ఎంఎన్ రాయ్ చూపిన నవ్య మానవవాద మార్గం
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:52 AM
భారతదేశ ఆధునిక మేధోచింతనలో హేతువాద– మానవవాదాలను ప్రతిపాదించిన అరుదైన తత్వశాస్త్రవేత్త మానవేంద్రనాథ్ రాయ్ (ఎంఎన్ రాయ్). విప్లవకారుడిగా జీవితాన్ని ప్రారంభించి...
భారతదేశ ఆధునిక మేధోచింతనలో హేతువాద– మానవవాదాలను ప్రతిపాదించిన అరుదైన తత్వశాస్త్రవేత్త మానవేంద్రనాథ్ రాయ్ (ఎంఎన్ రాయ్). విప్లవకారుడిగా జీవితాన్ని ప్రారంభించి, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నారు. భారతదేశ కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించి, అది సరైన పని కాదని అనుభవం మీద తెలుసుకొని వదిలేశారు. ‘‘మతం వలే పార్టీలు కూడా మానవస్వామ్యానికి, ప్రజాస్వామ్యానికి శత్రువులవుతాయ’’ని గ్రహించి, తాను నిర్మించిన రాడికల్ డెమొక్రటిక్ పార్టీని రద్దు చేసి, చివరికి ‘మానవవాద తత్వాన్ని’ ప్రపంచ మానవాళికి అందించడానికి ‘రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమానికి’ ఊపిరిలూదారు.
బాల్యంలోనే విప్లవశీలత్వం వైపు తొలి అడుగులు వేసిన రాయ్ అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. 1887 మార్చి 21 న బెంగాల్‌లో జన్మించారు. పిన్న వయసులోనే అప్పటి బెంగాల్ విప్లవోద్యమం, వందేమాతర ఉద్యమ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. మొదటి దశలో ఆయన ‘తీవ్ర జాతీయవాది’. ఆయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం, పౌరులకు స్వేచ్ఛ సాధ్యమని భావించారు. ఆయుధాల సేకరణకు అమెరికా, మెక్సికోలకు వెళ్లినపుడు మార్క్సిజం పరిచయమయింది. ఆయన ఆలోచనా ప్రపంచంలో ఇది ఒక కీలక మలుపు. మెక్సికో విప్లవోద్యమంలో పాల్గొని ‘‘మెక్సికో కమ్యూనిస్టు పార్టీ స్థాపకులలో ఒకరు’’గా నిలిచారు. తరువాత సోవియట్ యూనియన్ లోని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కార్యకలాపాల్లో పాల్గొని, కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రపంచ స్థాయి రాజకీయాల్లో ఉపయోగించడానికి కృషి చేశారు. మార్క్సిజం లోని ఆచరణాత్మక సమస్యలు, వ్యక్తి స్వేచ్ఛ మీద పడే నీడలపై ఆయన చేసిన విమర్శలు లోతైనవి.
1930లో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పాత కేసులపై రాయ్‌ను జైల్లో పెట్టింది. కానీ ఆయన మానసిక దృక్పథంలో ఇది కీలక మలుపు అయింది. జైలులో ఆయన విప్లవకారుడి కాలాన్ని దాటి ఒక ఆలోచనకర్తగా, తత్వవేత్తగా మారారు. ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ఎంఎన్ రాయ్ మార్క్సిజాన్ని విమర్శనాత్మకంగా అధ్యయనం చేసి, మానవ స్వేచ్ఛ, వివేకం, నైతికత కేంద్రంగా ఉన్న కొత్త తత్త్వాన్ని గురించి ఆలోచించారు. ఆయన రూపొందించిన రాడికల్ హ్యూమనిజం భారతీయ తత్త్వచింతనలో ఒక విప్లవం.
రాయ్ దృష్టిలో మనిషి, మనిషి స్వేచ్ఛకే విలువ. మతం, రాజకీయం, సమాజం– ఏ వ్యవస్థ అయినా వ్యక్తి స్వేచ్ఛను కాపాడాలే కానీ హరించకూడదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బలపడాలంటే వివేకం, హేతువాదం, మానవ అభివృద్ధి పునాదులని ఆయన సూచించారు. దైవం, భక్తి, సంప్రదాయం, మూఢనమ్మకాల బదులు మనుషుల ఆలోచనలు– ప్రశ్నించడం, వివేచన, ఆధునిక విజ్ఞానశాస్త్రం ఆధారంగా సాగాలని ఆయన సూచించారు. కానీ నేడు మతం, మూఢనమ్మకాలు మరింతగా విస్తృతం కావడానికి దైవం మీద భయం, భక్తి కారణమవుతున్నాయి. ఆధునిక మానవుడు అనాది మనిషి కంటే ఎక్కువ అభద్రతా భావాన్ని, ఆత్మన్యూనతా భావాన్ని అనుభవిస్తున్నాడు. ఇది క్రమంగా మానవ వ్యక్తిత్వ హననానికి దారితీస్తోంది.
