Share News

చక్కెర చిక్కులు

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:47 AM

చక్కెర ధర పెరిగితే ఏం చేయాలి? మధ్యప్రదేశ్‌ మంత్రి కైలాశ్‌ విజయ్‌వర్గియా ఓ మంచి సలహా ఇచ్చారు. చక్కెర ధర ఎంత పెరిగితే జనానికి అంతమేలట. నలభైయేళ్ళు దాటినవారంతా పంచదారకు...

చక్కెర చిక్కులు

చక్కెర ధర పెరిగితే ఏం చేయాలి? మధ్యప్రదేశ్‌ మంత్రి కైలాశ్‌ విజయ్‌వర్గియా ఓ మంచి సలహా ఇచ్చారు. చక్కెర ధర ఎంత పెరిగితే జనానికి అంతమేలట. నలభైయేళ్ళు దాటినవారంతా పంచదారకు బహుదూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదనీ, దేశంలో తొంభైశాతం జనానికి ఎలాగూ స్వీట్లు గిట్టవనీ, తానూ స్వీటు తినననీ, అందువల్ల ధర బాగా పెరిగిపోతే మనకే మంచిదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలమీద సోషల్‌ మీడియాలో జనం విరుచుకుపడుతున్నారు. రాఖీ పౌర్ణమినాడు చెల్లెలు ప్రేమతో అన్ననోటిని తీపిచేస్తుందని, ఆ స్వీటు ఆహారపదార్థం కాదని, వారిమధ్య అనుబంధానికీ అనురాగానికీ నిదర్శనమని గుర్తుచేశారు కొందరు. పండుగల్లోనూ తీపి దండుగంటున్న ఈ నాయకులు చివరకు మన నిత్యజీవితంలో కూడా తీపి లేకుండా చేస్తున్నారని కోపగించుకున్నారు మరికొందరు. ఇదే అదనుగా బీజేపీ నాయకులు ఇటీవలికాలంలో ఇచ్చిన సలహాలు సైతం సోషల్‌ మీడియా తెరమీదకు మళ్ళీ వచ్చాయి. పెట్రోల్‌ ధరలు నియంత్రించలేనప్పుడు బయట తిరగవద్దన్నారు, పడిపోతున్న రూపాయి విలువను ఆపలేక విదేశాలకు పోవద్దనీ, బంగారం కొనద్దనీ హితవులు చెప్పారు, ఇప్పుడు ఏకంగా తీపితినడమే మానేయమంటున్నారు అని వారంతా ఆగ్రహిస్తున్నారు. ఇలా ధర పెరిగిన ప్రతీదానినీ వదిలేసుకోమంటూ ప్రజలకు చెప్పడం నాయకులకు ఉండాల్సిన లక్షణమేనా? అన్నది మంచిప్రశ్న.

సదరు మంత్రిగారు ఆ వ్యాఖ్యను అనాలోచితంగానే చేసివుండవచ్చును కానీ, హెచ్చిన చక్కెర ధర కేంద్రప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టినమాట నిజం. దీనికితోడు, ఇథనాల్‌ తయారీ కోసం అధికమొత్తం చెరుకుని మళ్ళించడంతోనే సామాన్యుడికి ఈ కష్టం ముంచుకొచ్చిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అందులో నిజం లేదని ప్రభుత్వం గట్టిగా చెబుతున్నప్పటికీ, ఈ20 పెట్రోల్‌ విషయంలో కేంద్రం పట్టుదల తెలిసిందే కనుక జనానికి విపక్షాలమాటే చెవికెక్కుతోంది. శ్రావణమాసంలో అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటుగా, పంచదార మరీ ఖరీదు కావడం సామాన్యుడికి సహజంగానే కోపం తెప్పిస్తుంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో గత నెలన్నరలోనే చక్కెర ధర నలభైశాతం పెరిగింది. ఈ పరిస్థితికి దారితీసిన అనేక కారణాల్లో తగినంత ఉత్పత్తి లేకపోవడం ఒకటి. ఎల్‌నినో ప్రభావం వల్ల, కొన్ని ప్రాంతాల్లో అధిక చీడ కారణంగా చెరుకు ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు ప్రభుత్వం భారీగా ఎగుమతులకు అనుమతించడంతో లక్షలాది టన్నుల పంచదార విదేశాలకు తరలిపోయింది. చెరుకు దిగుబడినుంచి పంచదార పంపిణీ వరకూ ప్రతీ దశా ప్రభుత్వం నియంత్రణలోనే ఉన్నప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు. మార్కెట్‌లోకి విడుదల చేయాల్సిందీ, గిడ్డంగుల్లో ఉండాల్సిందీ, వ్యాపారుల నిల్వచేసుకోగలిగేదీ, విదేశాలకు అమ్మాల్సిందీ అంతా ప్రభుత్వమే నిర్ణయిస్తున్నప్పుడు అంచనాలు ఎందుకు తప్పాయి, సర్కారును తప్పుదోవపట్టించిన మార్కెట్‌ శక్తులేమిటన్నవి ప్రశ్న.


పాలకుల ఇథనాల్‌ మోజు ఈ స్థితికి పూర్తికారణం కాకపోవచ్చు. కానీ, లోటును గుర్తించేసరికే కొన్ని మిలియన్‌ టన్నుల చెరుకు బయోఫ్యూయల్‌ కోసం తరలిపోయిందన్నది విశ్లేషకుల వాదన. ఎల్‌నినో, ఇథనాల్‌ కంటే ప్రస్తుత సంక్షోభానికి మార్కెట్‌ శక్తుల మాయే ప్రధానకారణమని కూడా అంటున్నారు. చక్కెర పరిశ్రమను నియంత్రించే నాయకులు, హోల్‌సేల్‌ వ్యాపారులు, స్టాకిస్టులు పండుగల కాలం సమీపిస్తున్న తరుణంలో అధిక లాభాలకోసం ఈ సంక్షోభాన్ని సృష్టించి ఉండవచ్చు. తీపి కోసం తహతహలాడే ఈ కాలంలో మిఠాయీ తయారీదారులనుంచి ఇళ్ళవరకూ పంచదార డిమాండ్‌ సహజంగానే ఎక్కువగా ఉంటుంది కనుక, డిమాండ్‌–సప్లై మధ్య అగాధం ఎంత పెరిగితే అంత లాభం చేకూరుతుంది. ఉత్పత్తి, నిల్వలు, కోటాలు, ఇథనాల్‌ కేటాయింపులు ఇత్యాది సమస్త విషయాల్లోనూ ప్రభుత్వం తన ట్రాకింగ్‌ విధానాలను, వ్యవస్థలను చక్కదిద్దుకోవాల్సి ఉందని ప్రస్తుత సంక్షోభం గుర్తుచేస్తోంది. ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ, ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని నివారించేందుకు పలు చర్యలు చేపట్టడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దిగుమతి సుంకాలు రద్దుచేసి అక్టోబర్‌ 31వరకూ భారీ ఎత్తున ముడిచక్కెరను దిగుమతి చేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతించడంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. దసరా, దీపావళి నాటికి చక్కెర ధర పూర్తిగా దిగివచ్చి సామాన్యుడు నోరు తీపిచేసుకోగలుగుతాడని ఆశిద్దాం.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్

For More National News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 12:47 AM