తొలగిన కళంకం!
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:54 AM
గత పదేళ్ళుగా గుజరాత్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయిని అమెరికాకు తెచ్చే ప్రక్రియ త్వరలోనే ఆరంభమవుతుందని ఆ దేశ అధికారులు ప్రకటించారు. అప్పగింతల ప్రక్రియ సుదీర్ఘమైనదని అంటూనే...
గత పదేళ్ళుగా గుజరాత్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయిని అమెరికాకు తెచ్చే ప్రక్రియ త్వరలోనే ఆరంభమవుతుందని ఆ దేశ అధికారులు ప్రకటించారు. అప్పగింతల ప్రక్రియ సుదీర్ఘమైనదని అంటూనే, భారతదేశాన్ని అధికారికంగా అభ్యర్థించే పని మాత్రం సత్వరమే మొదలవుతుందని అమెరికా వ్యాఖ్యానించింది. వచ్చేనెల 31న లాస్ ఏంజెల్స్ కోర్టులో రవీందర్ సింగ్ ధండా గ్యాంగ్ కేసులపైనా, సెప్టెంబర్ 1న జగ్గూ భగవాన్‌పురియా గ్యాంగ్ కేసులపైనా విచారణ జరగబోతోందని కూడా అమెరికా అధికారులు ప్రకటించారు. జగ్గూ భగవాన్ పురియా అస్సాం జైల్లో నిర్బంధంలో ఉండగా, రవీందర్‌సింగ్ ధండా కెనడాలోనూ, బిష్ణోయి ముఠాలోని సతీందర్‌సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అమెరికాలోనూ తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికా, కెనడాలోని అనేక హింసాత్మక ఘటనల్లో బిష్ణోయి కుడిభుజమైన బ్రార్ ప్రమేయం ఉన్నదని, ఉత్తర అమెరికాలోని బిష్ణోయి గ్యాంగ్ కార్యకలాపాలకు అతడు నాయకత్వం వహిస్తున్నాడని ఎఫ్‌బిఐ తేల్చింది. గోల్డీ బ్రార్‌ను పట్టించినవారికి యాభైవేల డాలర్ల రివార్డునూ ఎఫ్‌బిఐ ప్రకటించింది. అమెరికా, కెనడా, యూరప్‌లు ఉమ్మడిగా సాగించిన ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’లో మూడు నేరస్థ ముఠాలకు చెందిన 37మందిలో ౨4మంది అరెస్టు కావడం, బిష్ణోయి, జగ్గూ తదితరుల నాయకత్వంలో వీరంతా ఆయా దేశాల్లో హత్యలు, బ్లాక్‌మెయిలింగ్, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా ఇత్యాది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎఫ్‌బిఐ ఇటీవల నిగ్గుతేల్చడం నిజానికి, మన నిఘా, పోలీసు వ్యవస్థల పనితీరును ప్రశ్నించడమే. అయితే, కెనడాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ ఉదంతంలో భారతప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం లేదని, హత్యకు ఆదేశాలు ఇచ్చింది బిష్ణోయి, గోల్డీ బ్రార్ అని అమెరికా దర్యాప్తు సంస్థ తన చార్జిషీటులో పేర్కొనడం భారతదేశానికి పెద్ద ఉపశమనం.
అభియోగాలు నమోదైనంతమాత్రాన నేరం రుజువైనట్లు కాదు కానీ, నిజ్జర్ హత్య అనంతరం అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ మీద వేసిన నిందలకు ఈ పరిణామాలు సమాధానం చెబుతున్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని భారత్ హెచ్చరిస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వ ఏజెంట్లే ఈ హత్య చేయించారంటూ ట్రూడో అవకాశం దొరికినప్పుడల్లా వ్యాఖ్యానించడం ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీశాయి. పైగా, ఈ హత్యకేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు కూడా చేర్చడంతో ఉద్రిక్తతలు పెరిగి, ఇరుదేశాలు తమ దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నాయి. 2023 జూన్18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని ఒక గురుద్వారా బయట ఇద్దరు దుండగులు నిజ్జర్‌ను కాల్చివేశారు. ఈ హత్యకు సబర్మతీ జైలు నుంచి బిష్ణోయి ఆదేశాలు ఇస్తే, ఉత్తర అమెరికాలో బ్రార్ సమన్వయం చేశాడంటూ భగవాన్‌పురియా, ధండా తదితరులు పేర్లను కూడా తమ అభియోగపత్రంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చేర్చారు. ఆపరేషన్ హార్డ్‌బాల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ గ్యాంగుల నుంచి మాదకద్రవ్యాలను, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.
నిజ్జర్ హత్యకు బిష్ణోయి ముఠా కారణమంటూ అమెరికాలో కేసు నమోదుకావడం, భారత అధికారుల ప్రమేయం ఉన్నదనడానికి ఆధారాలు లేవని కెనడా ప్రకటించడం క్లీన్‌చిట్ కాకపోయినా, ప్రస్తుతానికి పెద్ద ఉపశమనమే. ఈ పరిణామాలు చాలా ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయినా, ఎంతోకాలంపాటు ఏకపక్షంగా సాగిన రాజకీయ ఆరోపణలు, దౌత్యపరమైన నిందలు, ఊహాగానాల నుంచి విముక్తి కలిగిస్తున్నాయి. గత మూడేళ్ళుగా రెండు దేశాల మధ్య అంతవరకూ ఉన్న సాన్నిహిత్యాన్నీ, సహకారాన్నీ నిజ్జర్ హత్య భగ్నం చేసింది. సాక్ష్యాలను పరీక్షించకుండానే, కేవలం సిక్కుల ప్రాపకం కోసం జస్టిన్ ట్రూడో తన పరిధులను దాటి వ్యవహరించారు. 2023 సెప్టెంబరులో కెనడా పార్లమెంట్‌లో ఆయన భారతదేశం మీద వేసిన నిందలు, అనంతరకాలంలో వాటిని సమర్థించుకున్న ప్రయత్నాలు విస్మరించలేనివి. పరస్పర ఆరోపణలు, ఖండనమండనలకంటే నిజ్జర్ వంటి ఖండాంతర నేరస్థుల విషయంలో దేశాలు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు
సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట
Read Latest AP News And Telangana News And National News
And Telugu News