మణిపూర్‌లో కొత్త ఆశలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:35 AM
ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూలాలున్న బీజేపీ సీనియర్ నాయకుడు యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్...
ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూలాలున్న బీజేపీ సీనియర్ నాయకుడు యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కుకీ మహిళా ఎమ్మెల్యే నెమ్చా కిప్గిన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు లోసీ డిఖో ఉపముఖ్యమంత్రులైనారు. ఎప్పటిలాగానే ముఖ్యమంత్రి పదవి మీతీలకే దక్కినప్పటికీ, కుకీ, నాగా జాతులకు చెందినవారిని ఆ తరువాతి స్థానాల్లో కూచోబెట్టడం ద్వారా బీజేపీ ప్రభుత్వం మణిపూర్ సమాజానికి సుహృద్భావ సందేశం ఇచ్చే ప్రయత్నమైతే చేసింది.
ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా కుకీ–జో–హ్మర్, నాగా ఎమ్మెల్యేలు ఇంఫాల్‌లో కనిపించడాన్ని మీడియా ప్రత్యేకంగా, విశేషంగా చెబుతోంది. ఎంతోకాలం తరువాత ఇంఫాల్‌లో సందడి కనిపించింది. ఎటువంటి నిర్దిష్టమైన హామీలూ లేకుండా కుకీలూ నాగాలు ప్రభుత్వంలో పాలుపంచుకోవడం సరైనది కాదన్న విమర్శలు, హెచ్చరికలు మరోపక్క ఉండనే ఉన్నాయి. ఆయా తెగలకు చెందిన తిరుగుబాటు సంస్థల హెచ్చరికల నేపథ్యంలో, కొండప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు దిగిరారన్న అనుమానాలు చివరినిముషం వరకూ లేకపోలేదు. ఖేమ్‌చంద్ ఎంపికకు ముందురోజు కూడా కుకీ–జో తెగలకు న్యాయం చేయకుండా, నిర్దిష్టమైన హామీలు ఇవ్వకుండా ప్రభుత్వ ఏర్పాటు సరికాదని సీనియర్ ఎమ్మెల్యేలు సైతం వ్యాఖ్యానించారు. కొండ ప్రాంతాల్లో ప్రత్యేక స్వతంత్ర పాలనకు పట్టుబడుతున్న శక్తులు ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా మొండిగా మాట్లాడాయి. జనవరి ఆరున సమావేశమైన కుకీ–జో కౌన్సిల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆలోచనను తిరస్కరించడమే కాక, తమ జాతులవారు అందులో భాగస్వాములు కాకూడదని తీర్మానించింది. కుకీ–జోలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేస్తామన్న హామీ తీసుకున్నాకే ప్రభుత్వంలో చేరాలని మరొక సమావేశం డిమాండ్ చేసింది. ఇటువంటి పలు డిమాండ్లు, తెగల తీర్మానాలు, తిరుగుబాటుదారుల హెచ్చరికల నేపథ్యంలో ఖేమ్‌చంద్ ఎంపిక జరిగిందన్నది వాస్తవం.
ఈ లిబరల్ మీతీ నాయకుడికీ, మణిపూర్‌ను రెండేళ్ళపాటు అగ్నికి ఆహుతి చేసిన మాజీ ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌కు హస్తిమశకాంతరం ఉంది. ప్రధానంగా మీతీ పక్షపాతంతో ఇతర తెగల ఊచకోతలను సమర్థించిన బీరేన్‌ను వ్యతిరేకించిన వ్యక్తిగా ఖేమ్‌చంద్‌కు పేరుంది. ముఖ్యమంత్రి పదవినుంచి బీరేన్‌ను తొలగించకపోతే పార్టీలో తిరుగుబాటు తప్పదని అధిష్ఠానానికి విస్పష్టంగా చెప్పడంతోపాటు, స్పీకర్‌తో చేయికలిపి బీరేన్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టడంలో ఈయనది ప్రధాన పాత్ర. ఒకదశలో బీరేన్‌ను మార్చేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధపడ్డా ఆయన తన మీతీబలాన్ని ప్రదర్శించి తిరుగుబాటు చేయడం తెలిసిందే. చివరకు, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానాన్ని కూడా వినియోగించుకొని అధిష్ఠానంమీద ఖేమ్‌చంద్ ఒత్తిడిపెంచడంతో బీరేన్‌ను దించివేయక తప్పలేదు. ఆ దశలో అసెంబ్లీని కొనసాగిస్తే రాష్ట్రం చేజారిపోతుదని భయపడిన ఢిల్లీ పెద్దలు బీరేన్‌స్థానంలో మరొకరిని కూచోబెట్టడానికి బదులు రాష్ట్రపతిపాలన విధించి, ఈ ఏడాదికాలంలో రాష్ట్రాన్ని గాడినపెట్టేందుకు కొన్ని ప్రయత్నాలైతే చేశారు కానీ, అది పూర్తిగా సాధ్యపడలేదు. మీతీలకు ఆర్థిక, ఆయుధ, సాయుధ సాయంతో బీరేన్ సృష్టించిన మారణకాండ ఊహకు అందనిది. వందలాది మరణాలు, దహనాలు, అత్యాచారాలు, వలసలతో సమాజం ఛిన్నాభిన్నమైపోయింది.
నిలువునా చీలిన సమాజాన్ని తిరిగి ఒక్కటిచేయాల్సిన కర్తవ్యం కొత్తముఖ్యమంత్రి మీద ఉంది. డిసెంబరులో ఆయన కుకీ–జో శిబిరాన్ని సందర్శించి బాధితులను పరామర్శించడం రాజకీయ ఎత్తుగడగా కొందరు వ్యాఖ్యానించినప్పటికీ, మీతీలకు ఆగ్రహాన్ని కలిగించే ఈ చర్యకు ఆయన సాహసించడం ఆశ్చర్యకరం. కుకీలు దానిని స్వాగతించకపోయినా, వ్యతిరేకించలేదు. ఖేమ్‌చంద్ పట్ల కుకీ–జో, నాగాల్లో ఇష్టాలు లేవు, ద్వేషాలూ లేవు. బీరేన్‌మాదిరిగా ఆయనను అనుమానించడానికి కూడా ఏమీ లేదు. అయితే, ముఖ్యమంత్రిగా మీతీ ఉన్నంతకాలం తమకు అన్యాయమే జరుగుతుందని కుకీ–జో తెగలవారు తీవ్రంగా భయపడుతున్న తరుణంలో గాయాలను మాన్పే పని సత్వరంగా జరగాలి. న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాధితులకు కలగాలి. వచ్చే ఏడాది జరగబోతున్న ఎన్నికలమీద కాక, తలలు తెగ్గోసుకుంటున్న తెగలను దగ్గర చేసే పనిమీద కొత్తప్రభుత్వం దృష్టిపెట్టాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..
For More National News And Telugu News