస్తే, ఇన్సూరెన్స్‌లేని వాహనాలను సులువుగా గుర్తించడమే కాక, వాహన యజమానికి కూడా తాను చెల్లుబాటయ్యే బీమా లేకుండానే వాహనాన్ని నడుపుతున్న విషయం తెలియచెప్పడం అవుతుందని కోర్టు అంటోంది. ఇలా గుర్తుచేయడం బాగున్నది కానీ, తాను ఇన్సూరెన్స్‌ లేని వాహనం నడుపుతున్నానని అత్యధికశాతం యజమానులకు తెలియదనుకోలేం. కోర్టు సూచనలు కచ్చితంగా అమలై, బంకుల్లో పెట్రోల్‌ పోయడం ఆగిన పక్షంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేసేవారి సంఖ్య హెచ్చుగా ఉంటుందన్నది వాస్తవం.


ఇరవైయేళ్ళనాటి కేసుకు సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆదేశాలు సముచితమైనవి. 1996లో ప్రకాశంజిల్లా సింగరాయకొండ దగ్గర జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించే విషయంలో జరిగిన అన్యాయాన్ని ఈ తీర్పు ప్రశ్నించింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయినందుకు బీమా కంపెనీనుంచి పదిలక్షల రూపాయల నష్టపరిహారాన్ని అతని కుటుంబసభ్యులు కోరితే, వాహనానికి బీమా ఉన్నా, వాహన యజమాని వ్యక్తిగత రిస్క్‌ను కవర్‌ చేసే అదనపు బీమా ప్రీమియం కట్టనందుకు ఈ పరిహారం కోరే అర్హత ఆ కుటుంబానికి లేదని ట్రైబ్యునల్‌ తేల్చేసింది. మూడేళ్ళ తరువాత హైకోర్టు బాధిత కుటుంబం పక్షాన తీర్పు వెలువరించి, నెలవారీ ఆదాయం ప్రాతిపదికన ఓ పదిలక్షలరూపాయలు పరిహారంగా చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, వాహనంలో కూర్చున్న ప్రతీ వ్యక్తికీ బీమా కంపెనీలు కాంప్రహెన్సివ్‌ పాలసీ కింద పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం సముచితం. వాహన బీమాకు సంబంధించి ధర్మాసనం జారీ చేసిన సూచనలను, మార్గదర్శకాలను అమలులోకి తీసుకురావడం ప్రభుత్వం విధి. ఇంటికి ఆధారమైన వ్యక్తి వాహన ప్రమాదంలో మరణిస్తే, ఆ కుటుంబం పడే వేదన, కష్టాలు ఊహకు అందనివి. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ, వాహనదారుల మత్తువల్లనో, అలసటవల్లనో అధిక ప్రమాదాలు జరుగుతున్న రోజులివి. లైసెన్సులు లేని డ్రైవర్లను, ఇన్సూరెన్స్‌ లేని వాహనాలను నియంత్రించడం, ప్రమాదాలను నివారించడం ప్రభుత్వాల కర్తవ్యం.

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 05:10 AM