Share News

భావవిప్లవానికి మానవవాద బాట

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:21 AM

జాతి, కుల, మత, వర్గ, లింగాది భేదాలను పాటించకుండా మనుషులందరినీ సమానులుగా, ఎవరి చర్యలకు వారే బాధ్యులుగా, ఎవరి భవితవ్యానికి వారే నిర్మాతలుగా పరిగణించేదే మానవవాదం. వ్యక్తికి ప్రథమ స్థానాన్నిచ్చి...

భావవిప్లవానికి మానవవాద బాట

జాతి, కుల, మత, వర్గ, లింగాది భేదాలను పాటించకుండా మనుషులందరినీ సమానులుగా, ఎవరి చర్యలకు వారే బాధ్యులుగా, ఎవరి భవితవ్యానికి వారే నిర్మాతలుగా పరిగణించేదే మానవవాదం. వ్యక్తికి ప్రథమ స్థానాన్నిచ్చి, స్వేచ్ఛగా, హుందాగా జీవించే మానవ హక్కును గుర్తించే తత్వమే మానవవాదం. మానవుడే అన్నిటికీ ప్రమాణమనేది దాని మౌలిక సూత్రం.

మానవుడెంత ప్రాచీనుడో మానవవాదం కూడా అంత ప్రాచీనమైనది. భారతదేశంలో ప్రాచీనకాలంలో వర్ధిల్లిన చార్వాక, జైన, బౌద్ధాది భావోద్యమాలన్నీ భౌతికవాద, మానవవాద భావాలతో కూడుకొన్నవే. ప్రాచీన కాలంలోని భారతీయ తాత్విక భావజాలమంతా ఆస్తికవాద, ఆధ్యాత్మికవాద భావజాలమేనని అందరూ భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ప్రాచీనకాలంలో అమలులో ఉన్న అరవై తాత్విక సిద్ధాంతాలలో ఒక్క వేదాంతం తప్ప మిగతావన్నీ భౌతికవాద, నాస్తికవాద తాత్విక సిద్ధాంతాలేనని తత్వశాస్ర్త చరిత్రకారుడు దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ తెలిపారు.

ఎం.ఎన్‌.రాయ్‌గా ప్రసిద్ధి చెందిన మానవేంద్రనాథ్‌ రాయ్‌ తీవ్ర జాతీయవాదిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి, చివరకు పరిపక్వత చెందిన రాడికల్‌ హ్యూమనిస్టు తత్వవేత్తగా రూపాంతరం చెందాడు. 1848లో కమ్యూనిస్టు మ్యానిఫెస్టో విడుదల కాగా, వంద సంవత్సరాల తరువాత 1947లో రాడికల్‌ హ్యూమనిస్టు మ్యానిఫెస్టోను రాయ్‌ విడుదల చేశాడు. మానవవాద భావాలకు సమగ్రమైన రూపాన్నిస్తూ తన సిద్ధాంతాన్ని 22 సూత్రాల రూపంలో ప్రతిపాదించాడు. వాటిలో మొదటి ఆరు సూత్రాలు ఆధునిక విజ్ఞానశాస్త్ర రీత్యా రాడికల్‌ హ్యూమనిజం ప్రతిపాదించే తాత్విక భావాలను తెలియజేస్తాయి. ఆ తరువాతి ఎనిమిది సూత్రాలు కాలం చెల్లిపోయిన రాజకీయార్థిక సిద్ధాంతాలలోని లోపాలను విశ్లేషించి వివరిస్తాయి. చివరి ఎనిమిది సూత్రాలు హ్యూమనిస్టు రాజకీయార్థిక సామాజిక నిర్మాణాన్ని ప్రతిపాదిస్తాయి. అనేక దేశాలలో హ్యూమనిస్టు భావజాలం ప్రచారంలో ఉన్నప్పటికీ అవన్నీ కేవలం తాత్విక భావాలకో, లౌకిక భావాలకో పరిమితమైపోయి ఉన్నందువల్ల రాయ్‌ తాను ప్రతిపాదించిన హ్యూమనిజానికి సమగ్రమైన రూపాన్నిచ్చాడు. అందుకే దానికి రాడికల్‌ హ్యూమనిజమని, న్యూ హ్యూమనిజమని పేరు పెట్టాడు.


