కనిపించని శాంతి!
ABN , Publish Date - May 20 , 2026 | 02:04 AM
రష్యా మీద ఉక్రెయిన్ ఇటీవల జరిపిన డ్రోన్ దాడుల్లో ఒడిశాకు చెందిన ఒక యువకుడితో పాటు మరో నలుగురు మరణించారు, డజన్లకొద్దీ గాయపడ్డారు. యుద్ధం మొదలయ్యాక రాత్రివేళల్లో రష్యామీద ఉక్రెయిన్...
రష్యా మీద ఉక్రెయిన్ ఇటీవల జరిపిన డ్రోన్ దాడుల్లో ఒడిశాకు చెందిన ఒక యువకుడితో పాటు మరో నలుగురు మరణించారు, డజన్లకొద్దీ గాయపడ్డారు. యుద్ధం మొదలయ్యాక రాత్రివేళల్లో రష్యామీద ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో ఇదే పెద్దది. అనేక ఎత్తయిన భవనాలు, మౌలిక సదుపాయాలు ఈ డ్రోన్‌దాడిలో ధ్వంసమైనాయి. శనివారం రాత్రి ఆరువందల డ్రోన్లను నేలకూల్చామని, ఇరవైనాలుగుగంటల్లో వెయ్యి డ్రోన్లను నేలమట్టం చేశామని రష్యా చేసిన ప్రకటన ఈ దాడి తీవ్రతను తెలియచెబుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దాడులను సమర్థించుకుంటూ, దీనికి రెండురోజుల ముందు రష్యా జరిపిన ఘోరమైన దాడులకు ఇది ప్రతీకారమని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌మీద రష్యా విరుచుకుపడిన ఫలితంగా పాతికమంది కన్నుమూశారు. ఇరాన్‌తో ఆమెరికా ఆరంభించిన యుద్ధంతో నాలుగేళ్ళుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం నుంచి ప్రపంచ మీడియా దృష్టి మరలిపోయింది కానీ, వినాశనం కొనసాగుతూనే ఉంది.
యుద్ధం ముగించే అవకాశాలు ఉన్నప్పటికీ, కుట్రపూరితంగా దానిని కొనసాగిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బుద్ధిచెప్పడానికే అత్యంత శక్తిమంతమైన డ్రోన్లతో రష్యా మీద ఈ దాడులు చేశామని జెలెన్‌స్కీ అంటున్నారు. పుతిన్ ఎంత త్వరితంగా రాజీకి వస్తే ఆయనకూ ఆయన దేశానికీ అంతమంచిదని హెచ్చరిస్తున్నారు. యుద్ధం త్వరలోనే ముగియవచ్చునని పదిరోజుల క్రితం పుతిన్ కూడా అన్నారు. రష్యాతో సంబంధాలు తెంపేసుకున్న యూరోపియన్ దేశాలే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉందన్నారాయన. చర్చలు ముందుకు తీసుకుపోవడానికి యూరప్ నాయకులు ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. శక్తిమంతమైన డ్రోన్ల ప్రయోగంతో ఇరుపక్షాలు యుద్ధాన్ని కొనసాగిస్తున్నందున ప్రాణహానితో పాటు, విధ్వంసం కూడా తీవ్రంగా ఉంది. ఇరాన్‌తో యుద్ధం ఆరంభించిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన మినహాయింపులు రష్యాకు ఒక్కసారిగా లబ్ధిచేకూర్చాయి. అయితే, భారీ చమురు ఎగుమతులతో దక్కిన ఆ ప్రయోజనాన్ని ఉక్రెయిన్ నాశనం చేస్తోంది. రష్యన్ చమురు స్థావరాలు, మార్గాలు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో బాగా దెబ్బతింటున్నాయి. రష్యా ఆర్థిక వృద్ధిరేటు ఈ ఏడాది అరశాతం కూడా ఉండదన్న అంచనాలున్నాయి. దీనికితోడు, అరబ్ ఎమిరేట్స్ ఇటీవల ఒపెక్ నుంచి తప్పుకోవడం కూడా ఇరాన్ యుద్ధం ముగిసిన తరువాత రష్యాకు మరింత చేటుచేయవచ్చునని అంటున్నారు.
ఏ యుద్ధమైనా తనకు తానుగా ఆగదు. ఎవరినీ విజేతలు కానివ్వకుండా ఆగ్గి రగులుతూనే ఉంటుంది. త్వరలోనే కాల్పుల విరమణ జరగవచ్చునని 20రోజుల క్రితం కాబోలు, అమెరికా అధ్యక్షుడు ఓ వ్యాఖ్య చేశారు. అటువంటి ప్రయత్నం ఏదీ నిర్దిష్టంగా జరుగుతున్నట్టు లేదు. పొరుగుదేశాన్ని చావుదెబ్బతీయాలన్న ప్రయత్నమే తప్ప, కాల్పుల విరమణతో ముందుగా ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించి, చర్చలకు ఉపక్రమించి, ఆ భూ తగాదాలేవో పరిష్కరించుకోగల చొరవ ఏదీ కనిపించడం లేదు. మొదట్లో తనవైపు నిలిచిన అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధంమీద ఆసక్తి కోల్పోయారని పుతిన్‌కు తెలుసు. ఈ యుద్ధంవల్లనే జెలెన్‌స్కీ తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకున్న మాటా నిజం. ప్రపంచ ఆర్థికవ్యవస్థమీద తొలిగా ప్రభావం వేసి, ముఖ్యంగా యూరప్ ఆర్థిక స్తబ్ధతకు కారణమైన ఈ యుద్ధాన్ని నిలువరించాల్సిన బాధ్యత అందరిదీ. ఇది యుద్ధాల యుగం కాదు అని వ్యాఖ్యానించిన భారత ప్రధాని ఈ విషయంలో చొరవ తీసుకుంటారని మొదట్లో పలుదేశాల పాలకులు సైతం ఆశపడ్డారు. రష్యామీద భారత్ ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి కృషిచేయాలని నార్వే ప్రధానమంత్రి వంటివారు ఇప్పటికీ అంటున్నారు. ఇరాన్ యుద్ధం మాదిరిగా, లక్షమంది భారతీయులు ఉంటున్న రష్యా మీద ఉక్రెయిన్ సాగిస్తున్న యుద్ధం కూడా మనకు సుదూరమైనదేమీ కాదు. కేవలం కొద్దిగంటల్లో వందలాది డ్రోన్లను రష్యా లోపలివరకూ సంధించి, యుద్ధాల రూపురేఖలు ఏ విధంగా మారుతున్నాయో ఉక్రెయిన్ ప్రపంచానికి తెలియచెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి...
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News