పాత్రలు తారుమారు!
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:06 AM
అఫ్ఘానిస్థాన్‌లోని మూడు ప్రావిన్సులపై పాకిస్థాన్ యుద్ధవిమానాలు వరుసగా రెండు రోజులు రాత్రివేళల్లో విరుచుకుపడటంతో అనేకమంది మరణించారు, పలువురు గాయపడ్డారు. 26మంది తెహ్రీక్–ఎ–తాలిబాన్...
అఫ్ఘానిస్థాన్‌లోని మూడు ప్రావిన్సులపై పాకిస్థాన్ యుద్ధవిమానాలు వరుసగా రెండు రోజులు రాత్రివేళల్లో విరుచుకుపడటంతో అనేకమంది మరణించారు, పలువురు గాయపడ్డారు. 26మంది తెహ్రీక్–ఎ–తాలిబాన్ పాకిస్థాన్ (టీపీపీ) ఉగ్రవాదులను హతమార్చి, వారి స్థావరాలను నేలమట్టం చేశామని పాకిస్థాన్ ఎప్పటిలాగానే ప్రకటించింది. సామాన్యులను పొట్టనబెట్టుకున్నదనీ, మృతుల్లో పదిమందికి పైగా పిల్లలే ఉన్నారని అఫ్ఘానిస్థాన్ అంటోంది. అఫ్ఘానిస్థాన్‌మీద ఓపెన్ వార్ ప్రకటించిన పాకిస్థాన్ నెలన్నరగా ప్రశాంతత నెలకొని ఉన్న తరుణంలో, ఈ దాడులు జరపడంతో ఉభయదేశాల మధ్యా మళ్ళీ ఉద్రిక్తతలు రేగాయి. టీపీపీనుంచి ఎటువంటి కవ్వింపు చర్యలూ లేని సందర్భంలో కూడా పాకిస్థాన్ ఇంతటి భారీ విధ్వంసానికి పాల్పడటం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ వైమానిక దాడుల్లో ప్రధానంగా పిల్లలు, మహిళలు మరణించిన విషయాన్ని తాను గుర్తించినట్టుగా ఓ నాలుగు ముక్కల ప్రకటన చేసిన ఐక్యరాజ్యసమితి అందులో పాకిస్థాన్ పేరు ప్రస్తావించకపోవడం విశేషం. విశ్వసనీయమైన ఇంటలిజెన్స్ సమాచారం ఆధారంగా అఫ్ఘాన్‌లోని ఉగ్రవాదుల రహస్యస్థావరాలను ధ్వంసం చేశామని పాకిస్థాన్ చెప్పుకున్నప్పటికీ, సమితి మాత్రం ఎవరు దాడులు చేశారన్న మాటే ప్రస్తావించలేదు. గత తొమ్మిదినెలల కాలంలో అఫ్ఘానిస్థాన్ మీద జరిగిన మూడవ అతిపెద్ద వైమానిక దాడి ఇది. ఇటీవల రష్యాతో తాలిబాన్ రక్షణ సంబంధిత ఒప్పందం కుదర్చుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఇలా అక్కసు తీర్చుకున్నట్టు కనిపిస్తోంది.