మానవ సమాజంలో ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ వ్యవస్థ కాదని, అది మానవ సంబంధాల నైతిక విలువల అల్లిక అని రాయ్ స్పష్టం చేశారు. ప్రశ్నించడం, పరిశీలించడం, ప్రయోగాలు, ఆధారాలు– ఇవే మానవ చైతన్యానికి దిక్సూచి అని ఆయన భావించారు. రాడికల్ హ్యూమనిజం ఆయన మనకందించిన అత్యంత శాస్త్రీయ, మానవీయ బహుమతి. భారతదేశంలో భావ పునర్వికాసానికి హేతువాద, మానవవాదాల ఉద్యమాలు కీలకమని ఆయన తీర్మానించారు.
స్వేచ్ఛ, విముక్తి, ప్రజాస్వామ్యం, నైతికతల మీద రాయ్ పుస్తకాలు ఎప్పటికీ ప్రేరణాత్మకమైనవే. సుమారు తొమ్మిదివేల చేతివ్రాత పేజీలు భద్రంగా ఉన్నాయంటేనే ఆయన అతి తక్కువ కాలంలో ఎంత సాహిత్యం మనకందించారో అర్థమవుతోంది. రాజకీయాల్లో రాయ్ చేసిన ప్రయోగాలు ఎవరూ చేయడానికి సాహసించరు. సామాన్య ప్రజలు రాజకీయాల్లో చురుకుగా ఆలోచించి పాల్గొన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని, దానికి ఆచరణాత్మక ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రజలలో హేతుబద్ధమైన ఆలోచన పెంపొందకపోతే ప్రజాస్వామ్యం కూడా మానవ విరోధక శక్తుల చేతికి వెడుతుందని ఆయన చేసిన హెచ్చరికలు నేడు నిజమనిపిస్తోంది. విద్యను కేవలం వృత్తి సాధనంగా కాక, భావ సంకెళ్ళ విముక్తి సాధనంగా చూశారు. మనసులో, మెదడులో కూరుకుపోయిన అశాస్త్రీయ, అమానవీయ అంశాలతో పాటు, సంపూర్ణమైన అజ్ఞానం విధ్వంసం కావాలని రాయ్ సూచించారు. అందుకే ఆయన ‘‘విద్యావంతులను వివేకవంతులను చేయండి’’ అన్నారు. ఆయన ఆలోచించిన విద్య సారం– మతం నుంచి మనిషికి మానసిక విముక్తి లభించడమే. 1954 జనవరి 25న మరణించే దాకా ఆయన రచనలు చేయడం ఆపలేదు. ఇప్పటికీ ఆయన ఆలోచనలు భారతీయ మేధో ప్రపంచాన్ని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వతంత్ర చింతనాపరులను, వ్యక్తులను నిరంతరం ప్రభావితం చేస్తున్నాయి.
ఎంఎన్ రాయ్ ఆలోచనల, ఆచరణల అనివార్యత రోజురోజుకూ పెరుగుతోంది. దేశానికి నేడు ఆయన ఆలోచనల ఆవశ్యకత ఉంది. ఎందుకంటే– మతపరమైన మూర్ఖత్వం పెరుగుతోంది. వ్యక్తి స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్న ఈనాటి రాజకీయ నేపథ్యంలో రాడికల్ హ్యూమనిజం అవసరం. విజ్ఞాన శాస్త్ర స్ఫూర్తిని మరిచి విద్యార్థుల పాఠ్య ప్రణాళికలపై మత చారలు పోవాలంటే రాయ్ ఆలోచనల ఆవశ్యకత పెరుగుతోంది.
n కె. శ్రీనివాసాచారి
తెలంగాణ హేతువాద సంఘం అధ్యక్షులు
(మార్చి 21: మానవేంద్రనాథ్ రాయ్ జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం
జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News