Share News

‘అనంత’ సంపద అవసరమిప్పుడు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:25 AM

ఇరాన్–అమెరికా యుద్ధానంతర పరిస్థితుల్లో ముడి చమురు ధరలు పెరిగి, విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రజలను బంగారం కొనుగోలు తగ్గించాలని కోరుతోంది. అయితే మరోవైపు...

‘అనంత’ సంపద అవసరమిప్పుడు!

ఇరాన్–అమెరికా యుద్ధానంతర పరిస్థితుల్లో ముడి చమురు ధరలు పెరిగి, విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రజలను బంగారం కొనుగోలు తగ్గించాలని కోరుతోంది. అయితే మరోవైపు కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయ భూగర్భ గదుల్లో అపారమైన బంగారం, వజ్రాలు, ఆభరణాలు నిక్షిప్తమై ఉన్నాయని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆలయంలోని అనేక గదులు తెరచి వాటిలో ఉన్న నిధులను గుర్తించినప్పటికీ, ‘వాల్ట్–బి’ మాత్రం ఇప్పటికీ మూసే ఉంది. దానిని తెరిస్తే దేవుని శాపం వస్తుందని, దానికి నాగబంధనం ఉందని, సర్పాలు కాపలా కాస్తున్నాయని, విపత్తులు సంభవిస్తాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ వాదనల నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువలు, ప్రజా ప్రయోజనం వంటి అంశాలు ముందుకు వస్తున్నాయి.

భారత రాజ్యాంగంలోని అధికరణ 51ఎ(హెచ్‌) ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణాత్మక మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచిస్తుంది. ఈ స్థితిలో శాపాలు, జ్యోతిష్య హెచ్చరికలు, నాగబంధనాల వంటి విశ్వాసాల ఆధారంగా జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం సరైనదా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. భక్తుల విశ్వాసాలను గౌరవించడం అవసరమే. కానీ విశ్వాసం పేరుతో సంపదను శాశ్వతంగా పరిశీలనకు దూరంగా ఉంచడం, దాని లెక్కలు ప్రజలకు తెలియకుండా చేయడం, దాని భద్రతపై సందేహాలకు అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. గతంలో కొన్ని ఆస్తులు అదృశ్యమయ్యాయనే ఆరోపణలు, సొరంగ మార్గాలపై వచ్చిన ప్రచారాలు కూడా పారదర్శకత అవసరాన్ని మరింత బలపరుస్తున్నాయి.


‘వాల్ట్–బి’ని తెరవాలా వద్దా అనే ప్రశ్నను మూఢనమ్మకాల కోణంలో కాకుండా, శాస్త్రీయ, పురావస్తు, భద్రతా ప్రమాణాల ఆధారంగా పరిశీలించాలి. నిర్మాణ భద్రత, వారసత్వ సంరక్షణ, భక్తుల భావోద్వేగాలు, చట్టపరమైన అంశాలు వంటివాటినీ పరిగణనలోకి తీసుకుని నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు జరపవచ్చు. రాజులు, మహారాజులు కూడబెట్టిన సంపదలు ప్రజా పర్యవేక్షణకు అతీతంగా, కేవలం పురాణ భయాల ఆధారంగా శాశ్వతంగా మూసివేయాలా? లేక పారదర్శక లెక్కలతో, వారసత్వ సంపదగా సంరక్షించాలా? అనే అంశంపై దేశవ్యాప్తంగా హేతుబద్ధమైన చర్చ అవసరం. భక్తి వ్యక్తిగత విశ్వాసం కావచ్చు. కానీ, ప్రజా ఆస్తుల నిర్వహణ, భద్రత, లెక్కలు, పారదర్శకత వంటి విషయాలు రాజ్యాంగ విలువలు, శాస్త్రీయ దృక్పథం, ప్రజా ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయించాలి. అప్పుడు మాత్రమే విశ్వాసానికి, రాజ్యాంగానికి గౌరవం దక్కి... రెండూ సమానంగా నిలబడతాయి.

కె. నారాయణ

చైర్మన్, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 12:25 AM