ఇకమీదట పాకిస్థాన్ గతంలో మాదిరిగా మా జోలికి రావడం సాధ్యం కాదు, మా భూభాగాల్లోకి చొరబడి బాంబులు కురిపించడం జరిగే పని కాదు అని పదిరోజుల క్రితం ఆ ఒప్పందం కుదరగానే తాలిబాన్ నాయకులు భీకర ప్రకటనలు చేశారు. నిజానికి ఆ ఒప్పందం సాంకేతిక సాయానికి సంబంధించిందే అయినప్పటికీ, దశాబ్దాల క్రితం రష్యాతో భీకరంగా పోరాడిన తాలిబాన్ ఇప్పుడు తన రక్షణకోసం దానితో చేయికలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అఫ్ఘానిస్థాన్‌లో పడివున్న రష్యన్ ఆయుధాలకు జీవం పోయడంతో ఆరంభమయ్యే ఈ సైనిక సాన్నిహిత్యం అనతికాలంలోనే మరింత విస్తరిస్తుందని ఆ సందర్భంలో ఉభయపక్షాలూ ప్రకటించాయి. ఒప్పందంలో లోతుపాతులు పెద్దగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ, అఫ్ఘాన్–పాకిస్థాన్ సంబంధాలు తీవ్ర ఘర్షణాత్మకంగా ఉన్న తరుణంలో ఇటువంటిది ఒకటి జరగడం, రష్యా చొరవచూపడం ఆశ్చర్యం. పాక్ వైమానిక దాడులనుంచి రక్షించుకోగల వ్యవస్థలు కానీ, ధీటుగా జవాబు చెప్పగల వైమానికదళం కానీ తాలిబాన్ వద్ద లేకపోవడంతో పాకిస్థాన్ చిత్తం వచ్చినట్టు రెచ్చిపోగలుగుతోంది. ఈ నేపథ్యంలో, మాస్కో చేయూత అఫ్ఘాన్‌కు ఎక్కడలేని శక్తినీ ఇస్తోంది. పాకిస్థాన్ ఇకమీద మా భూభాగంలోకి చొరబడి దాడులు చేయడానికి సాహసించదని మాస్కోనుంచి తిరిగిరాగానే అఫ్ఘాన్ రక్షణమంత్రి ఎంతో ఉత్సాహంగా ప్రకటించారు. టీటీపీ స్థావరాలమీద దాడులు చేయకుండా తనను ఏ శక్తీ ఆపలేదని వెనువెంటనే ప్రకటించిన పాకిస్థాన్, ఇప్పుడు ఆ పనిచేసి చూపించింది.
అఫ్ఘానిస్థాన్ మళ్ళీ తాలిబాన్ చేతుల్లోకి వచ్చినందుకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంతో సంతోషంగా అల్లాకు అనేక కృతజ్ఞతలు తెలియచేసినప్పటికీ, అనతికాలంలోనే పాక్ పాలకులకు గతంలో మాదిరిగా తాలిబాన్ తన చెప్పుచేతల్లో ఉండబోదని అర్థమైపోయింది. స్నేహం పూర్తిగా చెడి, వైరం హెచ్చి, చివరకు పరిస్థితులు యుద్ధం వరకూ వచ్చాయి. పాకిస్థాన్‌లోని మూడులక్షలమంది అఫ్ఘాన్ శరణార్థులను వెనక్కునెట్టి, టీటీపీని సమూలంగా నాశనం చేయడం, తాలిబాన్‌ను గద్దెదించడం పాకిస్థాన్ లక్ష్యం. అమెరికా పేరు నేరుగా ప్రస్తావించకుండా, ఒక బలమైన శక్తి పాకిస్థాన్‌కు ఈ మిషన్ అప్పగించిందని తాలిబాన్ ప్రతినిధి ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. చైనా, ఇరాన్‌తో వ్యవహరించడానికి వ్యూహాత్మకంగా అత్యంత అవశ్యకమైన బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తనకు అప్పగించాల్సిందిగా ట్రంప్ పలుమార్లు కోరి, హెచ్చరించినప్పటికీ తాలిబాన్ లొంగలేదు. ఇరాన్ యుద్ధంలో ఉన్న ట్రంప్ అది ముగియగానే మళ్ళీ బంగ్రామ్ మీద పడతారని, అంతలోగా పాకిస్థాన్ కార్యరంగాన్ని సిద్ధం చేసివుంచుతుందని అంచనా. ఈ నేపథ్యంలో రష్యా ఇప్పుడు సైనికపరంగానూ తాలిబాన్‌కు అండగా నిలుస్తూండటం కొత్త పరిణామం. అఫ్ఘాన్ కేంద్రంగా అమెరికా, రష్యా పాత్రలు తారుమారైన ఈ పరిణామం భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనడానికి నిదర్శనం.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News