Share News

చదివే యువతే... చైతన్య సమాజానికి పునాది!

ABN , Publish Date - Aug 12 , 2026 | 03:16 AM

నేడు డిజిటల్‌ ప్రపంచం అపారమైన అవకాశాలను అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌, కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి సాధనాలు జ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అయితే సమాచారం ఎక్కువగా ఉండడం మాత్రమే...

చదివే యువతే... చైతన్య సమాజానికి పునాది!

నేడు డిజిటల్‌ ప్రపంచం అపారమైన అవకాశాలను అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌, కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి సాధనాలు జ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అయితే సమాచారం ఎక్కువగా ఉండడం మాత్రమే సరిపోదు. దాన్ని విశ్లేషించే శక్తి, నిజానిజాలను గుర్తించే వివేకం, విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా అవసరం. ఈ సామర్థ్యాన్ని పెంపొందించేది పుస్తక పఠనమే.

మనకు సమాచారం ఎక్కువగానే వస్తోంది. కానీ జ్ఞానం కూడా అంతే బాగా పెరుగుతోందా? ఒక ఐదు నిమిషాల వీడియో కొంత సమాచారం ఇవ్వవచ్చు. ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌ ఓ వార్తను చెప్పవచ్చు. ఒక ఏఐ సాధనం క్షణాల్లో సమాచారం ఇవ్వవచ్చు. కానీ, జీవితాన్ని అర్థం చేసుకునే లోతైన ఆలోచన, మానవీయ విలువలు, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత... ఇవి పఠనం ద్వారానే పెరుగుతాయి. అందుకే పుస్తకం కేవలం కాగితాల సమాహారం కాదు. అది ఒక నిశ్శబ్ద గురువు. అది మనతో వాదిస్తుంది, మనల్ని ప్రశ్నిస్తుంది, మనలోని బలహీనతలను చూపిస్తుంది, కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తుంది. ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత మనం అదే వ్యక్తిగా ఉండిపోము. మన ఆలోచనల్లో ఒక కొత్త కిటికీ తెరుచుకుంటుంది.

డిజిటల్‌ ప్రపంచంలో పెరిగిన నేటి యువత వేగంగా నేర్చుకుంటుంది. కొత్త సాంకేతికతను స్వీకరిస్తుంది. ప్రపంచంతో క్షణాల్లో అనుసంధానం అవుతుంది. కానీ, ఈ తరానికి అవసరమైనది లోతుగా చదివే అలవాటు. ఎందుకంటే వేగంగా సమాచారాన్ని చూడటం ఒక నైపుణ్యం అయితే, లోతుగా చదవడం ఒక వ్యక్తిత్వం. మనం తరచూ ఒక మాట వింటున్నాం ‘‘పిల్లలు చదవడం తగ్గిపోయింది’’ అని. ఈ సమస్యను యువతపై నెట్టివేయడం సరికాదు. వారు పుస్తకాల నుంచి దూరం కాలేదు, పుస్తకాలను వారి జీవితానికి దగ్గరగా తీసుకురావడంలో మనం వెనుకబడ్డాం. ఒక యువకుడికి పుస్తకం అతని కలలకు, కెరీర్‌కు, జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూపించిన రోజే అతను స్వయంగా గ్రంథాలయం వైపు నడుస్తాడు.


ప్రతి ఇంట్లో ఒక చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు బహుమతిగా పుస్తకాలు ఇస్తూ వారిలో చదివే అలవాటు పెంచాలి. ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠ్య పుస్తకాలతో పాటు స్ఫూర్తిదాయక గ్రంథాలను పరిచయం చేయాలి. గ్రంథపాలకులు గ్రంథాలయాన్ని యువత ఆలోచనలు వికసించే జ్ఞానవేదికగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వం కూడా పఠన సంస్కృతిని బలోపేతం చేసే విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆధునిక గ్రంథాలయాలు, డిజిటల్‌ వనరులు, ఈ–పుస్తకాలు, ఆడియో పుస్తకాలు, గ్రామీణ ప్రాంతాల్లో పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఖాళీగా ఉన్న గ్రంథపాలక పోస్టులను భర్తీ చేయాలి. ఇవన్నీ యువతకు జ్ఞాన వాతావరణాన్ని కల్పిస్తాయి. జాతీయ గ్రంథపాలక దినోత్సవం (ఆగస్టు 12) సందర్భంగా రోజుకు కొంత సమయాన్ని పఠనానికి కేటాయిద్దాం.

జగదీశ్‌ కళేరావు, గ్రంథపాలకుడు, రాజోలు

వార్తలు కూడా చదవండి...

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Aug 12 , 2026 | 03:16 AM