‘సర్’కు సరే...!
ABN , Publish Date - May 29 , 2026 | 12:29 AM
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఎన్నికల సంఘానికి కొత్తశక్తిని ఇస్తుంది. పదహారు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడోవిడత...
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఎన్నికల సంఘానికి కొత్తశక్తిని ఇస్తుంది. పదహారు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడోవిడత ‘సర్’కు ఉపక్రమిస్తున్న తరుణంలో, జాబితాల ప్రక్షాళన విషయంలో ఎన్నికల సంఘానికి ఈ తీర్పు సర్వాధికారాలనూ దఖలుపరిచింది. ఈ ప్రక్రియను సమర్థిస్తూ వస్తున్న భారతీయ జనతాపార్టీకి ఇది సంతోషాన్నిస్తే, వ్యతిరేకించి వీధిపోరాటాలు చేసిన విపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ. బిహార్‌లో చేపట్టిన ‘సర్’ భేషుగ్గా ఉందని కోర్టు నిర్ధారించిన నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా ఆ పథకాన్ని అమలు చేయడంలో ఈసీకి ఏ అడ్డంకులూ ఉండబోవు.
‘సర్’ రాజ్యాంగబద్ధం, దానిని నిర్వహించే హక్కు, అధికారం ఈసీకి ఉన్నాయి, అది ఏ చట్టాలనూ అతిక్రమించలేదు, రాష్ట్రాల్లో ‘సర్’ నిర్వహణ ఆవశ్యకత ఉందన్న ఈసీ వాదన సమర్థనీయం, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలన్న రాజ్యాంగ ఆదేశాలను, ఆకాంక్షలను సర్ నెరవేరుస్తుంది అంటూ చీఫ్‌జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్జీ ధర్మాసనం తమ నూటపాతిక పేజీల తీర్పులో నిర్ధారించింది. ఏటా జరిగే ఓటర్ జాబితా సవరణకంటే సర్ భిన్నంగా ఉన్నంతమాత్రాన దానిని వద్దనలేమని, మొదట్లో ఎక్కువమంది ఓటర్లను తొలగించినట్టుగా సర్ కనిపిస్తుంది కానీ, తగిన రక్షణచర్యలతో దీనిని రాజ్యాంగబద్ధంగా నిర్వహించవచ్చునని కోర్టు వ్యాఖ్యానించింది. ఆధార్, ఓటరు కార్డు తిరస్కరణ సహా అర్హత పత్రాల నిర్ణయంలో ఈసీ అధికారాలను కోర్టు పూర్తిగా సమర్థించడం విశేషం. ఎన్నికల సంఘానికి ఏవో కొన్ని నామమాత్రపు సలహాలు, సూచనలు మినహాయిస్తే, సుప్రీంకోర్టు ఈ తీర్పుతో సర్‌కు ప్రాథమికంగా చట్టబద్ధత కల్పించింది. ఓటరు జాబితాలో పేరు లేనంతమాత్రాన పౌరసత్వం కోల్పోయినట్టు కాదని కూడా ఓ భరోసా ఇచ్చింది. దేశ పౌరులు కాదన్న అనుమానంతో రెండుదశాబ్దాల నాటి ఆ జాబితాలనుంచి తొలగించిన వ్యక్తులపేర్లను నాలుగువారాల్లోగా పౌరసత్వాన్ని నిర్ధారించే యంత్రాంగానికి పంపించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ఓటరు జాబితాలో తీసివేతలు, చేరికలను నిర్ణయించే పరిధి మాత్రమే ఎన్నికల సంఘానిది కానీ, పౌరసత్వాన్ని మాత్రం అది నిర్ధారించలేదన్నది దీని సారాంశం. ‘సర్’ పేరిట పెరటిదోవన ‘ఎన్‌ఆర్‌సి’ అమలు అవుతోందన్న విమర్శలు, అనుమానాల నేపథ్యంలో కోర్టు ఈ జాగ్రత్త తీసుకున్నట్టు ఉంది. మరోవిధంగా చెప్పుకోవాలంటే, తనకు నచ్చినవాటిని మాత్రమే అర్హతపత్రాలుగా నిర్ణయించి, వాటి ఆధారంగా ఈ దేశ పౌరులు కాదన్న అనుమానంతో లక్షలాదిఓట్లను తొలగించడం వరకూ ఎన్నికల సంఘం ప్రక్రియ సరైనదే. కానీ, పౌరసత్వ నిర్ధారణ అధికారం మాత్రం దానికి లేదు కనుక, ఆ పని వేరే చోట జరిగి, ఒకవేళ సదరు అథారిటీ వీరిలో కొందరు ఓటర్లు ఈ దేశ పౌరులేనని నిర్ధారించిన పక్షంలో, ఆ పేర్లు తిరిగి జాబితాలో చేరుతాయన్నమాట. వినడానికి ఎంతో బాగున్న ఈ ఆ దేశం ఆచరణలో కాగితాలమీద ఎంతకాలం మిగిలిపోతుందో చూడాలి.
స్వచ్ఛమైన ఓటరు జాబితాలు ప్రజాస్వామ్యానికి పునాది వంటి మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి. కానీ, ఆచరణలో ఓటరు జాబితాలనుంచి లక్షలసంఖ్యలో మాయమైపోయిన పేర్లు ఎవరివో, ఎందుకో అందరికీ తెలుసు. బిహార్‌లో నలభై లక్షలు, పశ్చిమబెంగాల్‌లో 90లక్షల ఓట్లు ఒక్కవేటున తొలగిపోయి, ఆ తరువాత సుప్రీంకోర్టు అడపాదడపా ఇచ్చిన సూచనల మేరకు నామమాత్రంగా సాగిన ట్రిబ్యునల్స్ తరహా పరిష్కారాలతో వందల సంఖ్యలో మాత్రమే పేర్లు తిరిగి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, బిహార్, బెంగాల్‌లో విపక్షపార్టీలకు ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం ఓటర్ల ఏరివేతే లక్ష్యంగా ఇది సాగిందన్నది ప్రధానమైన విమర్శ. కనీసం రెండుదశాబ్దాలుగా ఏ జాబితాలైతే అనేక రాష్ట్రాల్లో పాలకులను, కేంద్రంలో మూడుసార్లు ఇదే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాయో, వాటికి మకిల వదిలించి ప్రక్షాళించే పేరిట లక్షలమంది నిరక్షరాస్యులు, నిరుపేదలను ఓటుహక్కుకు దూరం చేయడం గురించి కోర్టు సహజంగానే మాట్లాడలేదు. ‘సర్’ రాజ్యాంగబద్ధత గురించి కోర్టు ఏమి చెప్పబోతున్నదో దానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన వారికి కూడా అనుమానం ఉండివుండదు. కానీ, ఆచరణలో అత్యంత హడావుడిగా, అన్యాయంగా సాగిన ఈ ప్రక్రియ వెనుక ఉన్న దురుద్దేశాల గురించే వారి బాధంతా.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News