మానవుడు ప్రకృతిలో అవిభాజ్యమైన భాగం. ప్రకృతిలోని నియమశీలత పరిణామక్రమంలో జీవజాతుల్లో ప్రవేశించింది. దాన్నే మనం హేతుత్వం అంటున్నాం. అది వృక్షజాతుల్లో సహజాత రూపంలోను, మానవుడిలో విచక్షణ రూపంలోను దర్శనమిస్తుంది. ఆ హేతుత్వం ఆధారంగానే మానవుడు ప్రకృతిని పరిశీలించి, పరిశోధించి, అనుభవపూర్వకంగా అనేక విషయాలను అర్థం చేసుకుని జ్ఞానార్జన చేస్తున్నాడు. జ్ఞానతృష్ణతో, సత్యాన్వేషణాసక్తితో, స్వేచ్ఛాపిపాసతో మానవుడు చేసేదంతా తన మనుగడకు, భవితవ్యానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడమే. ప్రతిదానికీ ఒక కారణం ఉంటుందనే భావనే శాస్త్రానికి, తత్వానికి పునాదిగా నిలిచింది.

నేడు భారత సమాజమంతా వేలాది మూఢవిశ్వాసాల ఊబిలో చిక్కుకుపోయి ఉంది. సనాతనధర్మం పేరిట, సంప్రదాయాల పేరిట తరతరాలుగా మూఢ విశ్వాసాలను సమర్థిస్తూ, ఆచరిస్తూ వస్తున్నాం. దేవుడి పేరుతో, మతం పేరుతో దోపిడీ కొనసాగుతూనే ఉంది. అవినీతికి ఆలవాలమైన రాజకీయ పార్టీలు దేవుడిని, మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. వేలాది సంవత్సరాలుగా శాంతియుతంగా సహజీవనం సాగిస్తున్న భిన్న మతస్థుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వ్యక్తులే సమాజ నిర్మాతలు. వ్యక్తులు లేకుండా సమాజానికి అస్తిత్వం ఉండదు. అందువల్ల వ్యక్తుల అభివృద్ధే సమాజాభివృద్ధికి మూలమవుతుంది. అందుకే మానవవాదం వ్యక్తివాదాన్ని ప్రతిపాదిస్తుంది. సమష్టి మిథ్యావాదాలు సమాజానికి హానికరంగా తయారయ్యాయి. కులం, మతం, వర్గం, జాతి, పార్టీ వంటి వాటికి అధిక ప్రాధాన్యమిస్తూ వ్యక్తిని పూర్తిగా విస్మరిస్తున్నారు. చాలా సందర్భాల్లో సమష్టి కోసం వ్యక్తులను బలిచేస్తున్నారు. వాస్తవానికి సమష్టి సిద్ధాంతాలన్నీ మిథ్యగా మిగిలిపోతున్నాయి.

వర్తమాన దేశ పరిస్థితులు అత్యంత భయానకంగా తయారయ్యాయి. ఒకవైపు అసమానతలకు, దోపిడీకి ఆలవాలంగా ఉన్న సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మార్గదర్శకంగా ఉన్న రాజ్యాంగంపై దాడి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. స్వతంత్రంగా కొనసాగవలసిన రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల సంఘం, సీబీఐ వంటి వాటిని పాలకపార్టీ లోబరచుకుని తన నియంతృత్వ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ప్రశ్నించే వారిని, ఎదిరించేవారిని అణగదొక్కి వారిపై అక్రమ కేసులు బనాయిస్తోంది. హింసాత్మక విధానాలకు పాల్పడుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి హేతువాద, మానవవాద భావవిప్లవమే శరణ్యం.


సైన్సు ఆవిష్కరించిన పరికరాలను వాడుకుంటూ, ఫలితాలను అనుభవిస్తూ ఉన్న ప్రజలు శాస్త్రీయతత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. శాస్త్రీయ దృక్పథానికి ఆమడదూరంలో ఉన్నారు. పౌరాణిక కల్పిత కథలను చారిత్రక వాస్తవాలుగా భావిస్తున్నారు. పౌరాణిక పాత్రలను చారిత్రక వ్యక్తులుగా భ్రమిస్తున్నారు. ఇటువంటి భ్రమల నుంచి ప్రజలను బయటపడేయడానికి హేతువాద, మానవవాద భావవిప్లవం ద్వారా వారిని చైతన్యవంతం చేయాలి.

గుమ్మా వీరన్న

అధ్యక్షులు, భారత హేతువాద సంఘం

(ఆగస్టు 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ సమీపంలోని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో భారత హేతువాద సంఘం 95వ వార్షికోత్సవాలు)

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 05:21 AM